కర్నాల్ లో ఆందోళన చేస్తున్న రైతులనుద్దేశించి వాళ్ల తలలు పగులగొట్టండి అని పోలీసులను ఆదేశించడం మన దేశంలో రైతుల పట్ల అధికారగణం చిన్న చూపు ఎలాంటిదో స్పష్టం అవుతోంది. రైతులే సమస్య అన్నట్టు అధికారుల్లో అలాంటి భావన పాతుకుని పోవడమే ఇందుకు కారణం. అధికారుల తీరు చూస్తుంటే రైతుల్లో భయాందోళనలు మరింతగా పెరుగుతున్నాయి. అధికారులు ఇప్పుడే ఇలా ఉంటే మూడు వ్యవ సాయ బిల్లులు చట్టాలుగా అమలులోకి వస్తే ఇంకా ఎంత ఎక్కువగా జులుం చేస్తారోనన్న భయం వారిని వెంటాడుతోంది. ధరల హామీపై, నిఖార్సైన సేవలపై ఒప్పందం బిల్లు 2020 లేదా రైతులు చెబుతున్నట్టు కాంట్రాక్టు ఫార్మింగ్ చట్టం రైతులతో ఒప్పందాలు చేసుకునే ప్రైవేటు వ్యక్తులకు అపరిమితమైన స్వేచ్ఛ ఇస్తోంది. ఒక వేళ రైతులకూ, కార్పొరేషన్ కూ మధ్య ఒప్పందం లో తేడాలొస్తే రైతులు న్యాయస్థానాల్లో సవాల్ చేయడానికి వీలు లేదు. సబ్ డివిజనల్ మేజస్ట్రేట్ కి మాత్రమే అప్పీలు చేయాలి. కలెక్టర్ ర్యాంక్ అధికారినే సబ్ డివిజనల్ మేజస్ట్రేట్ అంటారు.
హర్యానాకి చెందిన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రవి ఆజాద్ అనే 30 ఏళ్ళ యువకుడు ఆగస్టు 28వ తేదీన కర్నాల్ లోని బస్తారా టోల్ ప్లాజా వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్నరైతులపై పోలీసుల దాడి చూస్తే ఎస్ డి ఎం ల వల్ల మాకేం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఆయుష్ సిన్హా అనే ఆ అధికారి పోలీసులనుద్దేశించి రైతుల తలలు పగులగొట్టమని ఆదేశించిన వీడియో వైరల్ అయింది. కార్పొరేషన్కూ, రైతులకూ మధ్య వివాదం వస్తే అధికారులు కార్పొరేషన్ కొమ్ము కాస్తారన్న విషయం దీనిని బట్టి స్పష్టం అవుతోందని ఆజాద్ అన్నారు. అలాంటప్పుడు రైతులకు న్యాయం చేసేది ఎవరు అని ఆజాద్ ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై దాడి చేయమని ఉన్నతాధికారే పోలీసులను ఆదేశిస్తే ఇక చట్టబద్దమైన పాలన ఎక్కడుంది అని ఆయన ప్రశ్నించారు.
ఆ టోల్ ప్లాజా వద్ద ఆందోళన జరిపిన రైతుల్లో డజన్ల కొద్దీ రైతులకు రక్తం కారే గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో రాంపూర్ జాట్ గ్రామానికి చెందిన సుశీల్ కాజల్ అనే ఏభై ఏళ్ళ రైతు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో ఒకరు ఇంకా ఎలిమెంటరీ స్కూలులో చదువుతున్నాడు. జర్నలిస్టు మందీప్ పునియా జరిపిన ఇంటర్వయూలో భారతీయ కిసాన్ యూనియన్ కి చెందిన జగదీప్ అలుఖ్ , మరో రైతు గుర్జియింత్ సింగ్ తమ తలలపై పోలీసులు విచక్షణా రహితంగా మోదారనీ,అయితే తలపాగా తమను కాపాడిందని చెప్పారు. పోలీసులు అంతటితో ఊరుకోకుండా ముఖం మీద,ముక్కు మీద ఎక్కడ పడితే అక్కడ లాఠీలతో కొట్టారని చెప్పారు. గుర్జియంత్ సింగ్ చూపు కోల్పోయారని చెప్పారు.
రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్న తీస్ హజారీ కోర్టు న్యాయవాది వాసు కుక్రేజా అనే యువకుడు రైతులు జరుపుతున్న ఆందోళన ప్రమాదకరంగా పరిణమిస్తోందని భావిస్తే పోలీసులు కోడ్ ఆఫ్ కాండక్టును అమలు చేయాలి కానీ, నిర్దాక్షిణ్యంగా లాఠీలతో బాదకూడదని అన్నారు. ఆయన రైతులకు సంబందించి 1500 కేసులు వాదిస్తున్నారు. పోలీసులు నోటీమాట ద్వారా హెచ్చరికలు జారీ చేయాలనీ, , తర్వాత నీటి గోళాలు ప్రయోగించాలనీ, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే టియర్ గ్యాస్ ని ప్రయోగించాలని ఆయన అన్నారు. ఇవన్నీ విఫలమైన తర్వాతనే లాఠీ చార్జి చేయాలని ఆయన అన్నారు. అయితే,ఐఏఎస్ అధికారే పోలీసులను రైతుల తలలను పగులకొట్టమని ఆదేశించడంతో పోలీసులు వీరావేశంతో లాఠీ ప్రయోగం చేశారని ఆయన అన్నారు. పోలీసులు నాలుగు సార్లు లాఠీ చార్జి చేశారని అలుఖ్ చెప్పారు.
దేశంలో రైతుల సమస్యలపై దృష్టిని కేంద్రీకరించిన వ్యవసాయ ఆర్థిక వేత్త దేవిందర్ శర్మ ఆ అధికారి అలా ఆదేశించడం, పోలీసులు విజృంభించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని చెప్పారు. రైతులను గుండాలుగా చిత్రీకరించడం స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇదే ప్రథమమని అన్నారు. రైతులు ప్రభుత్వానికి సమస్య కానేకాదనీ,అధికారులు, ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. రైతులు అనేక మాసాలుగా న్యాయసమ్మతమైన కోర్కెల కోసం ఆందోళన సాగిస్తున్నారనీ, వ్యవసాయ రంగం అసలే సంక్షోభంలో ఉంటే ప్రభుత్వం తెచ్చిన సాగుచట్టాలు ఆ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే రీతిలో ఉన్నాయని ఆయన అన్నారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థలు వ్యవసాయ రంగం
నిలదొక్కుకోకుండా చేస్తున్నాయని ఆరోపించారు. ప్రపంచంలో అనేక దేశాలు వ్యవసాయ రంగంలో కార్పొరేట్ జోక్యాన్ని సందేహిస్తున్నప్పుడు మన దేశం ఎందుకు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగం చేతుల్లో పెట్టాలని అనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. లాఠీ చార్జి జరపమని ఆదేశించే ముందు అనంతర పరిణామాలను గురించి ఆలోచించండి ఆయన రైతులు, అధికారులు, పోలీసులనుద్దేశించి చేసిన ప్రసంగంలో హెచ్చరించారు. బ్రిటిష్ వారు ప్రజలను విభజించి పాలించారనీ,ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతుల మీదికి అధికారులు, పోలీసులను ఉసిగొల్పుచోతందని ఆయన ఆరోపించారు.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్