Take a fresh look at your lifestyle.

‘‘‌శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ..

విజయ దశమి శుభాకాంక్షలు ..

దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది జమ్మిచెట్టు. దసరా సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజిస్తారు. ఈ చెట్టులోని ప్రతిభాగాన్నీ నాటువైద్యంలో ఔషధాలుగా వాడతారు. అందుకే వినాయక చవినినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు. ఏడాదిపాటు అజ్ఞానవాసానికి బయల్దేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట.

తిరిగి అదే విజయదశమినాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే, వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు. కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది .ఆ శక్తి అనుగ్రహం కూడా రాములవారికి లభించబట్టే, ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారట..
దసరానాడున జమ్మిచెట్టుకి పూజలు చేస్తారు. శమీవృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఈ క్రింది శ్లోకాలను చదువకుంటారు-

‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.’’
‘’శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ,
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.’’

పూజ ముగిసిన తరువాత జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్నా ఆధ్మాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా కుబేరుడు ఒకనాడు రఘమహారాజుకి భయపడి జమ్మిచెట్లున్న తావున బంగారాన్ని కురిపించాడనే గాథ ఎలాగూ ప్రచారంలో ఉంది. అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి, జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు, వారి మనోకామన నెరవేరాలని తమ దీవెనలను కూడా జతచేస్తారు.
దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ… అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం.
– రావుల రాజేశం, కరీంనగర్‌

Leave a Reply