Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌కు కేంద్రంలో ఆదరణ తగ్గిందా ?

రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కేంద్రంలో ఆదరణ తగ్గిందా అంటే ఇటీవల ఆయన దిల్లీ పర్యటన అవుననే సమాధానం చెబుతున్నది. గతంలో కెసిఆర్‌ ‌దిల్లీ పర్యటనలో ప్రధానితో సహా వివిధ మంత్రులు గంటల కొద్ది సమయాన్ని కేటాయించేవారు. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా అన్ని పనులు చక్కబెట్టుకుని వొచ్చేవారు. దిల్లీలో ఉండగా లేదా తిరిగి వొచ్చిన తర్వాత ఆయన అక్కడి విశేషాలు మీడియా కు వివరించేవారు.. కాని ఈసారి అందుకు విరుద్ధంగా జరిగింది. ముఖ్యంగా దిల్లీలో నాలుగు రోజులున్నప్పటికీ ప్రధాన మంత్రి ని కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌కూడా లభించలేదు. అందుకు ముందుగా అపాయింట్‌మెంట్‌ ‌తీసుకోకపోవడం కారణంగా తెలుస్తున్నది. ప్రధాని దిల్లీలో ఉన్నా ఎందుకో కెసిఆర్‌ ‌కలుసుకునే అవకాశాన్ని కల్పించలేకపోయారు. దీనికంతా హుజురాబాద్‌ ఎన్నికల ఫలితాలే కారణంగా భావిస్తున్నారు. హుజురాబాద్‌ ఎన్నికలు బిజెపి , టిఆర్‌ఎస్‌ ‌మధ్య హోరాహోరిగా కొనసాగిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఇరు పార్టీలు గతంలో లేనంతగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. సవాళ్ళు విసురుకున్నారు. చివరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కూడా కేంద్రంపై విరుచుకు పడ్డారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన వివిధ పథకాలు, నిధులపై ఆయన గళమెత్తడం ప్రారంభించారు. ముఖ్యంగా కేంద్రం తీసుకువొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి సిద్దపడ్డారు. తాము ఉద్యమానికి సిద్ధం కావడంతోనే కేంద్రం ఆ చట్టాలను ఉపసంహరించుకున్నదని ప్రచారం చేసుకున్నారు. అలాగే రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఏర్పడ్డ ప్రతిష్టంభనకు కూడా కేంద్రమే కారణమని ప్రజలు, రైతుల ముందు నిలదీసే విషయంలో శక్తిమేర కృషి చేస్తున్నారు. ఈ విషయంలోనే అమీ తుమీ తేల్చుకుంటామని దిల్లీకి పయనమైనారు. బయలుదేరేముందు కత్తులు దూసిన కెసిఆర్‌ ‌రిక్త హస్తాలతో వెనుదిరగడం చూస్తుంటే ఆయన పట్ల కేంద్రం నిరాదరణ ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. దానికి తోడు ఆయన ముందుగా కేంద్ర మంత్రులు, ప్రధానిని కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్‌ ‌తీసుకోకపోవడం కూడా తోడైయింది. అయినా ఆయనతో వెళ్ళిన మంత్రులు, అధికారుల బృందం ఒకరిద్దరు కేంద్ర మంత్రులను కలిసినా పెద్దగా వొరిగింది మాత్రం ఏమీ లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉన్న వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఏదో ఒకటి తేల్చుకు వొస్తానని వెళ్ళిన ముఖ్యమంత్రి ఏదో ఒకటి సాధించుకుని వొస్తాడని రాష్ట్ర రైతాంగం ఆశగా ఎదురు చూశారు. కాని వారికి నిరాశే ఎదురైంది. అనేక విన్నపాల అనంతరం కలిసిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణి శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌మంత్రుల బృందాన్ని కలిసినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది.

ఎలాంటి హామీ ఇచ్చేది ఈ నెల 26న గానీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పిన మాటకు వారు వెనుదిరుగక తప్పలేదు. 26న కూడా రాష్ట్రంలో పండించిన వరి పంటనంతా కొనుగోలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దానికి తోడు యాసంగిలో వరి పంటలు వేయకుండా చూడాలని ఈ సందర్భంగా మంత్రుల బృందానికి కేంద్రం మరోసారి స్పష్టం చేసింది కూడా. ఒక విధంగా నాలుగు రోజులు దేశ రాజధానిలో నిరీక్షించినా ప్రధానిని కలువడానికి అనుమతి లభించకపోవడం,కలిసిన కేంద్ర మంత్రులు కూడా చేసిన విజ్ఞప్తుల పట్ల స్పందించకపోవడం పెద్ద అవమానంగానే కెసిఆర్‌ ‌భావిస్తున్నారు. కేంద్ర నిర్ణయానికి మరో అవకాశం ఇచ్చిన తర్వాత భవిష్యత్‌ ‌కార్యక్రమాన్ని రూపొందించుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చ లు జరిగి, ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు తమ పరిస్థితేమిటని రాష్ట్ర రైతాంగం ఆవేదన చెందుతున్నారు. యాసంగి సంగతేమోగాని వర్షాకాలం పంటల సంగతేమిటంటునన్నారు వారు. తెలంగాణ ప్రాజెక్టులు, తెలంగాణలో ప్రవేశపెట్టిన అనేక అభివృద్ది పనులు, పేదలకోసం అమలు పరుస్తున్న పథకాల పై చాలాకాలంగా కేంద్ర మంత్రులు ఇక్కడి వొచ్చినప్పుడల్లా పొగిడిన విషయం తెలిసిందే. దాంతో కేంద్రంతో దోస్తీ, రాష్ట్ర బిజెపి నాయకత్వంతో వైరంగా కెసిఆర్‌ ఉం‌టున్నాడన్న ప్రచారం ఉంది . కాని, హుజురాబాద్‌ ఎన్నికల తర్వాత కేంద్ర నాయకత్వంలోకూడా మార్పు వొచ్చిందన్నది తాజా సంఘటనల వల్ల అర్థమవుతున్నది. ఎత్తుగడల్లో దిట్టగా పేరున్న కెసిఆర్‌ ఈ అవాంతరాన్ని ఎలా ఎదుర్కుంటారో వేచి చూడాలి.

Leave a Reply