Take a fresh look at your lifestyle.

ఆరోగ్య తెలంగాణ… ప్రజల చేతుల్లోనే ఉంది

ఇల్లు, ఊరు శుభ్రంగా ఉంచుకోవాలి
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది…
త్వరలో గోదావరి నీళ్లు
వెంకటాపూర్‌ ‌సభలో
మంత్రి హరీష్‌ ‌రావు

సిద్ధిపేట రూరల్‌ ‌మండలం వెంకటాపూర్‌లో మంగళవారం రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటాపూర్‌కు వచ్చిన హరీష్‌రావుకు గ్రామస్థులు  బోనాలు, డప్పుచప్పుళ్ళు, కుంకుమ తిలకం దిద్ది ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు తరిగొప్పుల మల్లేశం-పుష్ప, యాదయ్య-సుశీల ఇండ్లలో రెండవ విడత పల్లె ప్రగతిలో భాగంగా చెత్త చెదారం పరిశీలించి వీలైనంత పరిశుభ్రంగా ఇళ్లు నిలుపుకోవాలని, పాత సామాన్లు, ఇంట్లో ఉన్న పాత చెత్త చెదారం తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ… మన ఊరు మనం పరిశుభ్రంగా నిలుపుకోవాలి. ఇళ్లు కూడా శుభ్రంగా నిలుపుకోవాలి. పనికి రాని చెత్త ఇంట్లో పెట్టుకోవద్దు. చెత్త ఉంటే ఇంట్లో బయట దోమలు పెరుగుతాయని, రెండవ విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని ఇళ్లలోంచి 100 ట్రాక్టర్లు చెత్త బయటకు వచ్చిందని, ఇదే పద్ధతిని నిరంతరం కొనసాగించాలని గ్రామస్తులను కోరారు. ]

జ్వరాలు లేని ఆరోగ్య వెంకటాపూర్‌, ఆరోగ్య సిద్ధిపేట నియోజకవర్గం, ఆరోగ్య తెలంగాణ కావాలని ఇదంతా మీ చేతుల్లోనే ఉందన్నారు. ట్రాక్టర్‌, ‌వాటర్‌ ‌ట్యాంకర్‌, ‌బ్లేడ్‌ ‌కొని ఇస్తాం. గ్రామాన్ని పరిశుభ్రంగా నిలపాలన్నారు. 120 ట్రాక్టర్ల చెత్తను ఒకేరోజు తీసివేశారు. వెంకటాపూర్‌ ‌గ్రామం శుభ్రంగా ఉంది. ఊరికి వచ్చే దారిలో పచ్చని చెట్లు కన పడ్డాయి. ప్రతి ఇంటింటికీ త్వరలోనే రెండు చెత్త డబ్బాలు పంపిణీ చేయిస్తాననీ అన్నారు. రెండు బుట్టలలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి ఇవ్వాలనీ, మోరీల్లో ప్లాస్టిక్‌ ‌గ్లాసులు, పనికి రాని చెత్త వేయవద్దు. దోమలు, ఈగలు మన ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త వహించండన్నారు. వెంకటాపూర్‌ ‌గ్రామానికి కొత్త ట్రాక్టర్‌ ఇచ్చామని, వెంకటాపూర్‌ ‌స్కూల్‌లో ఫర్నిచర్‌ ‌కావాలని కోరారని త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. రజక సంఘం, కుమ్మరి సంఘ కమ్యూనిటీ హాల్స్ ‌నిర్మాణాకి, సిసి రోడ్లు, మోరీలు కొత్త బడ్జెట్‌లో మంజూరు చేస్తానని హామీనిచ్చారు. వెంకటాపూర్‌లో ఇప్పటికే సగం రోడ్డు పూర్తయ్యిందని, మిగతా రోడ్డుకు నిధులు మంజూరు త్వరలోనే చేస్తానని చెప్పారు.

గతంలోనే విద్యుత్‌ ‌సబ్‌ ‌స్టేషన్‌ ‌మంజూరు చేసుకున్నామని, స్మశాన వాటికలో ఆర్‌డబ్ల్యూఎస్‌ఏఈ ‌నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని హరీష్‌ ‌రావు సూచించారు. గ్రామంలో 2 పాత బావులు పూడ్చాలని గ్రామస్తులు కోరగా, యుద్ధప్రాతిపదికన పూడ్చాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. వెయ్యి పింఛన్‌ 2‌వేల పింఛన్‌ ‌చేశామని, 50 వేల నుంచి లక్షా 116 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌పేరిట ఇస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తెచ్చి పేదల ప్రభుత్వంగా మారిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యిందని, త్వరలోనే కాలువల ద్వారా ఈ వెంకటాపూర్‌ ‌గ్రామానికి గోదావరి జలాలు రానున్నాయని., యాసంగి పంటకు నీరు అందుతుందని వెల్లడించారు. సంప్రదాయేతర పంటల వైపు దృష్టి సారించాలని, అందరూ వరి పంట వేయొద్దని., ఆరుతడి పంటలు వేయాలని., రెండవ పంట లాభదాయకంగా ఉంటుందని రైతులకు అవగాహన కల్పించారు. నెల రోజుల్లో సిద్ధిపేటకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని, రెండు పంటలు పండించి వెంకటాపూర్‌ ‌గ్రామం సస్యశ్యామలం అవుతుందని మంత్రి చెప్పారు. ఇంటింటికీ మరుగుదొడ్లు అందరూ వాడాలని, ప్రతి ఇంటి ముందు చెట్లు పెంచాలని, ఎన్ని మొక్కలు కావాలన్నా.. పంపిస్తామని తెలిపారు. గొర్రెలకు షెడ్‌ ‌కట్టాలని ఆలోచన చేసి, స్థలం వెతికి గొర్రెలకు హాస్టల్‌ ‌కడదామని గ్రామస్తులను కోరుతూ.. గొర్రెల హాస్టల్‌ ‌తో గ్రామం శుభ్రంగా మారి రోగాలు దూరమవుతాయని వివరించారు. ఇందుకోసం గొల్ల, కుర్మలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కమ్యూనిటీ హాల్స్, ‌గొర్రెలకు షెడ్‌ ‌కోసం స్థలాన్ని తహశీల్దార్‌ ‌సేకరించి ఇవ్వాలని., అలాగే గ్రామస్తులకు అందరికీ కలిపి ఓ ఫంక్షన్‌ ‌హాల్‌ ‌స్థలం చూడలని ఆదేశిం చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags: Health Telangana,harish rao,godavari water,venkatapuram,

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply