Take a fresh look at your lifestyle.

హరహర మహాదేవ శంభో…

  • రాష్ట్ర వ్యాప్తంగా శివనామస్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు
  • శివరాత్రి శోభను సంతరించుకున్న ఆలయాలు
  • ప్రత్యేక అభిషేకాలు…భారీగా తరలివచ్చిన భక్తులు
  • వేములవాడలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు…పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్‌ ‌రెడ్డి
  • వేయిస్తంభాల గుడిలో వేకువ జామునుంచే ప్రత్యేక పూజలు
  • కొమురవెల్లిలో ప్రత్యేక ఆకర్శణగా నిలవనున్న పెద్దపట్నం
  • ఏడుపాయలలో వనదుర్గామాత దర్శనానికి పోటెత్తిన భక్తులు
  • త్రిలింగ క్షేత్రం కాళేశ్వరంలో భక్తుల సందడి…వేడుకలకు భారీగా ఏర్పాట్లు
  • కొడ్వటూరులో బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద త్రినేత్రుడిని దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో భక్తులు బారులుతీరారు. ఆలయ ఆవరణలో దీపారాదన, ఆదియోగికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అభిషేక ప్రియుడైన ముక్కంటికి బిల్వపత్రాలు సమర్పించుకుంటున్నారు.శివనామ స్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. శివోహం అంటూ గరళ కంఠుడిని స్మరించుకుంటున్నారు.
ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం, ఏడుపాయల వనదుర్గాభవానిమాత ఆలయం, కీసరగుట్ట, జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ ఆలయం, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి, కోటగుళ్లు, ములుగు జిల్లాలోని రామప్ప, మహబూబాబాద్‌ ‌జిల్లాలోని కురవి వీరభద్రస్వామి, హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వర ఆలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరస్వామి, వరంగల్‌లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి, కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, ధర్మపురి, కొడువటూరు, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, ‌వనస్థలిపురం, ఓల్డ్‌సిటీలో శివాలయాల్లో భక్తులు బారులుతీరారు. నల్లగొండ జిల్లా మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వరాలయం, నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు లోని పార్వతీ జడల రామలింగేశ్వరాలయం, దామచర్ల మండలంలోని వాడపల్లి శైవాలయం, నల్లగొండలోని పానగల్లు చాయా సోమేశ్వరాలయంలో శివరాత్రి వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు.
వేములవాడలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు…పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్‌ ‌రెడ్డి
రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా వేములవాడకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎములాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రాజరాజేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరపున ఏఈవో హరీంద్రనాథ్‌ ‌స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
వేయిస్తంభాల గుడిలో శివరాత్రి వేడుకలు….వేకువ జామునుంచే ప్రత్యేక పూజలు
హన్మకొండ వేయిస్తంభాల గుడిలో శివరాత్రి వేళ పాంచాహ్నిక దీక్షతో ఉత్సవాలు కోలాహలంగా చేపట్టారు.  రుద్రేశ్వరి, రుద్రేశ్వరులకు మంగళస్నానాలు చేయించి వధూవరులుగా చక్కగా అలంకరించారు. ఉదయం మూడింటికే స్వామికి సుప్రభాత సేవ, మంగళవాయిద్య సేవ, మహాగణపతికి నవరసాభిషేకం నిర్వహించి తర్వాత రుద్రేశ్వరుడికి మహన్యాస పూర్వక  రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకం చేసారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో విశేషంగా మహా రుద్రాభిషేకం ఉంటుంది. శివరాత్రి మర్నాడు స్వామికి నాకబలి, సదస్యం కార్యక్రమాలు ఉంటాయి. పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. కాకతీయుల కళావైభవానికి, భక్తి పారవర్శానికి నిలయం వేయి స్తంభాల దేవాలయం. వేయి స్థంబాల పేరుతో నిర్మితమైన ఆలయ వైభవం నేటికి కొనసాగుతుంది. ఈ దేవాలయంలో శివలింగాన్ని రుద్రేశ్వరస్వామిగా  కొలుస్తారు.
అంతేకాదు వేయిస్థంభాల దేవాలయానికి మరో విశిష్టత ఉంది. భక్తి భావంతో పాటు ఆలయంలో శిల్పకల ఉట్టిపడుతుంది. వేయిస్తంభాల దేవాలయాన్ని త్రికుటాల యంగా పిలుస్తారు. ఇక్కడ శివునితోపాటు విష్టుమూర్తి, సూర్య భగవానుడు కొలుపుదీరాడు.  850 ఏళ్ల ఘనచరిత కలిగి దేశంలోనే ప్రముఖ పర్యటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందీ ఆలయం. రుద్రేశ్వరాల యంగానూ దీనికి పేరుంది.  క్రీ.శ. 1163లో కాకతీయుల రాజు రుద్రదేవుడి హయాంలో వేయిస్తంభాల ఆలయాన్ని నిర్మించారు.  వేయి స్తంభాలతో ఆలయంతో పాటు ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపాన్ని అత్యంత సుందరనీగా తీర్చిదిద్దారు.
కొమురవెల్లిలో ప్రత్యేక ఆకర్శణగా నిలవనున్న పెద్దపట్నం
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  మహాశివరాత్రి నాడు ఆలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక అభిషేకంతో పాటు నిరంతరం అభిషేకాలు చేపట్టారు.  ఆలయం తరపున నిర్వహించే ‘పెద్దపట్నం’ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ వైవిధ్య పూజా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీనికోసం భారీగా భక్తులు తరలిరానున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇవో తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. భారీగా భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పట్నం అంటే స్వామికి కల్యాణం చేయడం. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు ‘పోలు’(బియ్యంతో పోయడం) కార్యక్రమాన్ని కొమురవెల్లిలో వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు. శివరాత్రి నాటి అర్ధరాత్రి పంచవర్ణాలతో పెద్దపట్నం వేస్తారు. పట్నాన్ని తిలకించి చిందేస్తే తమ కష్టాలు కడతేరతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. ప్రత్యేకంగా నిర్మించిన కల్యాణ వేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఏడుపాయలలో వనదుర్గామాత దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఏడుపాయల జాతర ఏటా మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శివరాత్రి కోసం ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలిచ్చారు. వేకువ జామునుంచే నదీపాయల్లో స్నానాలు ఆచరించిన భక్తులు వనదుర్గామాతను దర్శనం చేసుకున్నారు.. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయల జాతరకు వేలాదిగా భక్తులు తరలి రానుండడంతో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయలలో జాతర కన్నుల పండువగా నిర్వహిస్తారు.  ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తుంది. మహాశివరాత్రి మరుసటి రోజు సంప్రదాయం ప్రకారం వందకుపైగా ఎద్దుల బండ్లు, గుమ్మటాల బండ్లను జాతర ప్రాంగణంలో వూరేగిస్తారు. మూడో రోజు రథోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
త్రిలింగ క్షేత్రం కాళేశ్వరంలో భక్తుల సందడి…వేడుకలకు భారీగా ఏర్పాట్లు
త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన శైవ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శివరాత్రి వేడుకలకు భక్తులు భారీగా తరలిచ్చారు. వేకువజామునుంచే గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు ముక్తేశ్వరుడిని దర్శించుకున్నారు. అభిషేకాలు చేశారు. కాశీలో మరణిస్తే ముక్తి.. గోదావరి ఒడ్డున ఉన్న కాళేశ్వరుణ్ని దర్శిస్తే ముక్తి … అనే నానుడి ఉంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణి సంగమంగానూ దీనికి గుర్తింపు ఉంది. ఈ పుణ్య క్షేత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి భక్తులు తరలివస్తారు. భక్తులకు ప్రసాదం విషయంలో కొరత లేకుండా భారీ సంఖ్యలో లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీని చేపట్టారు. మహిళలు, పురుషులు ప్రత్యేకంగా ప్రసాదాన్ని కొనుగోలు చేసే విధంగా కౌంటర్లను ఏర్పాటు చేసారు. శివరాత్రికి అనేక మంది భక్తులు జాగారణ ఉంటారు. ఈ నేపథ్యంలో హరికథ, కూచిపూడి నృత్యం, భజన సంకీర్తనలు తెల్లవారు జాము వరకు ఉంటాయి.
కొడ్వటూరులో బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాల యంలో శివరాత్రి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలిచ్చారు. ఇక్కడ నిర్వహించే సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, శివకళ్యాణానికి ఏటా వేలాదిగా భక్తులు వస్తారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply