Take a fresh look at your lifestyle.

సకల గుణాభిరాముడు కౌసల్యా తనయుడు

రామాయణం జీవిత విలువల్ని బోధించడమే కాదు వాటిని కాపాడేందుకు మార్గాలు చూపిస్తుంది. మనిషి గుణగణాలు ఎలాఉండాలన్నదానికి రఘుకులోత్తముడైన శ్రీరాముడు ప్రతీక. అలాగే సాధ్వీమణి సీతమ్మ కూడా ఆడవారికి మార్గదర్శి. రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది రామాయణం చెప్తుంది. దైవికశక్తులతో దుష్టసంహారం చేసిన చారిత్రక పురుషుడు శ్రీరాముడు. దైర్యసాహసాలు, సహనశీలత, దయార్ధగుణం, పితృవాక్యపాలన, ధర్మనిరపేక్షత… ఇలా చెప్పకుంటూపోతే చాలా గుణాలుంటాయి. అందుకే సకల గుణాభిరాముడంటారు. సకల శక్తి సంపన్నుడైన రాజుగా జనాధరణ పొందాడు. దశరథ మహారాజు మాటను జవదాటని ఆదర్శ కుమారుడు రాముడు. ధర్మం నాలుగు పాదాలా నడిచేలా చూసిన ధర్మబద్ధపాలకుడు. శ్రీరాముడు ఆదర్శ కుమారుడు. తండ్రి మాటను కాదనకుండా అడవులకు వెళ్లిపోయాడీ ఆదర్శ కుమారుడు. రాచరిక దర్పాన్ని, భోగభాగ్యాలను, సుఖసౌఖ్యాలను తృణప్రాయంగా  భావించి అడవులకు వెళ్లిపోయిన నిరాడంబరత్వం రాముడిది. ప్రజావాక్కునే దైవవాక్కుగా భావించిన న్యాయపరిపాలకుడు. ఏకపత్నీవ్రతానికి కట్టుబడిన ఆదర్శపతి. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు మార్గనిర్దేశంనం చేసిన మంచి సోదరుడు. రావణుడి సోదరుడు విభీషణుడికి, వాలి సోదరుడైన సుగ్రీవుడికీ స్నేహహస్తం అందించిన మంచి మిత్రుడు.

sriramanavami festival

ప్రజలే తనకు ముఖ్యమనుకున్న ఆదర్శ రాజు రాముడు. అందుకే అరణ్యవాసం తర్వాత ఓ అనామకుడు లేవనెత్తిన సందేహాన్ని పరిగణనలోకి తీసుకుని కట్టుకున్న భార్యను అగ్ని పరీక్షకు పంపించాడు. ప్రజల మాటకు విలువనిచ్చాడే గానీ ఆ లోకాభిరాముడు ఏనాడూ సాద్వీమణి సీతాదేవిని శంకించలేదు. నీతి తప్పని ధర్మబద్ధపాలన అందించడమే రామ రాజ్యమను కున్నాడు రాముడు. ప్రజలందరికీ సమ న్యాయం, సమాన గౌరవం అందించడమే రాజుగా తన కర్తవ్యమని భావించాడు రాముడు. నీతి, నిజాయితీ, ధర్మం కలగలిసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు. అందుకే సర్వాజనామోదం పొందిన మర్యాదాపురుషోత్తముడిగా కీర్తి ప్రతిష్టలందుకున్నాడు. శ్రీరాముడిలోని స్నేహశీలత గొప్పది. కిష్కింధ రాజైన వాలి సోదరుడు సుగ్రీవుడు, రావణుడి సోదరుడైన విభీషణుడు రాముడికి మంచి స్నేహితులు. సుగ్రీవుడి రాజ్యాన్ని తిరిగి అప్పగించడానికి రాముడు వాలిని హతమారుస్తాడు.

లంకలో రావణుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు న్యాయబద్ధ ఆలోచనతో విభీషణుడు రాముడికి అండగా నిలుస్తాడు. రావణ సంహారం తర్వాత లంకా రాజ్యాన్ని విభీషుణికే అప్పగించి తన గొప్పదనాన్ని చాటుకున్నాడు రాముడు.  సకల కల్యాణ గుణాభిరాముడు శ్రీరాముడు. ఆ మహనీయుని జీవనయానమే శ్రీరామాయణం. సమస్త మానవాళికి ఆయన ఆదర్శ పురుషుడు. ఆ మానవతామూర్తి చరిత్ర నేటి సమాజానికి ఆదర్శం. అలనాటి శ్రీరామపాలన ఎందుకు అంత సుభిక్షంగా ఉందో నేటి పాలకులకు ఆ రామధర్మం వింటే తెలుస్తుందని అంటున్నారు. రాముని పాలనలో అందరు సంతోషంగా ఉన్నారు. ప్రజలంతా ధర్మబద్ధంగా జీవించారు.

ప్రజలలో ఒకరిపై ఒకరికి ఏదో చిన్న చిన్న మనస్పర్ధలున్నా రామునికెక్కడ బాధ కలుగుతుందోనని అందరూ కలిసే ఆనందంగా ఉన్నారు. స్త్రీలకు వైధవ్య దుఃఖం లేదు. దుష్ట మృగాల వల్ల గానీ, వ్యాధుల వల్లగానీ ప్రజలు బాధ పడలేదు. దొంగలు లేరు. ఎవ్వరికీ ఏ కీడు జరగలేదు. ప్రతి ఒక్కరు భార్యా బిడ్డలతో కలకాలం ఆనందంగా గడిపారు. అనారోగ్యం, అపరిశుభ్రత ఆయన రాజ్యంలో లేవు. ఎవ్వరూ దుర్మరణం పాలు కాలేదు. ప్రజలంతా అయన్ని దేవుడనుకొనేట్లుగా రాజ్య పాలన చేశారు.  రాముని పాలనలో ధర్మ నిరతులై, ధర్మ పరాయణులై, సత్యవాదులై శుభ లక్షణ సంపన్నులై ఉన్నారు. అందుకే రాముడు, రాముని రాజ్యం మనకు ఆదర్శం. ప్రజా పాలకుడెలా ఉండాలో రాముడు భరతునికి చెప్పిన మాటలలో మనం గుర్తించవచ్చు.  ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొనిఉంది. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీవ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు.

శ్రీరామనవమి :
శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథునకు కౌల్య గర్భమును చైత్రశుద్ధ నవమి పునర్వసు నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పుట్టాడు. అందువలన ప్రతీ సంవత్సం చైత్రశుద్ద నవమి రోజున శ్రీరామ జయంతి వేడుకగా జరుపుకుంటాం. అదే ముహూర్తంలో జానకీదేవిని పరిణయమాడాడు. ఆంధ్రప్రదేశ్‌ ‌తెలుగునేల దశదిశల శ్రీరామ నవమి రోజున సీతారామ కల్యాణం జరపడం అనాదిగా ఆచారంగా వస్తున్నది. శ్రీ రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం జరిగింది ఆ వేడుకలు తిలకించి పులకితులవుతారు.  శ్రీరామ నవమి పండుగను హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.

సీతారామ కల్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం. సకల జనలోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామనవమి రోజున తెలంగాణలోని భద్రాద్రి, అంధ్రప్రదేశ్‌ ‌లోని ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం అట్టహాసంగా  జరుగుతుందన్న విషయం తెలిసిందే.. సాధారణంగా సర్వ సంపదలకు నిలయం భద్రాచలం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. సీతారామ కల్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం. ప్రభుత్వాలు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు శ్రీ సీతారామ కల్యాణానికి సమర్పించుకుంటాయి. శ్రీరాముడు  సత్యపాలకుడు ధర్మాచరణం  తప్పనివాడు,  ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల విశ్వాసం.

ఈ పర్యాయం శ్రీరామనవమి ఏప్రిల్‌ 21 ‌బుధవారం అయింది. భద్రాద్రిలో జరిగే కల్యాణోత్సవంలో పాల్గొనలేకపోయినా.. దగ్గర్లో ఉన్న రామాలయంలో జరిగే పూజలు, కల్యాణోత్సవాల్లో పాల్గొన్నా సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం. కోరోనా భూతం ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యమాడుతున్న నేపథ్యంలో గత ఏడాది, ఈ ఏడాది అత్యంత నిరాడంబరంగా, అతి స్వల్ప సంఖ్యలో వేదపండితుల, పురోహితుల సమక్షంలో భక్తులకు దూరంగా  నవమి ఉత్సవాలు జరుగుతున్నాయి.
– నందిరాజు రాధాకృష్ణ,

Leave a Reply