జంగంరెడ్డిపల్లి అనాధ పిల్లలకు… హరీష్ ఆర్థిక సాయం
- రూ.1.50లక్షలు అందించిన మంత్రి
జగదేవ్‌పూర్ మండలంలోని జంగంరెడ్డిపల్లికి చెందిన అనాధ ఆడపిల్లలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆపన్న హస్తం అందించారు. నేను ఉన్నానంటూ ఆ ఆడపిల్లలిద్దరికీ భరోసా కల్పించడమే కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైన ఒక లక్షా 50వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గురువారం అందించారు. జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పిల్లలు పావని, పూజ చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. ప్రస్తుతం కొరోనా వైరస్ వ్యాప్తి చెందడం… లాక్డౌన్ కొనసాగించడంతో ఆ పిల్లలిద్దరూ ఇప్పుడు తినడానికి తిండి కూడా లేక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ విషయం స్థానిక నాయకులు, అధికారులు మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకపోవడంతో ఆ అనాధలిద్దరినీ తొలుత మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి హరీష్‌రావు ఆర్థిక సహాయం చేయడంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. చదువుకునేందుకు అన్ని విధాలా సహాయం చేస్తామనీ, ఉండటానికి డబుల్ బెడ్ రూం ఇల్లును కూడా ఇప్పిస్తామనీ అనాధలకు మంత్రి హరీష్‌రావు హామీ ఇవ్వడమే కాకుండా భరోసాను కల్పించారు. మంత్రి వెంట రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, జగదేవ్‌పూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుండా రంగారెడ్డి, కొండపోచమ్మ ఆలయ ఛైర్మన్ రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, జంబుల శ్రీనివాస్‌రెడ్డి, కొండపాక వైస్ ఎంపిపి దేవి రవీందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.