ఆర్థికమంత్రి హోదాలో హరీష్ రావు ఆదివారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆయన బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తారు. ఆ తరవాత సభ వాయిదా పడుతుంది. 9,10 తేదీల్లో సెలవుల అనంతరం తిరిగి 11న సభ మొదలవుతుంది. గతేడాది సిఎం కెసిఆర్ నేరుగా తానే బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇకపోతే బడ్జెట్లో విద్యుత్ ఛార్జీలను పెంచుతామని సిఎం కెసిఆర్ స్వయంగా సూచన చేశారు.. దీనిని బట్టి ఇతరత్రా కొన్ని రంగాలపైనా వడ్డింపు తప్పదని భావిస్తున్నారు. కిందటేడాది కంటే మెరుగైన బ్జడెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేసింది. రూ.1.55 లక్షల కోట్లతో వార్షిక బ్జడెట్ ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల అంచనాగా ఉంది. మాంద్యం వెంటాడుతున్నా గతేడాది ప్రవేశపెట్టిన బ్జడెట్ కన్నా ఈసారి పది శాతం అదనంగా పద్దు ఉండనుంది. ఆదివారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు, కౌన్సిల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బ్జడెట్ ప్రవేశపెట్టనున్నారు.గత బడ్జెట్ల తరహాలోనే ఈ యేటి పద్దు కూడా రైతు పక్షపాతిగానే ఉండే అవకాశం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతుబంధు, బీమా, అగ్రి సబ్సిడీలు, ఇతరత్రా అన్ని రకాల కేటాయింపులు కలిపి బడ్జెట్లో 20 శాతానికిపైగా ఉండనున్నట్టు తెలిసింది. 57 ఏళ్ల వారికి ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు కేటాయింపులు చేసే అవకాశముంది. పింఛన్లకు రూ.10 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండనున్నాయి. పట్టణ, ప్లలె ప్రగతి కార్యక్రమాలకు రూ.7 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండొచ్చని సమాచారం. కరెంట్ సబ్సిడీలు, ఇతర కేటాయింపులకు రూ.10 వేల కోట్ల వరకు ఇచ్చే అవకాశముంది. రైతు రుణాలు త్వరలోనే మాఫీ చేయనున్నామని మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెపుతున్న నేపథ్యంలో రుణమాఫీకి రూ.6 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండనున్నట్టు తెలుస్తోంది. వెల్ఫేర్ స్కీములతోపాటు ప్రభుత్వ నిర్వహణ, జీతాలు, పెన్షన్లు ఇతరత్రా వ్యయానికి రూ.47 వేల కోట్లు మినహాయిస్తే14 శాతం బ్జడెట్టే అభివృద్ధి పనులకు వ్యయం చేసే పరిస్థితి. లోన్లు కూడా పెద్దగా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రోడ్లు, ఇతర ఇన్ఫ్రాస్టక్చ్రకు సంబంధించిన పనులకు పెద్దగా కేటాయింపులు ఉండే ఆస్కారం లేదని సమాచారం. డబుల్ ఇండ్ల నిర్మాణానికి మాత్రం రూ.2 వేల కోట్ల వరకు పెట్టవచ్చని తెలుస్తోంది. నిరుద్యోగ భృతికి ఈ బ్జడెట్లోనూ కేటాయింపులు అంతగా ఉండకపోవచ్చని సమాచారం. ఈ ఏడాది రూ.70 వేల కోట్ల వరకు స్టేట్ ఓన్ రెవెన్యూ ఉండే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చే పన్ను వాటాల్లో ఒక శాతం మేర కోత పెడుతూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. సెంట్రల్ జీఎస్టీ, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్‌కం ట్యాక్స్, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ రూపేణ ఈ ఆదాయం రాష్టాన్రికి సమకూరనుంది. బడ్జెట్లో కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు స్వల్పంగా పెరుగుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. కరెంటు విషయంలో వంద శాతం నిలకడగా ఉన్నామన్నారు. గత ఆరేళ్ల కాలంలో ఒకే ఒక్కసారీ ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలను స్వల్పంగా పెంచామని, మరోసారి పెంచాల్సి వస్తే పెంచుతన్నామన్నారు. దీనిపై ప్రజలకి వివరణ ఇస్తామన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా.. ప్రభుత్వ సంస్థల మనుగడ కోసం పెంచుతామని అన్నారు. ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే పన్ను ద్వారానే ప్రభుత్వాలు నడుస్తాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరా కొనసాగుతుందన్నారు.