Take a fresh look at your lifestyle.

అకాల వర్షాలతో.. భారీగా దెబ్బతిన్న వరి, మిర్చి పంటలు

  • వర్షంతో కొట్టుకుపోయిన పంటలు
  • గాలివానతో నేలరాలిన మామిడి కాయలు

వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం బలహీనపడింది. మరాఠ్వాడ నుంచి ఉత్తర ఇంటీరియర్‌ ‌కర్ణాటక వరకు గాలి విచ్ఛిన్నతి ఏర్పడింది. దీని ప్రభావంతో సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్‌, ‌సిద్దిపేట, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ‌రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లోని పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. 17 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసినట్టు టీఎస్‌డీపీఎస్‌ ‌వెల్లడించింది. ఈ వానలు రెండ్రోజులు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది.

గంటకు 30-40 కిలోమిటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నది. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో కోతకు వొచ్చిన వరిదెబ్బతింది. అలాగే మామిడి కాయలు నేలరాలాయి. మిర్చిపంట నీట మునిగింది. కల్లాల్లో ఉన్న మిర్చి, వరిధాన్యం కొట్టుకుపోయింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. జీహెచ్‌ఎం‌సీ అధికారులు, మున్సిపల్‌, ‌డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బందిని అప్రమత్తం చేశారు. కరీంనగర్‌ ‌జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈ దురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి రైతులు పండించిన ధాన్యం ఒక్క వానతో నేలపాలైంది. హుజురాబాద్‌, ‌శంకరపట్నం మండలాల్లో వ్యవసాయ మార్కెట్‌, ‌రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.

దీంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అంతేకాదు శంకరపట్నం మండలంలో ఈదురుగాలులకు మామిడి కాయలు నేలరాలగా, పలుచోట్ల చెట్లు విరిగాయి, విద్యుత్‌ ‌స్తంభాలు కూడా నేలకు కొరగడంతో జిల్లాలో పలుచోట్ల విద్యుత్‌ అం‌తరాయం ఏర్పడింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది. తడిసిన కల్లాల్లో ఆరబోసిన మిర్చి, పసుపు పంట చేతికి అందే సమయంలో ఆకాల వర్షం కలిగించిన నష్టంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ వర్షం నష్టం చేకుర్చే వానంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల మొక్కజొన్న, వరిపంట అనేక చోట్ల గాలికి నెలకు వాలయి. మామిడి కాయలు నేలపాలయ్యాయి.

కామారెడ్డి: దోమకొండ బిబిపేట మండలాల్లోని ఐదు గ్రామాల్లో పంటపోలాలు నీటమునిగాయి. కాళేశ్వరం వాటర్‌తో మానేరు డ్యామ్‌ ‌నిండటంతో..డ్యామ్‌ ‌బ్యాక్‌ ‌వాటర్‌తో 400 ఎకరాలకు పైగా పంట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయానికి ఇలా పంటలోకి నీరు రావడంతో ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల పాటు నీటి విడుదల ఆపాలని రైతులు అధికారులను కోరారు. నీటి విడుదలను ఆపకపోతే..ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాల్సివుంటుందని రైతులు హెచ్చరించారు.

Leave a Reply