Take a fresh look at your lifestyle.

బడ్జెట్‌పై సంతోషంగా ఉన్నారు…. అందుకే విమర్శల్లేవు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
  • ‌కోవిడ్‌ ‌పరిస్థితులను ఎదుర్కొనే బడ్జెట్‌ ఇది కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌

‌ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీఆర్‌ఎస్‌ ‌విమర్శలు చేయలేదంటే సీఎం కేసీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సంతోషంగా ఉన్నారని భావిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిన నిధులపై విమర్శలు వస్తున్నాయనీ, ఎంత మంచి బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టినా విమర్శలు సహజమని పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు మోడీ ఫోటో కూడా పెట్టడం లేదనీ, కేంద్ర పథకాలనే పేరు మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మ్యాచింగ్‌ ‌గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి పనలు ఆగిపోయాయన్నారు. భవిష్యత్‌ ‌తెలంగాణ కోసం, శక్తివంతమైన తెలంగాణ కోసం అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం సాగిస్తుందని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అధోగతి పాలు చేస్తున్నారనీ, బంగారు తెలంగాణలో భవిష్యత్తు కోసం యువత ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాననీ, కేంద్ర బడ్జెట్‌ను ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌మాట్లాడుతూ దేశంలో కోవిడ్‌ ‌పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అనువైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఆత్మ నిర్భర భారత్‌ ‌దిశగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను రూపొందించిందని చెప్పారు.

ఇందులో భాగంగా ముఖ్యంగా దేశంలోని రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వర్తకులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రోత్సాహకాలు కల్పించడం జరిగిందన్నారు. దేశంలోని పరిశ్రమలను ప్రోత్సహిస్తే ఆదాయం వృద్ధి చెందడంతో పాటు యువత, నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి కలుగుతుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌చెప్పారు.

Leave a Reply