Take a fresh look at your lifestyle.

‌ప్రజలందరూ మార్పును గమనించాలి

  • కేసీఆర్‌ ‌నేతృత్వంలో పల్లెలు అభివృద్ధి
  • తిప్పారం, ముద్దాపూర్‌ ‌పల్లె ప్రగతిలో మంత్రి హరీష్‌రావు
  • ముద్దాపూర్‌లో మరోసారి రైతు అవతారం
  • వెదజల్లే పద్దతిలో వరిని సాగు చేస్తే లాభాలెన్నో…
  • పొలంలోకి దిగి విత్తనాలు చల్లి రైతులకు అవగాహన కల్పించిన మంత్రి
  • 10 రోజుల్లో కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి వాట్సాప్‌ ‌చేయాలి…
  • ముద్దాపూర్‌ ‌సభలో అధికారులను ఆదేశించిన మంత్రి హరీష్‌రావు

రాష్ట్రం ఏర్పడ్డాక పల్లెల్లో ఎంతో అభివృద్ధి జరిగిందనీ…దీనికంతటికి కారణం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పల్లెల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను ఇవ్వడమేననీ, పల్లెల్లో వొచ్చిన మార్పును ప్రజలందరూ గమనించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గురువారం మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట జిల్లా కొండపాక మండలంలోని తిప్పారం, ముద్దాపూర్‌ ‌తదితర గ్రామాల్లో పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా తిప్పారంలో హరితహారం కింద మొక్కలు మంత్రి నాటారు. గ్రామ మహిళా సమాఖ్య భవనం, నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తిప్పారం, ముద్దాపూర్‌ ‌గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…సిఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో గడిచిన యేడేండ్లలో పల్లెల్లో ఎంతో మార్పు వొచ్చిందన్నారు. నాల్గవ విడత పల్లె ప్రగతిలో భాగంగా తిప్పారంలో హరితహారం కోసమని వొచ్చినట్లు, దళిత వాడల్లో డ్రైనేజీ శుభ్రం చేపడుతున్నట్లు వెల్లడించారు. రూ.10 కోట్ల రూపాయలతో తిప్పారం నుంచి పల్లెపహాడ్‌ ‌వరకూ డబుల్‌ ‌రోడ్డు చేయించినట్లు మంత్రి తెలిపారు.

రూ.16 లక్షలతో మహిళా సమాఖ్య భవనం, రూ.22 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ.10 లక్షలతో అంగన్‌వాడీ కేంద్రం, రూ.20 లక్షలతో న్యూట్రిషన్‌ ‌సబ్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణాలు చేపట్టుకున్నామన్నారు. పాఠశాల భవన నిర్మాణ బాధ్యత తనదేనని తిప్పారం గ్రామస్తులకు మంత్రి హామీ ఇచ్చారు. గ్రామ ఫంక్షన్‌ ‌హాల్‌, ఎస్సీ కాలనీలో డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హరీష్‌రావు అన్నారు. తిప్పారం గ్రామాన్ని పచ్చటి, పరిశుభ్రమైన గ్రామంగా నిలిపేలా గ్రామస్తులు సహకరించాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. కొరోనాతో చాలా ఇబ్బందులు ఎదురైనా.. దేశంలో అతి ఎక్కువగా భూమికి బరువైన 90 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల పంట తెలంగాణ రాష్ట్రంలో పండిందన్నారు. నాల్గవ విడత పల్లె ప్రగతిలో భాగంగా తిప్పారంలో శానిటేషన్‌-‌పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ – స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టినట్లు అడిషనల్‌ ‌కలెక్టర్‌, ‌లోకల్‌ ‌బాడీస్‌ ‌ముజమ్మీల్‌ ‌ఖాన్‌ ‌పేర్కొన్నారు.

మరోసారి రైతు అవతారం ఎత్తిన హరీష్‌రావు…
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోసారి రైతు అవతారం ఎత్తారు. పల్లె ప్రగతిలో భాగంగా ముద్దాపూర్‌కు వొచ్చిన మంత్రి హరీష్‌రావు…స్వయంగా పొలంలోకి వరి విత్తనాలు వెదజల్లారు. వెదజల్లే పద్దతిలో వరి సాగు…రైతన్నకు కలిగే లాభాల గురించి పొలం వద్దనే రైతులకు అవగాహన కల్పించారు. గ్రామ శివారులోని యాట నర్సింలు పొలంలోకి మంత్రి హరీష్‌రావు దిగి వెదజల్లే పద్దతిలో వరిసాగుపై గ్రామ రైతులందరికీ వివరించారు. వెదజల్లే పద్దతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2-3 బస్తాలు(1-2 క్వింటాళ్లు) దిగుబడి కూడా ఎక్కువ వొచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ వరి ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతి వరి పంటను సులభంగా నాటుకోవొచ్చని సూచించారు.

Harish Rao as a Farmer

నారు పోసే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్‌ ‌వొస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతయితే 8 కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవొచ్చునని చెప్పారు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడేదాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులు, సిద్దిపేట జిల్లాలో వరి సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్దతిని అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.

వెదజల్లే పద్దతిలో వరి సాగు చేసే అంశంపై సిద్దిపేట జిల్లా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి ఆదేశిచారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 10 రోజుల్లో విద్యుత్తు పోల్స్ ‌వేయించి, పని పూర్తయ్యాక వాట్సాప్‌లో తనకు పోస్ట్ ‌పెట్టాలని విద్యుత్‌ ‌శాఖ అధికారులకు ముద్దాపూర్‌ ‌గ్రామ సభలో మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. అలాగే, ముద్దాపూర్‌కు పైసల మంత్రి నిధుల వరద కురిపించారు. గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, పక్కా అంగన్‌వాడీ భవనానికి రూ.12 లక్షలు, ముదిరాజ్‌ ‌కమ్యూనిటీ హాల్‌ ‌నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.

ముద్దాపూర్‌ ‌గ్రామంలో సొంత అడుగు స్థలంలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు కట్టుకునేందుకు అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే నిధులు విడుదల చేయిస్తాననీ అన్నారు. మంత్రి వెంట రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజారాధాక్రిష్ణశర్మ, డిసిసిబి ఛైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ ‌లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ‌ముజమ్మీల్‌ఖాన్‌, ‌గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, ఆయా గ్రామాల్లో పర్యటించిన మంత్రి హరీష్‌రావుకు మహిళలు మంగళహారతులతో కుంకుమ బొట్టు పెట్టి స్వాగతించగా బోనాలు, డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు.

Leave a Reply