Take a fresh look at your lifestyle.

ప్రజల భవిష్యత్‌ ‌కోసమే హరితహారం

  • మొక్కలు నాటి ఆక్సిజన్‌ ‌కొరత తీర్చాలి
  • పుడమిని కాపాడుకోవడానికి సమష్టిగా కృషి చేయాలి
  • అంబర్‌పేట కలాన్‌ ‌వద్ద అర్బన్‌ ‌ఫారెస్ట్ ‌పార్క్ ‌ప్రారంభం
  • మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కెటిఆర్‌
  • ‌రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యాక్రమాలు షురూ

హరితహారాన్ని మించిన ఉదాత్తమైన కార్యక్రమం మరొకటి లేదని రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొరోనా రెండో దశతో దేశమంతా తల్లడిల్లిపోయిందన్నారు. ఆక్సిజన్‌ అం‌దక ప్రాణాలు పోవడం అందరినీ కలచి వేసిందన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యాక్రమాలతో పాటు ఏడో విడత హరితహారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఊరూవాడా చేపట్టిన కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెత్త తొలగింపు సహా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నగర శివారులోని పెద్ద అంబర్‌పేట్‌ ‌కలాన్‌ ‌దగ్గర ఏర్పాటు చేసిన అర్బన్‌ ‌ఫారెస్ట్ ‌పార్క్‌ను మంత్రులు కేటీఆర్‌, ‌సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ ‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్‌లో మొక్కలు నాటి ఏడో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌ ‌కోసం పుడమిని కాపాడుకునేందుకు సమష్టిగా పని చేయాలన్నారు.

మనకు కావాల్సిన ఆక్సిజన్‌ ‌చెట్ల ద్వారానే లభిస్తుంది, పిల్లల భవిష్యత్‌ ‌కోసం చేపట్టిన కార్యక్రమనన్నారు. హరితహారం ప్రభుత్వ కార్యక్రమమే కాదని.. ప్రజల కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రూ.5,900 కోట్ల వ్యయంతో 220 కోట్ల మొక్కలు నాటే.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో పచ్చదనం 23.4 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా తెలిపిందన్నారు.

Haritha Haram is for the future of the people Minister KTR

పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం 109 అర్బన్‌ ‌ఫారెస్ట్ ‌పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. హెచ్‌ఎం‌డీఏ పరిధిలో రూ.650 కోట్లతో 59 అర్బన్‌ ‌ఫారెస్ట్ ‌పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మానవాళికి అత్యవసరమైన ప్రాణవాయువును అందించడంలో అర్బన్‌ ‌ఫారెస్ట్ ‌పార్కులు కీలకంగా మారుతాయన్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన వెంట ఉండేది చెట్టు మాత్రమేనని, పచ్చదనం పెరిగేలా చట్టాల్లో సీఎం కేసీఆర్‌ ‌కఠినమైన నిబంధనలు పెట్టారని చెప్పారు.

85 శాతం మొక్కలు బతకపోతే స్థానిక ప్రజా ప్రతినిధులను పదవుల నుంచి తొలగించే నిబంధనలు పెట్టారన్నారు. హరితహారం మన పిల్లలు, భవిష్యత్‌ ‌తరాల కోసం అన్న సోయి అందరికీ రావాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి పుణ్యంతో దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి చేరుకోవాలన్న సీఎం కేసీఆర్‌ ‌కల నెరవేరి.. దేశానికే పాఠాలు చెప్పే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలన్నారు. అర్బన్‌ ‌ఫారెస్ట్ ‌పార్కుల స్ఫూర్తితో కేంద్రం నగర వన్‌ ‌కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ను యావత్‌ ‌దేశం అనుకరిస్తుందని.. మిషన్‌ ‌భగరీథ పథకంతో పాటు రైతుబంధు పథకాన్ని కేంద్రం అనుకరించిందని అన్నారు. ఈ సందర్భంగా దేశానికే ఆదర్శంగా నిలిచిన అటవీశాఖకు అభినందనలు తెలిపారు.

హరితహారంతో దేశంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వొచ్చిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆయన పెద్ద అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన అర్బన్‌ ‌ఫారెస్ట్ ‌పార్కును మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో 15వేలకుపైగా నర్సరీలు ఉన్నాయని, ఇంత మొత్తంలో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేవన్నారు. భావి తరాల వారి కోసం ఆస్తులు, అంతస్తులు కాదు.. చెట్లు నాటి సంరక్షించాలన్నారు. అర్బన్‌ ‌ఫారెస్ట్ ‌పార్కులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌ ‌రెడ్డి, సురభి వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply