Take a fresh look at your lifestyle.

అం‌దరి కృషి ఫలితమే…. హమారా హైదరాబాద్‌

హైదరాబాద్‌ ‌నివాస యోగ్యమైన  మహానగరంగా  ఒక సంస్థ సర్వేలో  వెల్లడైంది.  ప్రపంచంలో ఎక్కడెక్కడి వారో హైదరాబాద్‌ ‌సందర్శనకు వచ్చి  తిరిగి వెళ్ళేందుకు   విముఖత వ్యక్తం చేస్తుంటారు. భౌగోళికంగా, కళా, సాంస్కృతిక రంగాల్లో  భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన హైదరాబాద్‌ అం‌టే నాకు ఇష్టం అని సెలబ్రెటీలు  తరచు ఇంటర్వ్యూలలో ప్రకటిస్తుంటారు. సినీరంగానికి చెందిన వారైతే చెప్పనవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్‌ ‌మినీ భారత్‌.  ‌హైదరాబాద్‌ ‌కి  400 సంవత్సరాల  ఘనమైన చరిత్ర ఉంది. ఈ నగరం అభివృద్దిలో అందరి పాత్రా ఉంది.  ఇదంతా నావల్లే జరిగిందని ఎవరైనా అనుకుంటే వారంత అమాయకులు ఉండరు.  ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసిన  సీమాంధ్ర బాబునాయుడు (నారా చంద్రబాబునాయుడు )  హైదరాబాద్‌ ‌నా వల్లే అభివృద్ధి చెందిందని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.ఆయన ప్రకటనలను చూసి   హైదరాబాద్‌ ‌వాసులు  నవ్వుకుంటూ ఉంటారు. చంద్రబాబు పుట్టకపూర్వమే  హైదరాబాద్‌  అభివృద్ధి జరిగింది. ఎందరో, ఎందరెందరో తమ వంతు సాయాన్ని అందించారు. ఇన్‌ ‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీని తానే హైదరాబాద్‌ ‌కి తెచ్చానని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. నిజానికి  ఆయన  అధికారంలోకి రాకముందే హైదరాబాద్‌ ‌లో  ఐటి పార్క్ ‌వెలసింది.  హైదరాబాద్‌ ‌ని విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు తెరాస ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రి కెటి రామారావు బుధవారం అసెంబ్లీలో చర్చ సందర్బంగా  ప్రస్తావిస్తూ హైదరాబాద్‌  ‌తమ పాలనలోనే ఈ స్థాయికి ఎదిగిందని  తాము  అనుకోవడం లేదనీ, అలా అనడం హాస్యా స్పదం అవుతుందని  నిజాయితీగా ఒప్పుకున్నారు. హైదరాబాద్‌ ‌కు ప్రపంచ వ్యాప్తంగా ఏనాటి నుంచో గుర్తింపు ఉంది.ఈ మధ్య పుట్టుకొచ్చిన సంస్థల ప్రశంసలు, సర్టిఫికెట్లు అవసరం లేదు.

హైదరాబాద్‌లో అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు, జాతుల వారు సహజీవనం సాగిస్తున్నారు. ఎవరి పండుగలు వారు జరుపుకోవడం, ఒకరికొకరు తమ పండగలకు ఆహ్వానించడం, ఆనందంగా గడపడం హైదరాబాద్‌ ‌సంస్కృతి, హైదరాబాద్‌లో అన్ని విద్యా సంస్థలు,  సాంస్కృతిక సంస్థలు, క్రీడా సంస్థలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌ ‌పోటీలకు హైదరాబాద్‌ ‌వేదిక కావడం కొత్తేమీ కాదు. హైదరాబాద్‌ ‌పై తెరాస ప్రభుత్వం  చిన్న చూపు చూస్తోందన్న  ఆరోపణలను   మంత్రి కేటి రామారావు తిప్పికొట్టారు.  తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ ‌లో వివిధ ప్రాజెక్టుల అమలు కోసం   67 కోట్లు ఖర్చు చేశామనీ, పేదలకు  అన్నపూర్ణ పథకం కింద భోజన సౌకర్యాన్ని కల్పించామనీ,  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా  డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌లతో పేదల పట్టణాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు.అలాగే, విలాస వంతమైన, సంపన్నుల ప్రాంతాల్లో  అభివృద్ది కోసం పార్కులు, థీమ్‌ ‌పార్కులు నిర్మించడం జరుగుతున్న మాటనిజమే.అయితే,   సంపన్నుల కాలనీల్లో మాత్రం మురుగు నీటి పారుదల సౌకర్యాల్లో లోపాల వల్ల  ప్రజలు చిన్న పాటి వర్షానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది.  హైదరాబాద్‌ అం‌తర్జాతీయ సదస్సులకు  వేదక అవుతోంది ., అమెరికా అధ్యక్షు డు ట్రంప్‌ ‌కుమార్తె ఇవాంక ట్రంప్‌ ‌హైదరాబాద్‌ ‌లో  ఆ మధ్య  ఒక అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిదిగా హాజరై ఇక్కడి ప్రజల కలుపుగోలు తనాన్ని మెచ్చుకున్నారు. ఆమె మాత్రమే కాదు,  అంతర్జాతీయ నాయకులెంతో మంది హైదరాబాద్‌  ‌పర్యటన ముగించుకుని స్వస్థలాలకు వెళ్ళిన తర్వాత ఇక్కడి వాతావరణాన్నీ, ప్రజల మర్యాదలను గురించి పదే పదే గుర్తు చేసుకోవడం మనకు తెలుసు. ప్రతిష్ఠాత్మకమైన   కోర్సులలో శిక్షణ కేంద్రాలు హైదరాబాద్‌ ‌లో ఉన్నాయి.

అదే సందర్భంలో  హైదరాబాద్‌ ఒక్క రోజులో అభివృద్ది చెందలేదు. హైదరాబాద్‌ ‌ను ఆనుకుని ఉన్న  శివారు పట్టణాలు, టౌన్‌ ‌షిప్‌లు ఎంతో అభివృద్ధిని సాధించాయి. హైదరాబాద్‌  అభివృద్ధిలో  డా .మర్రి  చెన్నారెడ్డి నుంచి డా. వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి వరకూ కాంగ్రెస్‌ ‌ముఖ్యమంత్రుల కృషి మరువరానిది. రాజశేఖరరెడ్డి హయాంలో ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు జంటనగరాలకు కంఠాభరణంగా రూపుదిద్దుకుంది. అంతేకాక, మెట్రో రైలు వ్యవస్థ కు కూడా ఆయన హయాంలోనే ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి.  ఆయన హయాంలో భౌగోళిక స్వరూపం మారిపోయింది.  హమారా హైదరాబాద్‌ అని ఈనాడు అందరూ  గొప్పగా చెప్పుకోవడానికి  కారణం ఎంతో మంది సేవల ఫలితం. ఐటి రంగం  వృద్ది చెందడం వల్ల హైదరాబాద్‌ ‌ప్రాధాన్యం పెరిగింది.  ఐటి రంగం  మూడుపువ్వులూ,ఆరుకాయలుగా వృద్ది చెందడం అనేది ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల్లో భాగంగానే చూడాల్సి ఉంటుంది . అన్ని మతాలకు చెందిన   ప్రతిష్టాత్మక ఉత్సవాలకు హైదరాబాద్‌ ‌నెలవు.

హైదరాబాద్‌ ‌బిర్యానీ ప్రపంచంలో వివిధ దేశాల వారి ప్రశంసలు అందుకుంటోంది.   తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు హైదరాబాద్‌ ‌నెలవుగా ఉంటోంది.అదే సందర్భంలో తెలుగువారి పండుగలు, ఉత్సవాలకు   నిర్వహణ కేంద్రంగా పేరొందింది.  హైదరాబాద్‌  ‌చలన చిత్ర పరిశ్రమ  ఎంతో అభివృద్ది చెందింది.   తెలుగులో ఉన్న  ప్రసార సాధానాలన్నింటికీ  హైదరాబాద్‌ ‌కేంద్రంగా  భాసిల్లుతోంది.అదే మాదిరిగా  హైదరాబాద్‌ ‌ని  విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు  కృషి చేస్తున్నామనీ, పాత బస్తీ  అభివృద్ధికి ప్రణాళిక అమలు జేస్తామని కేటి రామారావు వెల్లడించారు. యువనాయకుడైన  కేటీఆర్‌ ‌నాయకత్వంలో హైదరాబాద్‌ ‌మరిన్ని రంగాల్లో ముందంజ వేసి జాతీయ,అంతర్జాతీయ సభలు, సమావేశాలకు వేదిక కాగలదని ఆశిద్దాం.  హమారా హైదరాబాద్‌ ‌కీర్తి ఏ ఒక్కరిదీ కాదు.అందరిదీ, అలాగే,హైదరాబాద్‌ ఏ ఒక్కరిదీ కాదు,అందరిదీ.   ఈ భావన వ్యాప్తి కావడం వల్లనే జంటనగరాల్లో ఈ మధ్య ప్రశాంతత నెలకొంది. ఇలాగే అది కొనసాగాలన్నది  హైదరాబాదీల ఆకాంక్ష.

Leave a Reply