- చెప్పేది ‘శ్రీరంగ’నీతులు….చేయించేంది అక్రమ నిర్బంధాలు
- నష్ట పరిహారం ఇవ్వకుండానే నీళ్లొదిలారు.. కరంటు తీయించారు
- రంగనాయకసాగర్ భూ నిర్వాసితుల ఆవేదన
- కోర్టులో ఉండగానే ప్రాజెక్టు ఎలా ప్రారంభిస్తారు?
- రైతులను నిర్బంధించడం అన్యాయం:
- రైతు సంఘాల కార్యదర్శి చల్లారపు ఆగ్రహం
- డబ్బులు డిపాజిట్ చేసాం ఆ రైతులు స్టేటస్ కో తెచ్చుకున్నారు తహసీల్దార్ శ్రీనివాస్ రావు
కానీ, భూ నిర్వాసితుల పరిస్థితి ఏంటి? భూమి తీసుకున్నారు. పొట్టకొచ్చిన పంటనూ నాశనం చేశారు. భూములిచ్చిన పలువురు రైతులను మరిచారు. కాదు, కాదు పోలీస్ స్టేషన్లో రోజంతా తిండిలేకుండా కూర్చోబెట్టారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులేమీ గొంతెమ్మ కోర్కెలను కోరడం లేదు. వారేమీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. వారు అడుగుతున్నదల్లా చట్టంలో ఏముంటే అదే ఇవ్వండి. సాగుచేసుకుని బతికేందో మేము బతికేలా బతకనివ్వండంటూ నిర్వాసితులు వేడుకుంటున్నారు. అయినా, వారి గోస ఎవరికీ అర్థం కావడం లేదు. పట్టించుకోవడం లేదు. కోర్టుకెళ్లారన్న కోపంతో రంగనాయ్న్న సాగర్‌లో పలువురు రైతులను నట్టేటా ముంచాలని చూస్తున్నారు. మేం చేసిన పాపమేంటి? మమ్మల్నెందుకు పట్టించుకోవడం లేదు? రైతుగా పుట్టినందుకు రంగనాయకుల సాగర్‌లో దుంకి చావాలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్న భూ నిర్వాసితుల అరణ్యరోదనపై ‘ప్రజాతంత్ర’ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో నిర్మించిన రంగనాయకసాగర్‌లోకి గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కాయి. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ వద్ద మోటార్లను ఆన్ చేసి ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే పరవళ్లు తొక్కుతూ గోదారమ్మ తరలివచ్చింది.
3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు 4 మోటార్లతో కేవలం 3 రోజుల్లోనే నిండనుంది. దీని ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని లక్షా పదివేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. అక్కడ నుంచి మల్లన్నసాగర్‌కు, కొండపోచమ్మ జలాశయానికి గోదావరి జలాలు చేరునున్నాయి. ఇంత వరకు భాగానే ఉన్న రంగనాయక సాగర్‌లో ముంపుకు గురై సాగుభూమిని కోల్పొతున్న రైతుల బాదలు పట్టించుకునే నాధుడే లేడు. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో చంద్లాపూర్ గ్రామానికి చెందిన సూరగొని పర్శరాంగౌడ్, సూరగొని శ్రీనివాస్‌గౌడ్, చెప్యాల వెంకటయ్యగౌడ్‌కు చెందిన ఎనిమిది ఎకరాల ఏడు గుంటల భూమి ప్రాజెక్టులో ముంపుకు గురవుతుంది. భూసేకరణ సమయంలో సదరు నిర్వాసితులు భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్ట పరిహారం అందించాలని కోరుతూ..హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో సదరు భూమిలో కరెంటు సదుపాయం కోసం సైతం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు అనుమతించింది. దీంతో సదరు రైతులు ప్రాజెక్టు పరిధిలో ముంపుకు గురవుతున్న ప్రాంతంలో వరిసాగు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రాజెక్టును శుక్రవారం మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారు జామున సదరు రైతులను చిన్నకోడూరు పోలీసులు పెద్దసారు పిలుస్తున్నారని చెప్పి సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్భందినట్లు నిర్వాసితరైతులు వాపోయారు. అదే సమయంలో రైతులు సాగు చేస్తున్న పొలానికి కరెంటు సరుఫరాను సైతం నిలిపివేయడంతో పొట్టకొచ్చిన పంట నాశనం అయ్యే పరిస్థితి నెలకొందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ప్రాజెక్టు పరిధిలో భూమిని కోల్పోతున్న మరోరైతు సుంకరి వెంకటస్వామి బాధ వర్ణనాతీతం. సదరు రైతుకు చెందిన 11ఎకరాల భూమి రంగనాయక సాగర్ ప్రాజెక్టు పరిధిలో ముంపుకు గురవుతుంది. భూసేకరణ సమయంలో సదరు రైతు ప్రాజెక్టు నిర్మాణం కోసం భూమిని ప్రభుత్వానికి అప్పగించాడు. ఇంతవరకు భాగానే ఉన్న సదరు రైతుకు 9ఎకరాలను మాత్రమే నష్ట పరిహారం చెల్లించి, మిగతా భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పక్రియను పూర్తిచేయక పోగా నష్ట పరిహారం అందించకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతు తన మనసులోని బాధను వ్యక్తం చేశారు.
2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి: సూరగోని పర్షరాములు గౌడ్
రంగనాయక సాగర్ ప్రాజెక్టు పరిధిలో మాకు ఉన్న మొత్తం భూమిని కోల్పొతున్నామనీ బాధిత రైతు సూరగోని పర్షరాములు గౌడ్ తన ఆవేదనను తెలిపారు. 2013 భూసేకరణ చట్టంలో ఉన్న మాదిరిగా నష్ట పరిహారం చెల్లించి న్యాయం చేయాలనీ, న్యాయం కోసం మేము పోరాడుతుంటే..పోలీసులతో అరెస్టులు చేయించి ఇబ్బంది పెడుతున్నారనీ అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి ప్రోత్సాహంతోనే అరెస్టుల పర్వం కొనసాగుతుందనీ విచారం వ్యక్తం చేశారు.