Take a fresh look at your lifestyle.

షడ్రుచుల జీవితానికి ప్రతీక ఉగాది ‘‘ప్లవ’’నామ వత్సరానికి స్వాగతం

‘‘ఉగాది’’.  బ్రహ్మ దేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంబించిన రోజు. దీనికి ఆధారం వేదాలను ఆధారం చేసుకొని రాసిన ‘‘సూర్య సిద్ధాంతం’’ అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని శ్లోకం.
‘‘‘చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పధమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తధై వచ’’’

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించారని మన నమ్మకం.. మత్స్యావతారంలో విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా ఈ జగత్తును సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ. ‘‘ఉగాది’’ – ‘‘యుగాది’’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘‘ఉగ’’ అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ‘ఆది’ ‘ఉగాది’. అంటే సృష్టి ఆరంభమైనదినమే ‘‘ఉగాది’’.‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైంది.

ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఇది వసంత కాలంలో వస్తుంది. అరవై వత్సరాలు ప్రభవతో మొదలై, క్షయతో పూర్తవుతాయి. ఈ సంవత్సరం ‘‘ప్లవ’’ నామ ఉగాది ఏప్రిల్‌ 13‌వ తేదీ మంగళవారం జరుపుకుంటున్నాం. గత ఏడాది, ఈ ఏడాది కూడా కరోనా వ్యాధి ఉధృతి కారణంగా ఆరోగ్య సూత్రాల దృష్ట్యా, వైభవోపేతంగా కాకుండా ఆంక్షలు పాటిస్తూ.. గృహాలకే పరిమితం కావలసిన పరిస్థితి.

ఉగాది పండుగ రోజున అందరూ ఉదయం త్వరగా నిద్రలేచి తలంటు స్నానాలు చేసఇ. కొత్త బట్టలు ధరించి. ముంగిట మామిడాకుల తోరణాలు కట్టి. ఇంటి ముందట ముగ్గులు వేసి వసంత లక్ష్మిని స్వాగతిస్తారు. షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్‌ ‌జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు. వైద్య పరంగా ఈ పచ్చడి వ్యాధినిరోధక శక్తిని కలిగిస్తుందంటారు.

ఉదయం, లేదా సాయంత్రం సమయాలలో పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ అంటే అయిదు అంగాలని అర్ధం చెపుతారు. ఇందులో తిధి, వార, నక్షత్ర, యోగం, కరణం అని అయిదు అంగాలుంటాయి. వరుసగా ఇవి మానవునికి సంపద, ఆయుష్షు, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగాస్నాన పుణ్యఫలం వస్తాయని విశ్వసిస్తారు. అందరికి ఆనందం కలిగించే ఈ ఉగాది ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖవంత జీవనం అందించాలని ఆశిస్తూ, ఉగాది శుభాకాంక్షలు.

‘‘ఉగాది పచ్చడి’’ ఈ పండుగ ప్రత్యేకం..

ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో ‘‘నింబ కుసుమ భక్షణం’’బీ ‘‘అశోక కళికా ప్రాశనం ‘‘ అని వ్యవహరించే వారు. ఋతుమార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైందని అంటారు. షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచుల సమ్మేళన పదార్థం ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిని శాస్త్రీయ పద్ధతిలో ఉప్పు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు, అశోక చిగుళ్ళు వేసి చేస్తారు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.

త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు!!

ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది. ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం, ఉప్పు – జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం, వేప పువ్వు – చేదు-బాధకలిగించే అనుభవాలు, చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు, పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు, కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు.

ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదం ముఖ్యంగా పానకం, వడపప్పు. ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినవలసిన ఆవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. అలాగే వడపప్పు కూడా వడపప్పులో వాడే పెసరపప్పు చలవ చేస్తుంది కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ ఋతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది. ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది. ప్రస్తుత కాలంలో ఉన్న పంఖా లాంటి, ఏసీ మరియు ఎయిర్‌ ‌కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది.

కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది. ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా ‘‘కవి సమ్మేళనం’’ నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత వరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఉగాది కవి సమ్మేళనం నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది.

తెలుగు సాంప్రదాయంలోనే కాక ఉగాది దేశంలోని పలు ప్రాంతాలో వివిధ పేర్లతో జరుపుతారు. తెలుగు వారిలానే చాంద్రమానాన్ని అనుసరించే మరాఠీలకు కూడా ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడే వస్తుంది. వారి సంవత్సరాదిని ‘గుడి పడ్వా’గా (పడ్వా అంటే పాడ్యమి) వ్యవహరిస్తారు. మన ఉగాదిపచ్చడి లాంటిదే తయారుచేసి దానికి అదనంగా వాము చేర్చి ఆరగిస్తారు. తమిళుల ఉగాదిని (తమిళ) పుత్తాండు అంటారు. ఒకప్పుడు తమిళుల ఉగాది కూడా తెలుగు వారిలానే ఏప్రిల్‌లో వచ్చేది. సిక్కుల కాలమానం ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి వారి సంవత్సరాది. సౌరమానం ప్రకారం ఇది ఏటా ఏప్రిల్‌ 13‌న, ముప్పైఆరు సంవత్సరాలకొకసారి ఏప్రిల్‌ 14‌న వస్తుంది. తెలుగువారి సంక్రాంతి లాగా ఇది వారికి పంటల పండుగ. రబీ పంట నూర్పిడి సమయం. బెంగాలీయుల నూతన సంవత్సరం వైశాఖ మాసంతో మొదలవుతుంది. వారి కాలమానం ప్రకారం చైత్రం ఏడాదిలో చివరిమాసం. వైశాఖశుద్ధ పాడ్యమినాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు వారు. వ్యాపారులు ఆ రోజున పాత ఖాతా పుస్తకా లన్నింటినీ మూసేసి, సరికొత్త పుస్తకాలు తెరుస్తారు.
– నందిరాజు రాధాకృష్ణ,

Leave a Reply