Take a fresh look at your lifestyle.

రాష్ట్ర ప్రయోజనాల మేరకే అప్పులు తెస్తున్నాం

అప్పుల పట్టికలో రాష్ట్రం చివరి స్థానంలో
ఉంది : అసెంబ్లీలో మంత్రి హరీష్‌రావు

ఏ ‌రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోవాలన్నా కేంద్ర చట్టానికి లోబడి తెచ్చుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల మేరకే అప్పులు తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం శాసనభలో తెలంగాణ ఫిసికల్‌ ‌రెస్పాన్సిబిలిటీస్‌ అం‌డ్‌ ‌బడ్జెట్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌సవరణ బిల్‌ 2020‌ను హరీష్‌రావు సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి కుంటుపడిందన్నారు. అభివృద్ధి జరగాలంటే ప్రజల చేతిలో డబ్బులు ఉండాలనీ, అలా ఉండాలంటే ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేయాలని చెప్పారు. ఆత్మనిర్బర్‌ ‌ప్యాకేజి కింద కొన్ని షరతులతో, కొన్ని షరతులు లేకుండా 2 శాతం ఎఫ్‌ఆర్‌బిఎంను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి సాధారణంగా మనకు 3 శాతం అప్పు తీసుకునే అవకాశం ఉందనీ, దాన్ని మరో 2 శాతానికి పెంచుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 5 శాతం రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతించిందని వెల్లడించారు. దీనికోసం చట్టంలో సవరణలు చేయాలని సూచించినట్లు తెలిపారు. 2014కు ముందు రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి రూ.4 లక్షల 52 వేల కోట్లు అయితే, నేడు అది రూ. 11 లక్షల 5 వేల కోట్లకు చేరిందని చెప్పారు.

2014తో పోలిస్తే రాష్ట్ర ఆదాయం రెండున్నర రెట్లు పెరిగిందనీ, అయితే, ప్రతిపక్ష నేతలు కేవలం అప్పులు మాత్రమే పెరుగుతున్నాయని మాట్లాడటం సరికాదన్నారు.పెరిగిన ఆదాయాన్ని కూడా చూడాలని ఆయన ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. ప్రస్తుతం మన రాష్ట్ర వృద్ధి రేటు 12.6 శాతంగా ఉందనీ, దేశం జీడీపీ 3 శాతానికి పడిపోతే నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలోని మరే రాష్ట్రం సాధించనంత వృద్ధి రేటును సాధించిందని స్పష్టం చేశారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం 29 రాష్ట్రాల అప్పుల నివేదిక తీస్తే మన రాష్ట్రం చివరి నుంచి రెండో స్థానంలో అంటే 28వ స్థానంలో ఉందనీ, మన కన్నా కింద మహారాష్ట్ర ఉందన్నారు. కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలైన పంజాబ్‌ అప్పులు శాతం 39.9, రాజస్థాన్‌ 33.6 ‌శాతంగా ఉందన్నారు. ఆర్థికంగా రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉందనీ, అందుకే మన రాష్ట్రానికి అప్పుడు ఇవ్వడానికి బ్యాంకులు సైతం ముందుకు వస్తున్నాయని చెప్పారు. రీపేమెంట్‌ ‌కెపాసిటీ పరంగా మన రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ప్రయోజనాలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

మెడికల్‌ ‌కాలేజీల్లో అధ్యాపకుల వయోపరిమితి పెంపు
బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి హరీష్‌ ‌రావు..సభ ఆమోదం
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌మెడికల్‌ ‌కాలేజీల్లో అధ్యాపకుల వయోపరిమితిని పెంచుతూ రూపొందించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మెడికల్‌ ‌కాలేజీల్లో నిపుణుల కొరత ఉన్నందువల్ల అధ్యాపకుల వయోపరిమితి పెంచుతున్నామని మంత్రి అన్నారు. దీనిద్వారా ఐదు మెడికల్‌ ‌కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల వయోపరిమితిని 58 నుంచి 65 ఏండ్లకు పెంచుతున్నామని చెప్పారు. తద్వారా 52 మంది ప్రొఫెసర్లను కొనసాగించడానికి, అనుభవజ్ఞుల సేవలు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. పదవీ విరమణ పొందుతున్నవారు ఎక్కువతుండటం, కోర్టు కేసులతో కొత్తవారిని నియమించుకునే అవకాశం లేకపోవడంతో వైద్య సేవలు, విద్యార్థులపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో అధ్యాపకుల వయోపరమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు. మెడికల్‌ ‌కాలేజీల్లో అధ్యాపకులు, వసతులపై ఏటా తనిఖీలు జరుగుతాయని, వీటి ఆధారంగానే వైద్య సీట్లు వస్తాయని చెప్పారు. అధ్యాపకులు లేక రాష్ట్రం వైద్య సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. సీట్లు కోల్పోతే రాష్టాన్రికి, విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. అందుకే విద్యార్థులపై ప్రభావం లేకుండా బోధనా సిబ్బంది వయోపరిమితి పెంచుతున్నామని చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!