Take a fresh look at your lifestyle.

ఎపిలో ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు

  • కోస్తా తీరం వెంబడి బలమైన ఈదరుగాలులు
  • శ్రీకాకుళం జిల్లాలో 25.5 మిల్లీటర్ల సగటు వర్షపాతం
  • కర్నూలు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
  • శ్రీశైలం జలాశయంలోకి కొనసాగుతున్న వరద

అమరావతి,జూలై22 : వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.- 7.6 కి. మధ్య విస్తరించింది. దీని ప్రభావంతో ఈ నెల 23న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ ‌స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40 కిలోటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వివరించారు. కోస్తాలో గురువారం చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పలుచోట్ల పొలాల్లో నీరు చేరింది. ఈదురు గాలులకు విద్యుత్తు వైర్లు తెగిపడి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో 25.5 మిల్లీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు బూర్జ మండలంలో వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. విశాఖ జిల్లా ఏజెన్సీలోని హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని ముంతాగుమ్మి, బిర్రిగూడ వాగుల ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 26 గ్రామాల గిరిజనులు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.

కర్నూలు జిల్లాలో 53 మండలాలకుగాను 48 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో 6.3 మిల్లీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, వెల్దుర్తి మండలంలో అత్యధికంగా 24 మిల్లీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పలు రోడ్లు జలమయ మయ్యాయి. ఏజెన్సీలోని రాజవొమ్మంగి, మారేడుమిల్లి, చింతూరు, విఆర్‌.‌పురం మండలాల్లో వాగులు
పొంగి ప్రవహించాయి. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులు పడ్డాయి. సాయంత్రం వర్షం జోరందుకుంది. దీంతో, నారుమళ్లు మళ్లీ ముంపునకు గురవుతా యేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగెనపూడి బీచ్‌, ‌కోడూరు మండలం హంసలదీవి వద్ద బీచ్‌లలో అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. తూర్పు కృష్ణా ప్రాంతంలో ఈ ఏడాది ఎక్కువగా వరిలో వెదసాగును చేపట్టారు.

వర్షాలతో వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. ముసుగు రెండు, మూడు రోజులు కొనసాగితే నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తుంపర్లు పడ్డాయి. వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి, మోస్తరు వర్షాలు పలు చోట్ల, భారీ నుంచి అతిభారీ వర్షాలు కొన్నిచోట్ల పడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నారు. దీంతో కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి. బుట్టాయి గూడెం మండలం కొవ్వాడ , జల్లేరు ,అల్లి కాల్వలు  పొంగి ప్రవహిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం లోని పట్టినపాలెం వద్ద దొరమామిడి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  జీలుగుమిల్లి – బుట్టయిగూడెం రోడ్డుపై ఈదురు గాలులకు భారీ వృక్షం నేలకొరిగింది.  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.  వర్షాలకు కాలువలు  ఇంకా పొంగే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనదారులు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటిప్రవాహం కొనసాగుతోంది.

జూరాల నుంచి 12,829 క్యూసెక్కుల నీరు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 33,130, సుంకేసుల నుంచి 2,215 క్యూసెక్కుల నీటితో కలిపి మొత్తం 48,174 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టిఎంసిలు కాగా బుధవారం సాయంత్రం నాటికి నీటి నిల్వ 67.8401 టిఎంసిలుగా ఉంది. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 843.70 అడుగులుగా ఉంది. ఎపి జల విద్యుతుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించ లేదు. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 28,252 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

Leave a Reply