Take a fresh look at your lifestyle.

హీటెక్కిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక

  • నేటి సాయంత్రంతో ముగియనున్న ప్రచారం
  • పోటాపోటీగా నేతల ప్రచారంతో ప్రజల్లో అయోమయం

హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కింది. ప్రచారానికి ఇక మిగిలింది ఒక్కరోజే రకావడంతో నేతలంతా ఇక్కడే మకాం వేసి ప్రచారాన్ని ఉధృతం చేశారు. టిఆర్‌ఎస్‌, ‌బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. విమర్శలతో ప్రజల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. విమర్శలు ప్రతివిమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రచారం వేడెక్కింది. ప్రలోభాలు కూడా శృతి మించాయి. బెరదింపుల పర్వం కూడా సాగుతుంది. మొత్తంగా బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుండగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కమలాపూర్‌లో ఈటల రాజేందర్‌ ఇం‌టింటి ప్రచారం చేశారు. హుజూరాబాద్‌లో ప్రలోభాల పర్వం కొనసాగుతుందన్నారు. ఊర్లను బార్లుగా మార్చి మద్యం ఏరులుగా పారిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఏ పార్టీలో ఉండాలో శాసించే స్థాయికి టీఆర్‌ఎస్‌ ‌వొచ్చిందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందన్నారు. మద్యం, నోట్ల కట్టలు, కుట్రలు, కుతంత్రాల పర్వం కొనసాగుతుందని ఈటల ఆరోపించారు. ఈటల రాజేందర్‌ ‌నేడు కమలాపూర్‌, ‌గూడూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈటలను చూసి ప్రజలు కంటతడి పెట్టుకున్నారు. వారిని చూసి ఈటల సైతం భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్‌ ‌కష్టాల్లోకి నెట్టాడా బిడ్డా అంటూ స్థానిక మహిళలు కంట తడిపెట్టారు. టీఆర్‌ఎస్‌కే వోటేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటలకే అండగా ఉంటామని, బాధ పడొద్దని భరోసా ఇచ్చారు. ఇదిలావుంటే అబద్ధాలు ఆడటంలో బీజేపీకి ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలని ప్రభుత్వ విప్‌ ‌బాల్క సుమన్‌ ‌విమర్శించారు. బీజేపీకి వోటు వేస్తే..హుజురాబాద్‌ ‌నాశనమైనట్లే నన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారే బీజేపీలో ఉంటున్నారని చెప్పారు. హుజురాబాద్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్నారు. సానుభూతి వోట్ల కోసం బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈటల రాజేందర్‌..‌భారీగా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీసీ సంఘాల రాష్ట్ర స్థాయి నేతలు సమావేశమయ్యారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో బీసీ వ్యతిరేకులకు గుణ పాఠం చెప్పాలని నిర్ణయించారు. గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌ను గెలిపించాలని బీసీ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. జాతీయ అధ్యక్షుడు ఆర్‌.‌కృష్ణయ్యపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించాలని హుజురాబాద్‌ ‌వోటర్లకు ఆర్‌.‌కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. హుజురాబాద్‌ ఎన్నికలను గిన్నిస్‌ ‌రికార్డు ఎక్కించాలని సిపిఐ నేత చాడ వెంకట్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంతలా ప్రచారం చేయడం గతంలో ఎక్కడా జరగలేదన్నారు. ఉప పోరులో అధికార పార్టీ పరిధి దాటి ప్రచారం సాగుతుందని, ప్రలోభాలు పెరిగాయని అన్నారు. ఈ ఎన్నిక అతి ఖరీదైనదిగా ఆయన అభివర్ణించారు. ఇకపోతే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు వోట్లేయకపోతే వికలాంగుల పింఛన్లు తొలగిస్తామని ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్‌ ‌ముత్తినేని వీరయ్యవర్మ తెలిపారు. ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో జరిగిన వికలాంగుల సమావేశంలో టీఆర్‌ఎస్‌కు వోట్లేయకుంటే పింఛన్లు కట్‌ ‌చేస్తామని వికలాంగుల కార్పొరేషన్‌ ‌మాజీ చైర్మన్‌ ‌వాసుదేవరెడ్డి చెప్పారన్నారు.

ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు వికలాంగులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ), డీజీపీలకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. వెంటనే ఆయనపై తగిన చర్యలు తీసుకుని వికలాంగ వోటర్లకు మనోధైర్యం కల్పించాలని ముత్తినేని కోరారు. ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి వోటు వేయకుంటే పింఛన్లు కట్‌ ‌చేస్తామన్న వికలాంగుల కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌వాసుదేవరెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్‌ ‌చేశారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో వికలాంగులతో సమావేశమై టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి వోటు వేయాలని హెచ్చరిస్తూ.. వోటు వేయని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని బెదిరించడం గర్హనీయమన్నారు. వాసుదేవరెడ్డి తక్షణమే వికలాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. వికలాంగులపై బెదిరింపులకు పాల్పడిన వాసుదేవరెడ్డిపై వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా టిఆర్‌ఎస్‌, ‌బిజుపి పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో కొనసాగుతున్న ప్రచార పర్వం నేటితో ముగియనుంది.

Leave a Reply