Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌, ‌బిజెపి నేతలు ఎండమావుల వంటివారు

  • వారి వెంట వెళ్లితే ఏమీ రాదు
  • ముబారస్‌పూర్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌రావు
కాంగ్రెస్‌, ‌భారతీయ జనతా పార్టీల నేతలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల నేతలు ఎండమావుల వంటి వారనీ, వారి వెంట వెళ్లితే ఏమీ రాదన్నారు. శనివారం దుబ్బాక నియోజకవర్గంలోని ముబారస్‌పూర్‌లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుల చేతుల్లో ఢిల్లీలో ఏమీ లేదు, గల్లీలో కూడా ఏమీ లేదన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం పార్టీలు కలిసి 70యేండ్లు పరిపాలించాయనీ,  70యేండ్ల పాలనలో కనీసం మంచి నీటి సమస్యను కూడా తీర్చలేకపోయాయన్నారు. దేశంలోని కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా బీడీ కార్మికుల పింఛన్లు ఇస్తున్నారా?అని ప్రశ్నించారు.
కానీ, తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామన్నారు. రైతులకు ఉచితంగా 24గంటల నాణ్యమైన కరంటు, రైతుబంధు, రైతుబీమా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.  సమైఖ్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు భూమి శిస్తు వసూలు చేస్తే నేడు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం రైతుకు పెట్టుబడి సాయం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌, ‌టిడిపి పార్టీల ప్రభుత్వాలకు, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇది అన్నారు.

Leave a Reply