Take a fresh look at your lifestyle.

మరోమారు హైదరాబాద్‌లో భారీ వర్షం

  • ఉరుములు మెరుపులతో దంచికొట్టిన వాన
  • కోలుకోక ముందే లోతట్టు ప్రాంతాలు మళ్లీ జలమయం
  • హుస్సేన్‌ ‌సాగర్‌కు భారీగా వరద
  • మీర్‌పేట చెరువుకు గండి పడిందంటూ పుకార్లు..పర్యవేక్షించిన మంత్రి సబిత

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో కురిసిన కుండపోత వానకు రోడ్లు జలమయం అయ్యాయి. దట్టమైన మేఘాలు కమ్ముకున్న ఆకాశంతో నగరంలో చీకట్లు అలముకున్నాయి. ఉదయం నుంచి భాగ్యనగరంలో దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. నగరమంతా పట్టపగలే చీకటి కమ్ముకుంది. ఉరుములు, మెరుపులతో హడలెత్తించింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం దంచికొట్టింది. పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వానల నేపథ్యంలో జీహెచ్‌ఎం‌సీ అధికారులు, డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు అప్రమత్తం అయ్యాయి. నగర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. అత్యవసర సేవల కోసం 100కు డయల్‌ ‌చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలతో పాటు శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌లోకేశ్‌ ‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. హుస్సేన్‌ ‌సాగర్‌ ‌నిండు కుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Heavy rain again in Hyderabad

హుస్సేన్‌ ‌సాగర్‌ ‌జలాశయంలోకి 1,560 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో తూముల ద్వారా 2,098 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హుస్సేన్‌ ‌సాగర్‌ ‌జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 513.67 మీటర్లకు చేరింది. హైదరాబాద్‌ ‌నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోయర్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌ ‌ప్రజలను అప్రమత్తం చేశారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను బయటకు రానివ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్‌కే పురం, సైదాబాద్‌, ‌దిల్‌సుఖ్‌ ‌నగర్‌, ‌చైతన్యపురి, సరూర్‌నగర్‌, ‌కొత్తపేట, సంతోష్‌ ‌నగర్‌, ‌చార్మినార్‌, ‌ఫలక్‌నూమా, జూపార్క్, అప్జల్‌గంజ్‌, ‌బహదూర్‌పురా, మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి, మదాపూర్‌, ‌కొండాపూర్‌, ‌హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, ‌ఖైరతాబాద్‌, ‌పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్‌, ‌కూకట్‌పల్లి, బాలానగర్‌, ‌బోయిన్‌పల్లి, అల్వాల్‌, ‌తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్‌, ‌కుషాయిగూడ, నాగారం, దమ్మయిగూడ, చర్లపల్లి, నల్లకుంట, అంబర్‌పేట, ముషీరాబాద్‌, ‌నారాయణగూడ, కోఠి, లక్డీకాపూల్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో రిజర్వాయర్ల వద్ద ఉన్న పర్యాటక శాఖ బోట్లను హైదరాబాద్‌కు ప్రభుత్వం తెప్పించింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. మొత్తం 53 బోట్లను హైదరాబాద్‌కు తెప్పించింది.

మీర్‌పేట చెరువుకు గండి పడిందంటూ పుకార్లు..పర్యవేక్షించిన మంత్రి సబిత

sabitha indra reddyమంగళవారం మరోమారు భారీ వర్షం కురవడంతో నగర ప్రజలు వణికి పోయారు. వరుస వర్షాలతో స్థానిక ప్రజానీకం తీవ్ర స్థాయిలో ఆందోళనకు గురయింది. దీనికితోడు మీర్‌పేట చెరువుకట్టకు గండి ఏర్పడిందన్న వార్తతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే నగర పరిధిలోని మీర్‌పేట పెద్ద చెరువు కట్ట తెగలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మీర్‌పేట చెరువు కట్ట తెగినట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆమె పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియో మంత్రాలయం చెరువుది అని తేల్చిచెప్పారు. భారీ వరద నేపథ్యంలో ఆ చెరువు కట్టకు మరమ్మతులు చేశామని తెలిపారు. మీర్‌పేట పరిధిలోని ప్రజలెవరూ ఆందోళనకు గురి కావొద్దని మంత్రి భరోసా కల్పించారు.మీర్‌పేటలో సహాయక చర్యలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించి, ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. కట్ట తెగిందన్న ప్రాంతంలో ఇసుక బస్తాలను వేయించి నీరు బయటకు రాకుండా చేశారు.

భారీ వర్షాలకు కూలిన పాత ఇళ్లు
భారీ వర్షాలకు బషీర్‌ ‌బాగ్‌ ‌స్కైలెన్‌ ‌థియేటర్‌ ‌లైన్‌ ‌లోని ఓల్డ్ ‌కామేల బస్తీలో రెండు ఇల్లులు కూలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వర్షాలకు ఇళ్లు కూలిపోవడంతో అదే వీధిలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను జిహెచ్‌ఎం‌సి అధికారులు జేసిబి సాయంతో కూల్చివేశారు. ఇల్లు కూలిపోయి నిరాశ్రయులుగా మారిన తమని ప్రభుత్వం గానీ, అధికారులు కానీ పట్టించుకోవడంలేదని బాధితులు వాపోయారు. ఉండడానికి ఉన్న నీడ కూడా కోల్పోయి రోడ్డున పడ్డామని..ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply