Take a fresh look at your lifestyle.

అధిక జనాభా అత్యాశలను అవని తీర్చ జాలదు..

“అధిక జనాభా వలన కలిగే సమస్యలు అనేకం. అందులో ముఖ్యమైనవి ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలు, పర్యావరణ సమస్యలు మొదలైనవి. భారతదేశానికి సంబంధించినంత వరకూ అధిక జనాభా వల్ల ఉత్పన్నమైన లేదా ఉత్పన్నమయ్యే సమస్యలను పరిశీలిద్దాం. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారోత్పత్తులు పెరగకపోవడం వల్ల ఆహార కొరత ఏర్పడుతుంది. తత్ఫలితంగా పౌరుల ఆరోగ్యం క్షీణిస్తుంది మరియు ఆహార పదార్థాలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడం అనివార్యమై దేశ ఆర్థిక పరిస్థితి చతికిలపడుతుంది. దాని పర్యవసానంగా అధిక జనాభాకు తగిన పనులు కల్పించలేని పరిస్థితి ఏర్పడి నిరుద్యోగం పెరిగిపోతోంది.”

క్షణక్షణం… ప్రతీ క్షణం… ప్రపంచాన జన ప్రభంజనం…. అన్నాడో అజ్ఞాత కవి. అతివృష్టి, అనావృష్టి రెండూ సమాజానికి ఎలా అనర్థదాయకమో… అత్యధిక జనాభా, అత్యల్ప జనాభా అనేవి కూడా సమాజ వికాసానికి పలు సమస్యలు సృష్టించడం సహజం. ఉదాహరణకు అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నందున పెద్ద వయస్సులో ఉన్న వారి జనాభా, చిన్న వయసులో ఉన్న లేదా పని చేసే వయస్సులోనున్న వారి జనాభా కంటే ఎక్కువగా ఉన్న సందర్భాలెన్నో యూరోపియన్‌ ‌దేశాల్లో చూడగలం. ఇలాంటి పరిస్థితి అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల్లో పూర్తి వ్యతిరేకంగా ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏటా జూలై 11 నాడు పాటించే ‘‘ప్రపంచ జనాభా దినోత్సవం’’ గురించిన విశేషాలు తెలుసు కోవడం సందర్భోచితం.

ప్రపంచ జనాభా దాదాపుగా 5 బిలియన్లు చేరుకున్నట్లుగా చెప్పబడుతున్న తేదీ 11 జూలై , 1987 ( ఫైవ్‌ ‌బిలియన్‌ ‌డే ) నాటి ప్రజల ఉత్సాహం నుండి ప్రేరణ పొంది ‘‘ప్రపంచ జనాభా దినోత్సవాన్ని’’ 1989 సంవత్సరంలో యునైటెడ్‌ ‌నేషన్స్ ‌డెవలప్మెంట్‌ ‌ప్రోగ్రాం వారి పాలకమండలి ( గవర్నింగ్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌యు.ఎన్‌.‌డి.పి) స్థాపించింది. జనాభా సమస్యలు, పర్యావరణం మరియు అభివృద్ధితో వాటి సంబంధం మొదలైన విషయాలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతీ ఏటా జరుపుకోవాలని 1990 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ నిర్ణయం తీసుకున్నది. అప్పటి నుండీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాదీ జూలై 11 రోజున ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జనాభా సమస్యలతో ముడిపడ్డ అంశాలైన కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మానవ హక్కులు తదితరాలపై ప్రపంచ ప్రజలకు సరైన అవగాహనను పెంపొందించడమే ఈ ప్రపంచ జనాభా దినోత్సవ ముఖ్యోద్దేశం.

ఐక్యరాజ్యసమితి ( యు.ఎన్‌.ఓ ) అం‌చనాల ప్రకారం ప్రపంచ ప్రస్తుత జనాభా మొత్తం దాదాపుగా 7.9 బిలియన్స్ ఉం‌టుందని వినికిడి. అందులో 14 ఏళ్ల లోపు వయస్సు కలిగిన జనాభా 25 శాతం, 65 ఏళ్ల పైబడిన వారి జనాభా దాదాపు 10 శాతం కాగా మిగిలిన వారంతా 15 నుంచి 64 ఏళ్ల వయసు కలిగిన వారే. ప్రస్తుతం జనాభా వృద్ధి రేటు 1.1 గా, ప్రతీ లక్ష జననాలకు సంబంధించిన ప్రసూతి మరణాల సంఖ్య 211 గా నమోదయ్యింది. ప్రపంచ జనాభా 2023 సంవత్సరం నాటికి 8 బిలియన్లు, 2037 నాటికి 9 బిలియన్లు, 2057 నాటికి 10 బిలియన్లు చేరుకోవచ్చని యు.ఎన్‌.ఓ ‌వారి అంచనాలు తెలియ జేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి వద్దనున్న ప్రస్తుత సమాచారం ప్రకారం జూలై 2, 2021 నాటికి భారతదేశ జనాభా 139.35 కోట్లు ( 139,35,31,257 ) ఉన్నట్లుగా అంచనా. మొత్తం ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 17.7 % ఉన్నది. వరల్డ్ ‌బ్యాంక్‌ ‌వారి గణాంకాల ప్రకారం 2020 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా మొత్తం 775 కోట్లు ఉన్నట్లుగా, అందులో 105 కోట్ల మంది అత్యల్పంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉన్నట్లుగానూ తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం జనాభాలో ఉన్నత ఆదాయం కలిగిన జనాభా 121 కోట్లు, మిగిలిన జనాభా మధ్య తరగతి మరియు అల్పాదాయ వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం.

అధిక జనాభా వలన కలిగే సమస్యలు అనేకం. అందులో ముఖ్యమైనవి ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలు, పర్యావరణ సమస్యలు మొదలైనవి. భారతదేశానికి సంబంధించినంత వరకూ అధిక జనాభా వల్ల ఉత్పన్నమైన లేదా ఉత్పన్నమయ్యే సమస్యలను పరిశీలిద్దాం. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారోత్పత్తులు పెరగకపోవడం వల్ల ఆహార కొరత ఏర్పడుతుంది. తత్ఫలితంగా పౌరుల ఆరోగ్యం క్షీణిస్తుంది మరియు ఆహార పదార్థాలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడం అనివార్యమై దేశ ఆర్థిక పరిస్థితి చతికిల పడు తుంది. దాని పర్యవ సానంగా అధిక జనాభాకు తగిన పనులు కల్పించలేని పరిస్థితి ఏర్పడి నిరుద్యోగం పెరిగి పోతోంది. పౌరులకు కనీస అవ సరాలు కూడా తీరని పరిస్థితులు ఏర్పడి వారి జీవన ప్రమాణాలు అధమ స్థాయిలో ఉంటాయి. చిన్న పిల్లలు, వృద్ధులు వారి కుటుంబ సభ్యుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతికేటటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఉన్న కారణంగా పనిచేసే వారు అధిక ఒత్తిడికి గురికావడం తప్పనిసరి. ఉపాధి లేమి, పేదరికం కారణంగా అత్యల్ప ఆదాయం కలిగిన పౌరులు గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు వలసపోవడం, నగరాల్లో మురికి వాడల్లో సైతం వారు నివసించే దుస్థితికి దారి తీస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు సరిపడా నివాస ప్రాంతాల లభ్యత లేకపోవడం వల్ల భూమి కొరత తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. సమాజంలో కనీసం స్వంత ఇల్లు కూడా కట్టుకోలేని నిరు పేదలకు ప్రభుత్వాలే వారికి గృహాలు నిర్మించి ఇస్తున్న పరిస్థితులు విస్మరించరానివి. అధిక జనాభా వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతున్న దుస్థితి అందరికీ తెలిసిందే. పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, పర్యావరణ సమస్యలు మొదలైన వాటన్నింటకీ మూల కారణం అధిక జనాభా అన్నది జగమెరిగిన సత్యం.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15.5 కోట్లమంది తీవ్రమైన ఆకలి కేకలతో అలమటిస్తున్నారని పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ‘ఆక్స్ ‌ఫామ్‌’ అనే సంస్థ ఇటీవలి నివేదిక వెల్లడించింది. ప్రతీ నిమిషానికి 11 ఆకలిచావులు నమోదు అవుతున్నట్లుగా మరియు ఇథియోపియా, దక్షిణ సుడాన్‌ ‌లాంటి దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అధిక జనాభా వల్ల ఉత్పన్నమయ్యే పలు సమస్యలను పరిష్కరించే దిశగా ఐక్యరాజ్య సమితి చేస్తున్న కృషి అమోఘం. ‘ఐక్య రాజ్య సమితి జనాభా డివిజన్‌’ ‌జనాభాపై యు. ఎన్‌. ఓ ‌కార్యాచరణ అమలు కోసం వివిధ సంస్థలతో కలిసి నిరంతరం పని చేస్తుంది. ‘‘ది యునైటెడ్‌ ‌నేషన్స్ ‌పాపులేషన్‌ ‌ఫండ్‌’’ (‌యు.ఎన్‌.ఎఫ్‌.‌పి.ఎ) అంతర్జాతీయంగా ప్రసూతి మరణాల సంఖ్య, శిశు మరణాల రేటు తగ్గించడానికి , జీవన ఆయుర్దాయం పెంచడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది.
ఐక్యరాజ్యసమితి వారి ‘జనాభా అవకాశాలు, 2019’ అనే నివేదిక రానున్న దశాబ్దకాలంలో జనాభా ప్రాతిపదికన చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ప్రధమ స్థానంలో భారతదేశం నిలుస్తుందని తెలిపిన విషయం మరువరానిది. అధిక జనాభాను మరియు అధిక జనాభా వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను అరికట్టడానికి భారతదేశం కూడా ఇతోధిక కృషి చేస్తూనే ఉన్నది.

దాదాపు గత ఐదారు దశాబ్దాలుగా మన దేశంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అధిక సంఖ్యలోనే జరుగుతున్నప్పటికీ, ఎమర్జెన్సీ కాలంలో చేపట్టిన సామూహిక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కొంత వివా దాస్ప దమైన సంగతి మనకు తెలి సిందే. అయితే ఇటీవలి కాలంలో రాజ్య సభలో ప్రవేశ పెట్టబడిన జనాభా నియంత్రణ బిల్లు, 2019 మరియు భారత రాజ్యా ంగం లోని 47• ఆర్టికల్‌ ‌సవరణ కోసం ప్రవే శపెట్టబడిన రాజ్యాంగ సవరణ బిల్లు, 2020 చెప్పుకోదగినవి. ఇందులో మొదటి బిల్లు ప్రతీ జంటకు ‘ఇద్దరు సంతానం’ అనే కుటుంబ నియంత్రణ పథకాన్ని ఆచరించని వారికి జరిమానా విధించే దిశగా ఎన్నికల్లో పాల్గొనేందుకు, ప్రభుత్వ ఉద్యోగం చేసేందుకు వారిని అనర్హులుగా ప్రకటించాలని ప్రతిపాదిస్తుండగా, రెండో బిల్లు మాత్రం కుటుంబ నియంత్రణ సాధించేందుకు ‘ఇద్దరు సంతానం’ నినాదానికి కట్టుబడి ఉండే జంటకు విద్యావకాశాలు, పన్నుల్లో మినహాయింపులు, గృహ ఋణాలు, ఉచిత వైద్య సేవలు మరియు ఇతర ఉపాధి అవకాశాల రూపంలో ప్రోత్సాహకాలు అందించాలని ప్రతిపాదించడం విశేషం. ఈ రెండు బిల్లులు ఇంకా చట్టాలుగా రూపు దాల్చని విషయం గమనార్హం. ఏది ఏమైనా అన్ని సమస్యలకు మూల కారణంగా గోచరిస్తున్న అధిక జనాభా వల్ల సమాజానికి మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందనేది అందరూ అంగీకరించాల్సిన చేదు నిజం. కనుక జనాభా నియంత్రణ కోసం ప్రతీ ఒక్కరూ చిత్తశుద్ధితో పాటుపడకపోతే రాబోయే తరాలు మనల్ని క్షమించవనే హెచ్చరికల పరమార్థాన్ని ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగానైనా గ్రహించక తప్పదు.
– మోహన్‌ ‌లింగబత్తుల, 9398522294

Leave a Reply