Take a fresh look at your lifestyle.

హత్రాస్‌ ‌బాధితుల పరామర్శ…. ఉమాభారతి స్పందన అభినందనీయం

ఉత్తరప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న యువతుల అత్యాచారం..హత్య సంఘటనలపై పార్టీ సీనియర్‌ ‌నాయకురాలు, ఫైర్‌ ‌బ్రాండ్‌గా పేరొందిన ఉమా భారతి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌కి ఇచ్చిన సలహా సమయోచితం అయినది. పార్టీ ప్రతిష్ఠ మంటంగలసిపోతున్నప్పుడు సీనియర్లు పెదవి విప్పి నిర్మోహమాటంగా మాట్లాడటం ఆహ్వనించదగిన పరిణామం. ఆమె బీజేపీ అగ్రనాయకులు వాజ్‌ ‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్‌ ‌జోషి వంటి సీనియర్‌ ‌నాయకుల హయాంలో పార్టీ కోసం కష్టించి పని చేశారు. యోగి ఆదిత్యనాథ్‌ ‌వంటి ఇప్పటి తరం నాయకుల పాలనలో జరుగుతున్న సంఘటనలను చూసి చలించి ఆమె ఈ సలహా ఇచ్చారు. జాతీయ పార్టీల్లోనూ, దశాబ్దాలుగా అధికార రాజకీయాల్లో ఉంటున్న ప్రాంతీయ పార్టీల్లోనూ ఈ మాదిరి సలహా ఇచ్చే సీనియర్లు అనేక కారణాల వల్ల మనకెందుకు లెమ్మన్న ధోరణిలో వ్యవహరిస్తుండం వల్ల అధినాయకునికి భజన చేసే బృందంగా పార్టీలు తయారవుతున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ప్రధాని మోడీకి తిరుగులేదు. ఆయన ఎదుట నిలిచి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు.

ఉమాభారతి మోడీ తొలి కేబినెట్‌లో మంత్రిగా వ్యవహరించినప్పటికీ, ఆమె స్వతంత్ర ధోరణి నచ్చకపోవడం వల్ల రెండో సారి ఆమెకు అవకాశం రాలేదేమోనన్న వార్తలు వెలువడ్డాయి. వాటి సంగతి అలా ఉంచితే, పార్టీలో ఇప్పుడున్న వారందరికన్నా సీనియర్‌ ‌కనుక ఆమె ఇచ్చిన సలహాను యోగి అమలులో పెట్టాలి. మహిళలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు యూపీలో కొత్త కాకపోయినా, బీజేపీ ప్రభుత్వంపై ఆ మచ్చ పడితే సహించలేకనే ఆమె ఆ సలహా ఇచ్చారు. బీజేపీ ముఖ్యమంత్రులంతా మోడీ ఎంపిక చేసిన వారే. వారిలో యోగి మోడీకి అత్యంత సన్నిహితులే కాకుండా, తన అజెండాను అమలు జరపగల సమర్ధుడని యోగిపై విశ్వాసం ఉంచడం వల్లనే ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఎంతో మంది పోటీ పడినా ఆయన్ను మోడీ ఎంపిక చేశారు. ఆయన గతంలో హిందూ యువవాహిని సంస్థను స్థాపించి సమాజ్‌ ‌వాదీ, బిఎస్పీ ప్రభుత్వ హయాంలలో ఉద్యమాలు నడిపారు. ఈ రెండు పార్టీల పాలనలో యుపిలో నేరస్థులు పగ్గాలు చేపట్టి సమాజంలో సామరస్య ధోరణినీ, మహిళల పట్ల గౌరవ మర్యాదలనూ మంటగలిపారు. అప్పట్లో బీజేపీ నాయకులు ప్రతి సభలోనూ తమ పార్టీ అధికారంలోకి వొస్తే మహిళలను గౌరవించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు.

వారిలో ఉమాభారతి కూడా ఉన్నారు. ఉమాభారతి ఇంత కాలం మాట్లాడకుండా ఇప్పుడు సలహాలివ్వడానికి బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కేసు నుంచి విముక్తం కావడం ఒక కారణం కావచ్చు. అంతేకాక, యోగి పార్టీలో సీనియర్లను గౌరవించడం లేదనీ, నేరుగా మోడీతో సంబంధాలు ఏర్పరుచుకోవడం వల్ల స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా ఉన్నావో అత్యాచారం కేసులోనూ, తాజాగా హత్రాస్‌ ‌కేసులోనూ ఆయన ఆలస్యంగా స్పందించిన తీరుతో అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. అగ్రవర్ణాలను కాపాడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే వొచ్చాయి. పార్టీలో అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పోరాడటం వల్లనే తనను పక్కన పెట్టారన్న అనుమానం ఆమెలో ఉంది. మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొద్ది రోజులకే ఆమె కర్నాటకలో హుబ్లీలోని ఈద్గా మైదానంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారన్న నేరంపై ఆమెపై కేసు పెట్టారు. దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి నైతికంగా తప్పుకున్నారు.

ఆమె తప్పుకోవడం వల్లనే మధ్యప్రదేశ్‌ ‌ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌కి అవకాశం వొచ్చింది. వెనకబడిన తరగతులకు చెందిన ఆమె పార్టీలో అగ్రవర్ణాల ఆధిపత్యంపై పార్టీ పరిథిలోనే అనేకసార్లు నిష్కర్షగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు యోగి ని కూడా అదే వర్గాల వొత్తిడికి లోనై మహిళల కేసులలో గట్టిగా వ్యవహరించడం లేదని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. హత్రాస్‌ ‌సంఘటనలో అత్యాచారం..హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నాయకులు వెళ్ళినప్పుడు అడ్డుకోవడమే కాకుండా, వారి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడం సమంజసంగా లేదని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. యోగీజీ మీకు ఒక పెద్ద సోదరిగా సలహా ఇస్తున్నాను.. సిట్‌ ‌దర్యాప్తు జరుగుతున్న సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులను ఎవరూ కలుసుకోరాదన్న నిషేధం ఉన్నట్టు నేను ఎక్కడా వినలేదు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రతిపక్షనాయకులు వొస్తే అడ్డు పడటం న్యాయం కాదు. అని యోగికి ఆమె సలహా ఇచ్చారు. ఆమె సలహా కారణంగానే శనివారం నాడు హత్రాస్‌ ‌బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంకగాంధీలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. శుక్రవారం నాడు తృణమూల్‌ ఎం‌పీల బృందం పట్ల కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారు. ఉమాభారతి డిల్లీలో ఎయిమ్స్‌లో కొరోనా చికిత్స పొంది కోలుకుంటున్న సమయంలో ఈ సలహా ఇవ్వడం మహిళలపై దాడుల పట్ల ఆమె ఆవేదనను తెలియజేస్తోంది. ఉమాభారతి సలహా పాటించినందుకు యోగిని అభినందించాల్సిందే. కష్టంలో ఉన్న వారిని పరామర్శించడం మానవీయ విలువలకు నిదర్శనం. ఆ విలువలకు కట్టుబడి ఉండాలని ఎవరు సలహా ఇచ్చినా మంచిదే.

Leave a Reply