Take a fresh look at your lifestyle.

వెంటాడే హృదయపు వాక్యం…

తెలియక మనమంటాం పిల్లలని/ వయసు బరువు పడ్డాక రెక్కలు తెగిపోతాయి/  కాయలు పండిపోయాక పూలు కేవలం ఓ స్మృతి అని జీవన తాత్త్విక  కోణాలను స్పృశించారు ప్రఖ్యాత కవి డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి. అనుభూతికి అక్షర సాక్ష్యంగా నేనే కవితా సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. జీవన గాఢతను పొదువుకున్న అంతరాంతర సీమల్లోని అభివ్యక్తులుగా ఇందులోని 49 కవితలున్నాయి. నువ్వూ నీ చేతి కర్రా అంగిబిళ్లా/  గంగ చుట్టూరా ఓ వెట్టి కాపలా/  నువ్వు నిజమైన మట్టి బావుటా అంటూ తెలంగాణ ప్రాంతపు గ్రామసేవకుల (మాస్కూరి) జీవన లోతుల్లోని కన్నీటి దొంత రాలను విశ్లేషించారు. దుఃఖాన్ని నిశ్శబ్దంగా దింపుకునే నీటిపిట్టలంటూ మరణవేదన తెలిసి కూడా నీరుడీ వారసత్వం చేపట్టిన వారి సుగణమే జ్ఞానమన్నారు.

జీవితం వర్ణసౌధంలోకి అడుగేస్తూ/ అకస్మాత్తుగా ఆరిపోయిన నిండు దీపం/  గూటి నుండి ఎగిరీ ఎగరక ముందే విషపు బాణాల్ని తాకిన రంగుల పాయిరాయి రాలినట్టు అని కాలం చిదిమే కిరాతకం, అందరూ భుజించి తీరాల్సిన ఫలమే మరణం అని అంటారు. దేహం దేశం దాటినా/ మనసు తీగలా అల్లుకు పోయింది ఇక్కడే/  జ్ఞాపకాలపెట్టె వదిలిపోయింది ఇక్కడే అని చెప్పారు. సజల స్పందన/ కత్తెర వడ గాల్పుల్లో కూడా/  భృకుటి కింద సెలయేళ్లు అన్న వాక్యంలో గాయాలతో చేసిన చెలిమి కన్పిస్తుంది. జీవితం  పగుళ్ళకు/  నిరక్షర బీజాల్ని రువ్వింది మనమే/  మెదళ్ళని ఘనీభవింపజేసి/  చిత్తు కాగితాల కసరత్తు నేర్పింది మనమే అని రంగుల పాలపిట్ట రాలిన తీరుకు వేదన చెందారు. పాలపిట్ట  నెత్తురోడినందుకు సిగ్గుతో చితకాల్సింది మనమే అని ఆత్మ పరీక్షకు తెరతీశారు. అనుభూతుల బలిమినిచ్చే పజ్జెమే కొత్త ఆశల్ని పూయిస్తుందని, వెతుకులాట వీగి పోతున్నప్పుడు పజ్జెమే రక్షణ కవచమవుతుందని భావించారు. వానాకాలాన్ని కాలపు వన్నెల బహుమానమని అభివర్ణించారు. రాచపుండు కాయాలపై రేయింబవళ్ళ  సేవావర్షం అని నిస్సిగుల్ని కడిగేశారు. కన్నీటి పొరమీద బెరుకు బాల్యం సేదదీరుతున్నదని బాధపడ్డారు. ఎవరి నెక్కడ పెట్టాలో తెలిసిన వృత్తి వేటగాళ్లకు చిక్కిపోయిన వాడి విలవిలను విశ్లేషిస్తూ జీవితం ఓ అసందర్భ వ్యంగ్య చిత్రమన్నారు. పడిలేచే కెరటాల మధ్య పదిలమైన సముద్రంలా పగలూ, రాత్రిని ఏకం చేస్తూ ఆనందాల, విషాదాల కోసం వెదురు వేణువులో పాటై ఎగసిన భిక్షగాడి బతుకే అంతుపట్టని ఒక ఈలగా మారిందన్న నగ్న సత్యాన్ని వడమర్చి చెప్పారు. జనన మరణాల జలధారల్లో తడిసిపోయే మనిషి నిద్రాముద్రల్ని జీవన రధ్యలో తడిమి చూసుకుని ఆ అఖాతంలో తనని తాను వెర్రిగా వెతుక్కుంటున్నాడన్న నిర్వాణ నిర్వేదాన్ని వివరించారు. వచ్చాక ఏదీ మిగలదు, రాకుండా ఏదీ ఆగదు అని ఎదురుచూపే మిగులుతుందన్న  జీవన సత్యాన్ని వెల్లడించారు.

జీవితం పలక మీద స్మశాన వైరాగ్యం, మొహాల నిండా అర్థ సంభ్రమం, హృదయాల  దూదిపింజలు వంటి వాక్యాలు లోతుగా ఆలోచింపజేస్తాయి. వాన కురిసి వెలిసిన సాయంకాలపు తెలినింగి మెరుపులో వెల్లువైన వింతను కాలం కాసేపు ఆగి మరీ చూసిందని వీడ్కోలును గురించి ఒకింత ప్రత్యేకతతో ప్రస్తావించారు. నువ్వు పెట్టుకున్న ఆశలకు నీరొంపిన బేశర్మీగాళ్ళంటూ తహశీల్‌ ‌తరీఖాను కళ్ల ముందుంచారు. తప్పని వీడ్కోలు పాటలో జలస్పర్శకు జంకి నిలువుగానో, అడ్డంగానో తలూపి తరలిపోయి బతుకమ్మ కలల్ని ఏ సృష్టి లోతుల్తో కొలవాలన్న వేదనను వ్యక్తపరిచారు. కాలాన్ని పట్టిలాగి కలల పట్టుకుచ్చుల్ని సాకారం చేసిన స్వాప్నికుడు వంటి ప్రయోగాత్మక వాక్యాలనూ గమనించవచ్చు. మనస్సు గుర్రంతో  దౌడు తీసే మనిషికి జాగ్రత్తను ఎరుక పరిచారు. నరకానికి గీసిన నఖలు ముందు సకల మానవత్వం శీర్షాసనం వేసి రాతి యుగాలకు పాతుకు పోతుందన్నారు. పద్యం వెంటాడుతుంటే అతి కష్టం మీద దాన్ని మర్చిపోయినట్టు  నటించకండి అని కవులు, కళాకారులకు హితవు చెప్పారు. అంతా ఉండీ లేనట్టుగా భూమి  పుత్రుల జ్ఞాపకం సమాధి చేయబడ్డదన్నారు. గూన పెంకల చవుడు మిద్దెలు పూరి గుడిసెల కింద నాటి ఊరు తీరు, స్ఫటిక  మనస్తత్వాల గురించి పరాయీకరణ సాంద్రమయాక ఎవరూ వినడం లేదని తెలిపారు. ప్రతి కదలికా సెలయేటి తీరే అంటారు. రంగుల మాయ లాడి (టీవీ)కి పొద్దస్తమానం కళ్లు, ఒళ్లప్పగించి ఎవరూ ఎవరికీ పట్టని దీన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. లాంతరు కళ్ళల్లో రేయి మెరుపు…దీపం కత్తితో రాత్రి నదిని చీలుస్తూ ట్రాలీ వంటి వాక్యాలలో నిశితమైన లోచూపు కన్పించింది.

జీవితం/ ఓ శతకం /  ప్రతి దుఃఖం/ ఓ ముక్తకం… పదాలు పెరిగితే  పదోన్నతి/ పదవులు పెరిగితే/  పతనోన్నతి వంటి వాక్యాలు ఆలోచనకు ఖచ్ఛితంగా  పదును పెడతాయి.  మానిన గాయాలను సరికొత్తగా కెలికే నిస్సిగ్గుల నయా ప్రపంచంలో పేదరికం కర్మఫలమైందని వాపోయారు.గ్లోబల్‌ ఎకానమీలో  బతుకు మందారాలు చిట్టిపోయాయని చెప్పారు. ప్రపంచం ధనబిందువులన్నీ సరిహద్దుల్లేని ప్రపంచాన్ని కృత్రిమంగా  సృష్టించుకొని సరికొత్త దోపిడీకి సిద్ధమయ్యాయని హెచ్చరించారు. పద్యాన్ని హృదయానికి పర్యాయపదం చేస్తానన్నారు. ఆకాశాన్ని సూర్యకుమారుడు వదిలేస్తే అంతా ఒంటరితనం నిండిన చీకటే మిగిలిందన్నారు. మరణం మాటున ఒక రెండు విచలిత సందర్భాలను సృష్టించి ప్రతి శాపానికీ విమోచనముంటుందని ప్రతీకాత్మకంగా చూపారు.. కాలం లాక్కెళ్లిన దిశలో ఎడతెగని తొక్కులాటతో మిగిలిందంతా సంశయమేనన్నారు. అధికారపు ముళ్ల మీద దరహాసపు వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ బదిలీ పేరు మీద మజిలీ పూర్తయినా సమున్నతత్వం నిశ్చల జ్ఞాపికగా నిలబడి పోయిందని చెప్పారు. ఇనుపదుప్పట్లతో జీవితంలో అపరిపూర్ణత ఆక్రమించదన్నారు. జీవితంలోంచి, లోకంతో సంబంధం లేకుండా తోసేయడమే మరణమని తెలిపారు. కవిత్వానికి సమస్త లోకం సలాం చేయాలని మనసుటద్దాన్ని సాక్షిగా చేసి కోరుకున్నారు.

కాళ్లకు బలపాలు కట్టుకుని కడదాకా నడుస్తూనే మిగలనితనాన్ని దిగమింగిన అమ్మమ్మను తలచుకున్నారు. మునిమాపు వేళ కలతెగి తలుపు తీసి పురాజ్ఞాపకాలను ఆర్థిగా  పలవరించారు. స్మృతి గీతంలా మిగిలి ప్రేమించమన్నారు. ప్రాణం చివరి గడపను దాటబోతూ ఏళ్ల తరబడి గూడు కట్టిన భయంకరమైన ఆకలిని చూడమని సూడాన్‌ను గుర్తు చేశారు. ఆశ మాత్రమే మనకున్న ఆస్థి అన్నారు. వెళ్లకిలపడ్డా పదండి పోదాం ముందుకే అని ధైర్యం అద్దారు. స్మరణకు రాని సామాన్యుని జీవన ఆక్రందనను అక్షరీకరించారు. మానస చిత్రాలు రాలిపోయే కన్నీళ్లు అన్నారు. సరిహద్దుల్లేనిది వేదనే అని చెప్పారు. జ్ఞాపకప్పొరలు మూసుకున్నట్టు అంతా అచేతనే అని మధనపడ్డారు. హెచ్చు తగ్గుల సాక్ష్యాలతో ఓ యేడు చేజారిందంటారు. కాలం మీరాక సరిపెట్టుకోవడం సాధ్యం కాదని చెప్పారు. అవసరాలు దిగేసుకుని నటించే వాళ్ళ అభిమానం నుండి చిట్టచివరకు ఒంటరిగానే మనిషి మిగిలిపోతున్నాడన్నారు. అంతర్గతపు అలజడి ఉప్పెనై మనిషిని నిలువెల్లా ఆవహించగా వెంటాడిన అగ్ని వాక్యమే నేనే గా  నిలిచింది.
తిరునగరి శ్రీనివాస్‌, 8466053933 

Leave a Reply