- ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వని నగర వోటరు
- మేయర్ పీఠాన్ని అధిరోహించేది ఎవరో….
హోరాహోరీగా సాగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో నగర వోటరు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. మేయర్ పీఠం మాదంటే మాదని ధీమా వ్యక్తం చేసిన అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు అంతు చిక్కని విధంగా ఫలితాలు వచ్చాయి. జీహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు వోటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అధికార టీఆర్ఎస్ నగరాన్ని ఆరేళ్లలో చేసిన అభివృద్ధితో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారనీ, జీహెచ్ఎంసిపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునే విషయంలో టీఆర్ఎస్ అవినీతి, హిందుత్వ ఎజెండా, కుటుంబ పాలన పేరుతో నగర వోటర్ల ముందుకు వెళ్లింది. ఎంఐఎం ఎప్పటి మాదిరిగానే ఇవేవీ పట్టకుండా మత ప్రాతిపదికన వోటర్లను ఆకర్శించే ప్రయత్నం చేసింది. ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్ అవినీతి ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి వెళ్లింది. కాగా, ఈ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ సొంతంగా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునే పరిస్థితి లేదు.
టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే మిత్రపక్షమైన ఎంఐఎం మద్దతు, పార్టీకి చెందిన ఎక్స్ అఫీషియో సభ్యుల వోటింగ్పై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక టీఆర్ఎస్ తరువాత రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మేయర్ పీఠాన్ని అధిరోహించే స్థాయిలో గెలుపొందనప్పటికీ వచ్చిన ఫలితాలతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. ఆ తరువాతి స్థానంలో నిలచిన ఎంఐఎం తనకు గతంలో పట్టున్న స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. మొత్తంగా నగర వోటరు మేయర్ పీఠంపై కూర్చోవడానికి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వని నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రథమ పౌరుడు ఎవరో మరో రెండు రోజుల్లో తేలనుంది.