నాలుగు రోజుల్లోనే నిండిన చెరువులు, కుంటలు
వరద ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన మంత్రి ఈటల
ఉత్తర తెలంగాణలో కనివిని ఎరుగని రీతిలో వర్షం కురిసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా నాలుగు రోజుల్లోనే చెరువులు కుంటలు జలాశయాల నిండాయని పలు చోట్ల చెరువులకు, కాలువలకు గండ్లు పడి రోడ్లు దెబ్బతిని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయిని చెప్పారు. కలెక్టర్ శశాంక, జడ్పి చైర్ పర్సన్ విజయతో కలిసి మంత్రి జమ్మికుంట, హుజురాబాద్ ఏరియాలో వరదల పరిస్థితిని పరిశీలించారు. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీఎం కేసీఆర్ మంత్రులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని తెలిపారు. గ్రామాల వారిగా పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లు తెగిన చెరువు కుంట కట్టలు, జలాశయాల పరిస్థితిని,
ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించాలని అధికారులను ఆదేశించామని అందులో భాగంగా తాను హుజూరాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల్లో పర్యటించినట్లు చెప్పారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పర్యటించి నష్ట అంచనాలు వేస్తున్నారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి వరద తగ్గిన తర్వాత సహాయక చర్యలు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు రైతులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సీఎం కేసీఆర్ వర్షం, వరదల పై ఈరోజు సక్ష ఏర్పాటు చేశారని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి ప్రత్యేక బృందాలు పంపిస్తున్నారని అవసరం ఉన్న చోట ప్రజలను షెల్టర్లకు తరలించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రాబోవు 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్షాలు ఉంటాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల కోరారు. జిల్లాలోనే పెద్ద చెరువుల్లో ఒకటైన సంగెం మండలంలోని ఎల్గూరు రంగంపేట చెరువును పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. పుష్కర కాలంతో చెరువు మత్తడి పోస్తుండటం సంతోషంగా ఉందన్నారు. దీంతో పంటలకు ఢోకా ఉండదన్నారు. అనంతరం చెరువు మత్తడి వద్దకు చేరుకొని గంగమ్మకు పూలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే చేపలు పడుతున్న మత్స్యకారులతో ఎమ్మెల్యే కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వరంగల్ మహానగరంలో వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎడతెరపి కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలం కాగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం అంతా సహాయక, పునరావాస చర్యల్లో వేగం పెంచింది. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. కమలాపూర్ మండలంలో పలు గ్రామాల్లో వరదలకు దెబ్బ తిన్న ప్రాంతాలను ఈటల పరిశీలించారు. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. అధిరాలకు పలు సూచనలు చేశారు. ఎవరూ అధైర్యపడొద్దని అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆస్తిప్రాణ నష్టం జరక్కుండా చూడాలి
పోలీస్ అధికారులకు డిజిపి ఆదేశాలు
వర్షాలు, వరదల వల్ల సాధ్యమైనంత వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రుతుపవనాలు దేశమంతటా విస్తరించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలపై పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులు అప్రమత్తంగా వున్నారు, వరంగల్ నగరం వరదలతో జలదిగ్బంధం అయింది. నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఐదురోజులుగా కురుస్తున్న వానలతో వరంగల్ వర్షపునీటిలో చిక్కుకుపోయింది. వరంగల్ నగర వాసులు మూడు రోజులుగా నీళ్లలోనే నానుతున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.వరంగల్, కరీంనగర్ ప్రధాన రహదారి అయిన నయీంనగర్ రహదారిపై భారీగా వరద ప్రవహిస్తూనే ఉంది. హైదరాబాద్కు చెందిన మూడు డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం వరంగల్లో సేవలు అందిస్తున్నాయి.