Take a fresh look at your lifestyle.

హుజారబాద్‌లో దావత్‌లతో హరీష్‌ ‌దూకుడుగా ఉన్నారు

  • నాకు పట్టిన గతే..రేపు ఆయనకూ పడుతుంది
  • వరంగల్‌ ‌ప్రచారంలో ఉన్నప్పుడే నాపై కుట్రలు
  • మిడియా సమావేశంలో మాజీమంత్రి ఈటల రాజేందర్‌

తాను వరంగల్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, తనపై కేసీఆర్‌ ‌కుట్రలు చేశాడని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. వారి అబద్ధాల పత్రిక, ఛానల్‌లో పదేపదే అబద్దాలు చూపించారని అన్నారు. ఆ వార్తలు చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు పెట్టారని పేర్కొన్నారు. తన నియోజకవర్గం వారికి హరీష్‌ ‌దావత్‌, ‌డబ్బు ఇస్తున్నారని ఆరోపించారు. మెప్పుపొందాలనే హరీష్‌రావు చూస్తున్నాడని, హరీష్‌రావుకు తన గతే పడుతుందన్నారు. టిఆర్‌ఎస్‌లో హరీష్‌కు క్రమంగా గౌరవం తగ్గిందన్నారు. టీఆర్‌ఎస్‌ ‌నేతలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో తనపై అవాకులు చెవాకులు మాట్లాడిస్తున్నారని ఈటల అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని విమర్శించారు.

మి పార్టీలో గెలిచా అన్నారుగా.. అందుకే రాజీనామా చేశానని చెప్పారు. డబ్బు, ప్రలోభాలను పాతరేసే సత్తా హుజురాబాద్‌ ‌ప్రజలకుందన్నారు. తమతో తిరిగే యువకుల్ని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అందరినీ బెదిరించి టీఆర్‌ఎస్‌ ‌కండువాలు కప్పుతున్నారని ఈటల ఆరోపించారు. సీఎస్‌, ‌డీజీపీ చట్టానికి లోబడి పనిచేయాలి.. చుట్టంగా కాదన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అహంకార, నియంతృత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ ‌ఛుగ్‌ ‌ధ్వజమెత్తారు.

అప్రజాస్వామిక, అవినీతిమయ పాలనకు బీజేపీ చరమగీతం పాడుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్ని ఎత్తులు వేసినా హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో నాయకులు, కార్యకర్తలను అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేసి భయపెడుతున్నారని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌ ఎన్నికను సీఎం కేసీఆర్‌ ‌జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్‌ ‌గడ్డ మిద ఎగరేది కాషాయ జెండానే అన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఆయన అబద్దాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు.

Leave a Reply