Take a fresh look at your lifestyle.

జలాశయాలకు భారీగా వరదనీరు

  • వాగులు, వంకలు పొంగిపర్లుతుండడంతో రాకపోకలకు ఇక్కట్లు
  • భారీవర్షాలతో పలు చోట్ల నీట మునిగిన పంటలు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు పోటెత్తడంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా, హిమాయత్‌ ‌సాగర్‌ ‌వద్ద ఔటర్‌ ‌రింగురోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పంటలు నీట మునిగి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పలు చోట్ల విద్యుత్‌ ‌స్తంభాలు, చెట్లు నేలకూలాయి. జహీరాబాద్‌ ‌ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. మంజీరా నదికి వరద పోటెత్తడంతో.. మంజీరా రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. జహీరాబాద్‌ ‌మండలం, సత్వార్‌ ‌గ్రామ సపంలోని వాగులో గల్లంతైన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సాగర్‌కు కొనసాగుతున్న వరద
నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతంతో పాటు జలాశయం పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఎనిమిది క్రస్ట్ ‌గేట్లను పది ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్‌కు 1,55,291 క్యూసెక్కుల ప్రవహం వస్తుండగా..అదే మొత్తాన్ని దిగువకు విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 309.6546 టీఎంసీల నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.20 అడుగుల మేర నీరుంది. పుల్కల్‌ ‌మండలం సింగూర్‌ ‌ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్ట్ ‌పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.027 టీఎంసీల మేర నీరుంది. ప్రస్తుతం 52వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తోంది. జలాశయానికి ప్రస్తుతం భారీగానే వరద వస్తోంది. ప్రవాహం ఇలాగే కొనసాగితే మూడు నాలుగు రోజుల్లో పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply