Take a fresh look at your lifestyle.

కొరోనాతో ఇబ్బందులు పడుతుంటే…టాక్సుల పేరుతో వేధింపులా ?

ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం ప్రైవేటు వాహన యజమానుల నిరసన

ఓ ‌వైపు లాక్‌డౌన్‌ ‌కారణంగా ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురై ఇబ్బందులు పడుతుంటే టాక్సుల పేరుతో వేధింపులు ఏమిటని ప్రభుత్వంపై ప్రైవేట్‌ ‌టూర్స్ ‌ట్రావెల్స్ ‌యజమానులు మండిపడ్డారు. రోడ్డు టాక్సును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈమేరకు బుధవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో ప్రైవేట్‌ ‌టూర్స్ ‌ట్రావెల్స్ ‌యజమానులు ధర్నాకు దిగారు. ఓవైపు కొరోనా కారణంగా ఆదాయం లేక తాము ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం తమను టాక్సులు కట్టుమంటూ వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న వాహనాలకు మాత్రమే పన్ను కడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మంది ప్రైవేటు టూర్స్, ‌ట్రావెల్స్ ‌వాహనాలు నడుస్తున్నాయనీ, ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాని పక్షంలో ఇదే ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నడుస్తున్న బండ్లకు మాత్రమే టాక్సులు వసూలు చేయాలని డిమాండ్‌ ‌చేశామనీ, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన పడ్డట్లు ఉందని వ్యాఖ్యానించారు.

ప్రైవేటు వాహనాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 6 లక్షల మంది జీవిస్తున్నారనీ, వీరంతా ఉపాధి కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ప్రైవేటు వాహనాల వ్యవస్తను పూర్తిగా రద్దు చేసే విధంగా ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. లాక్‌డౌన్‌లో వాహనాలు నడపద్దని ప్రభుత్వమే నిబంధన విధించిందనీ, అలాంటిది ప్రభుత్వమే టాక్సు కట్టాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసలు టాక్సులు చెల్లించడానికే తమ వద్ద డబ్బులు లేవనీ, అలాంటిది ప్రభుత్వం విధించే జరిమానాలను చెల్లించే పరిస్థితిలో లేమన్నారు. ఇదే అంశంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో చర్చలు జరిపామనీ అయితే తమ డిమాండ్లపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆక్షేపించారు. దాదాపు 6 నెలల నుంచి తాము ధర్నాలు చేస్తున్నామనీ ఇకపై ప్రభుత్వం స్పందించని పక్షంలో రోజుకో బస్సును రోడ్డుపైనే తగలబెట్టి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఓవైపు, ఇండ్ల కిరాయిలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మారటోరియం గడువుకూడా ముగియడంతో వాహనాల కోసం తీసుకున్న రుణాలకు ఈనెల నుంచి ఈఎంఐ చెల్లించాల్సి వస్తున్నదనీ, దీంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply