Take a fresh look at your lifestyle.

హర హర మహాదేవ శంభో..!

Hara Hara Mahadeva Shambho ..!

  • శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు
  • రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
  •  ఆలయాలకు పోటెత్తిన భక్తులు
  • రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. భక్తులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.  ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మంత్రులు ఆయా ఆలయాల్లో స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమః శివాయ..హర హర మహదేవ శంభో..! అంటూ భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో  రద్దీ నెలకొంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. రాజన్న దర్శనం కోసం  భక్తులు బారులు తీరారు. రద్దీ దృష్ట్యా దేవస్థానంవారు ఆలయంలో ఆర్జితసేవలు రద్దు చేసి భక్తులకు మహాలఘుదర్శనం కల్పించారు. ఆర్థ్ధిక మంత్రి హరీశ్‌రావు, మంత్రి ఈటల రాజేందర్‌, ‌మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితర ప్రముఖులు వేములవాడ రాజన్నను దర్శించుకుని పూజలు చేశారు.  రాజరాజేశ్వరస్వామివారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి ఈటల రాజేందర్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులకు ఆలయ అర్చకులు సాదరంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వారికి వేదపండితులు ఆశీర్వచనాలను అందించారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అర్చకులు, అధికారులు శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రికి శ్రీవెంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మంత్రులు పట్టువస్త్రాలను సమర్పించే క్రమంలో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోగా పోలీసులు గట్టి బందోబస్తును బందోబస్తును నిర్వహించారు. మధ్యాహ్నం ఆర్థ్ధిక మంత్రి హరీశ్‌రావు వేములవాడకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మంత్రులను ఈవో కృష్ణవేణి సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌చెన్నమనేని రమేశ్‌, ‌మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాల్‌కిషన్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఐడిసి చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి,రాష్ట్ర ఆర్థ్ధిక• సంస్థ చైర్మన్‌ ‌గొడిసెల రాజేశం గౌడ్‌, ‌రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ‌రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణభాస్కర్‌ ‌తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆరుగంటలకు శ్రీస్వామివారి కళ్యాణమండపంలో  స్ధానాచార్య అప్పాల భీమాశంకర్‌ ‌శర్మ,ప్రధానార్చకులు సురేశ్‌,ఉమేశ్‌,‌శరత్‌,‌నమిలికొండ రాజేశ్వరశర్మ తదితర వేదపండిల అధ్వర్యంలో మహాలింగార్చనను,అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాదిమంది భక్తులు ఆలయ ఆవరణలో, ఆ పరిసరాల్లో తాము బస చేసిన స్థలాల వద్ద జాగరణ చేశారు. రాష్ట్ర భాషాసాంస్కృతికశాఖ అధ్వర్యంలో సోమవారం రాత్రి నుండి మంళవారం వేకువజాము వరకు శివార్చన కార్యక్రమాన్ని ఘనంగానిర్వహించారు.

Hara Hara Mahadeva Shambho
మహాశివరాత్రి సందర్భంగా హన్మకొండ వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరస్వామిని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్‌ ‌దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహాశివుడు రాష్ట్ర ప్రజలను సంతోషంగా చూడాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామని వారు తెలిపారు. ఇతోధిక నిధులు ఇచ్చి సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని, జాతీయ సంపద అయిన వేయిస్తంభాల దేవాలయాన్ని కాపాడుకునేందుకు తమ వంతు కృషిచేస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లాలోని శైవక్షేత్రాల్లో కూడా సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చెర్వుగట్టు, పానగల్‌, ‌వాడపల్లి ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో శివరాత్రి శోభ సంతరించుకుంది. వేయిస్తంభాల దేవాలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సాయంత్రం హన్మకొండ హయగ్రీవచారి మైదానంలో సాంస్క•తిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.  నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వరాలయం, శంభునిగుడి, బోధన్‌ ఏకచక్రేశ్వరాలయం, ఆర్మూర్‌ ‌సిద్ధులగుట్ట ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మంచిర్యాల జిల్లాలో  మహా శివరాత్రి సందర్భంగా చెన్నూరు, గూడెం, లక్షెట్టిపేట, మంచిర్యాల, వేలాల గోదావరి ఘాట్ల వద్ద వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

వేలాల మల్లికార్జునస్వామి ఆలయం, కత్తెరశాల మల్లన్న, బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నిర్మల్‌ ‌జిల్లావ్యాప్తంగా శైవక్షేత్రాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. బాసర, సోన్‌, ‌బ్రహ్మపురి వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కదిలిలో పాపహరేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొమురంభీం జిల్లాలో శివరాత్రి సందర్భంగా వాంకిడి శివకేశవ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువైంది. ఈజ్‌ ‌గాం శివమల్లన్న జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. సూర్యాపేట జిల్లాలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పిల్లలమర్రి, నాగులపాటి అన్నారంలోని ప్రాచీన శివాలయాల్లో భక్తుల రద్దీ ఏర్పడింది. మేళ్లచెరువు శ్రీస్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి పూజలు చేశారు. గద్వాలలో, అలంపూర్‌లో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మేడ్చెల్‌ ‌జిల్లా కీసరగుట్టలో స్వామివారికి ప్రభుత్వం తరపున మంత్రి మల్లారెడ్డి  పట్టువస్త్రాలు సమర్పించారు. రాజధానికి సమీపంలో ఉండడం వల్ల స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో కీసర ఆలయానికి తరలివచ్చారు. భద్రాద్రిలో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. అన్నపురెడ్డిపల్లి, మోతె వీరభద్రస్వామి, పాల్వంచ రామలింగేశ్వర ఆలయాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని తీర్థాల సంగమేశ్వరాలయం, కూసుమంచి గణపేశ్వరాలయం, పెనుబల్లి నీలాద్రీశ్వరాలయం, బేతుపల్లి గౌతమేశ్వరాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  జిల్లాలో ప్రముఖ ఆలయమైన కేతకి సంగమేశ్వరాలయంలో భక్తుల రద్దీ పెరిగింది.

Leave a Reply