Take a fresh look at your lifestyle.

వేడెక్కుతున్న విశాఖ ఉక్కు పోరాటం

  • కేంద్ర నిర్ణయంపై మండిపడుతున్న కార్మిక సంఘాలు
  • నేడు విశాఖలో భారీ ర్యాలీకి నేతల కసరత్తు

విశాఖపట్టణం,జూలై 9 : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్తుండగా, అదే స్థాయిలో కార్మికవర్గం ప్రతిఘటన ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దీనిని అడ్డుకునేందుకు అన్ని పార్టీలు రంగం సిద్దం చేస్తున్నాయి. కార్మిక సంఘాలు ఈ విషయంలో ముందున్నాయి. కేంద్రం కార్యరంగంలోకి దదిగకుండా సమిష్టిగా పోరాడాలని నిర్ణయించారు. ప్రైవేటీకరణ పక్రియ సాఫీగా సాగేందుకు కావాల్సిన సూచనలు ఇచ్చేందుకు న్యాయ సలహాదారులను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను టెండర్లను విడుదల చేసింది. న్యాయ సలహాదారులుగా పని చేయాలనుకునే సంస్థలు ఈ నెల 28వ తేదీలోపు బిడ్లు దాఖలు చేయాలని పేర్కొంది. నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్‌ ‌మెయిన్‌ ‌గేట్‌ ‌వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గేట్‌కు అడ్డంగా బైఠాయించారు. వరుసగా రెండోరోజు కూడా కార్మికులు కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మరోవైపు కార్మికుల నిరాహారదీక్షలు సాగుతున్నాయి. ఆ సమయంలో విధులకు హాజరయ్యే కార్మికులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఆందోళనలో భాగస్వాములయ్యారు. మొత్తంగా కార్మిక సంఘాలు కూడా కలసి రావడంతో స్టీల్‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం వేడెక్కుతోంది.

స్టీల్‌ప్లాంట్‌ ‌పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈ నెల పదో తేదీన నగరంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు పోరాట కమిటీ సమాయత్తమవుతోంది. స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్ ‌నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద గల గాంధీ విగ్రహం వరకు వేలాది మంది ఉద్యోగులు, కార్మికులతో ర్యాలీ నిర్వహించి, తమ నిరసనను ఢిల్లీకి తెలియసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా సహకరించాలని కార్మికవర్గం కోరుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉద్యమంలో పాల్గొనాలని, రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా పార్లమెంట్‌లో ఉక్కు ప్రైవేటీకరణ అంశం లెవనెత్తి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా ఒత్తిడి తేవాలని పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది. కర్మాగారం అమ్మకానికి సంబంధించి సలహాదారుల నియామకానికి తాజాగా ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేయడంతో ఉద్యోగులు, కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను అంగీకరించబోమని నినదించాయి. స్టీల్‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే ఇక్కడ ఉద్యమం ప్రారంభమయింది. ఉక్కు కార్మిక సంఘాలు, వివిధ అసోసియేషన్లు, అధికారుల సంఘాలు కలసి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడ్డారు. 148 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణపై పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనతో జాతీయ రహదారి దిగ్బంధం లాంటి కార్యక్రమాలు నిర్వహించిన తమ నిరసన తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నా కేంద్రం పట్టించుకోకుండా సలహాదారుల ప్రకటన చేయడంతో పోరాట కమిటీ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ ‌వద్ద ధర్నా చేస్తామని పరిరక్షణ పోరాట కమిటీ పేర్కొంది. ఈ నెల 21న ఢిల్లీ వెళ్లి జిల్లా ఎంపీలు ఎంవీవీ సత్యనా రాయణ, సత్యవతితో పాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడును కలిసి సహకరించాలని కోర నున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి రాజకీయ ప్రముఖులను కలిసి మద్దతు కూడగడతామని తెలిపారు. ఈ నెల పదిన కూర్మన్నపాలెం నుండి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు వేలాది మందితో బైక్‌ ‌ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 20న న్యూఢిల్లీ వెళ్లి పార్లమెంట్‌లోని అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకులను కలిసి మద్దతు కోరుతామన్నారు. ఢిల్లీలో అనుమతిని బట్టి ఈ నెల 26న పార్లమెంట్‌ ‌వద్ద రాజకీయ ప్రముఖలతో కలిసి ధర్నా చేస్తామని తెలిపారు.

Leave a Reply