Take a fresh look at your lifestyle.

అర్ధ శతాబ్దం తర్వాత అవే మాటలు

“ఆరోజు ఆ ఫ్యాక్టరీ పెడితే అనేక మందికి ఉపాధి లభిస్తుందని కురుసాం జమీందార్‌ ఆరువేల ఎకరాలు ఉచితంగా ఆందజేసిన విషయం గమనార్హం. దాని తర్వాత ఫ్యాక్టరీ మరికొంత స్థలాన్ని స్వయంగా సమకూర్చుకోగలింది. వారు ఏ ఉద్దేశ్యంగా ఇచ్చారన్న విషయాన్ని మర్చి సునాయాసంగా అమ్మిపారేయాలనే ఆలోచనా విధానాన్ని పలువురు తప్పుపడుతున్నారు. అంతేగాక  ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకు ఇస్తున్న రాయితీలను ఈ ఫ్యాక్టరీలకు అందజేస్తే అవి లాభాల బాటలో తప్పకుండా నడుస్తాయంటున్న ఏపి ప్రజలు మరోసారి ఉద్యమిస్తున్నారు. ఎంతోమంది రక్తమోడ్చి సాధించుకున్న ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ఉద్యమించాల్సిన వారు అక్కడ ఉద్యమించకుండా తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని సాధిస్తామని తిరగడం హాస్యాస్పదమేమరి.”

సరిగ్గా అర్ధ శతాబ్దం తర్వాత అవే మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజానీకం యావత్తు ఉద్యమించిన వేళ ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అన్న నినాదాలు ఆనాడు మిన్నుముట్టాయి. ఉమ్మడి రాష్ట్ర ప్రజలంతా ప్రాంతీయ విభేదాలను పక్కకు పెట్టి నాడు ఉద్యమించిన తీరు తెన్నులు నేటికీ జ్ఞాకపకాల దొంతరలో మిగిలిఉన్నాయి. నాటి ప్రజా ఉప్పెన మీద సహజంగానే రాజ్యం స్వైరవిహారం చేసినా ప్రజలు ఏమాత్రం వెనుకాడలేదు. ఏ ఉద్యమానికైనా విద్యార్థుల బాగస్వామ్యం లేనిదే పూర్తి కాదన్నట్లు నాడు కళాశాల, పాఠశాల విద్యార్దులంతా తరగతులను బహిష్కరించి ప్లకార్డ్సు చేతపట్టుకుని పై నినాదాన్ని వల్లెవేస్తూ  ఉద్యమించారు. బంద్‌లు, రాస్తా రోకోలు, సభలు, సమావేశాలు, సమ్మెలు, సామూహిక నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలతో ఆనాడు రాష్ట్రమంతా అట్టుడికిపోయింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంఎల్‌ఏలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు దోహదపడ్డారు.

నాటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అనుకూలంగా ఉన్నప్పటికీ, పాలనాపర నిర్ణయాలతో సహజంగానే ఉద్యమకారులపై లాఠీలు ఝళిపించింది. ఫైరింగ్‌లు జరిపింది. దీంతో సుమారు ముప్పై మందికి పైగా మృత్యువాతపడ్డారు. చాలామందికి గాయాలయ్యాయి. తెలంగాణ ప్రాంతీయులు కూడా ఈ ఉద్యమంలో తమవంతు భూమికను పోషించారు. వరంగల్‌, ఆదిలాబాద్‌ ‌జిల్లాలకు చెందిన వారుకూడా ఈ పోరాటంలో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అందరిదీ అదే ఉక్కు సంకల్పం. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలన్నది. చివరకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాష్ట్ర ప్రజల డిమాండ్‌కు తలొగ్గక తప్పలేదు. పార్లమెంట్‌ ‌సాక్షిగా విశాఖలో స్టీల్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామన్న హామీ ఇవ్వటంతో పాటు, ఆ మరుసటి సంవత్సరం ఫ్యాక్టరీకి స్వయంగా తానే శంఖుస్థాపన చేసింది కూడా. ఆ తర్వాత వొచ్చిన జనతా ప్రభుత్వం వెయ్యికోట్ల నిధులు సమకూర్చడంతో ప్రారంభమైన ఫ్యాక్టరీ దాదాపు ఈ అయిదు దశాబ్దాల కాలంలో అనేక ఆటుపోట్లకు గురైనా తన బ్రాండ్‌ ఇమేజ్‌తో మార్కెట్‌లో నిలదొక్కుకుంది. దీనికి అనుబంధంగా అనేక చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు వందల సంఖ్యలో ఉద్భవించాయి. వాటిల్లో కూడా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.

కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు నామమాత్రమే. కాని,  వివిధ రూపాల్లో ఈ ఫ్యాక్టరీ నుండి కేంద్రం పొందుతున్న లాభాలు మాత్రం వేలకోట్లలో ఉన్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ ఇప్పుడీ ఫ్యాక్టరీని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కేంద్రం పట్టుదలతో ఉంది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాలను ప్రవేశ పెట్టిన తర్వాత క్రమేణా ప్రభుత్వరంగ సంస్థల్లోని తన వాటాలను తగ్గించుకోవటమో, పూర్తిగా తీసివేసుకోవడమో చేయడంతో దేశంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు యాజమాన్యాల కిందకు వెళ్ళాయి. ఫలితంగా కేంద్రం లక్షలాది కోట్ల రూపాయలను ఆర్జించిందేగాని, వేలాది కార్మికులను బజారున పడేసింది. అందులో భాగంగానే గత కాంగ్రెస్‌ ‌హయాంలోనే ఈ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌వాటాను తగ్గించుకోవడానికి కేంద్రం చేసిన ప్రయత్నాన్ని ప్రజలు, కార్మికులు తిరస్కరించడంతో అప్పటికైతే ఆగింది.

- Advertisement -

కాని, ఇప్పుడు తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ఈ ‌ఫ్యాక్టరీని ప్రైవేటుకు అప్పగించబోతున్నట్లు చేసిన ప్రకటన, మరో మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ఈ ‌ఫ్యాక్టరీ నష్టాల్లో ఉండడంతో ప్రైవేటుకు అప్పగించాల్సిందేనని చెప్పడం ఇప్పుడు మరోసారి ‘విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు’ నినాదం తెరపైకి వొచ్చింది. ఇప్పటివరకు దేశాన్ని ఏలిన ప్రభుత్వాలన్నీ కుక్కను చంపడానికి పిచ్చిదని నామకరణం చేసినట్లు ఏ ఫ్యాక్టరీనైనా మూసివేయడానికో లేదా ప్రైవేటుకు అప్పగించేందుకు చెప్పే ఒకే మాట అది నడవదన్నది.. దాని వల్ల నష్టం వొస్తోందన్నది.  ప్రభుత్వ రంగ సంస్థల పట్ల మొదటి నుండి పాలకులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనడానికి ఆయా సంస్థలకు కనీస నిధులను కేటాయించకపోవడమే.

ఇవ్వాళ ప్రైవేటు సంస్థలకు రెడ్‌ ‌కార్పెట్‌ ‌పరుస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు వారికి ఇచ్చే రాయితీలుగాని, నిధులుగాని ఈ రంగంలోని సంస్థలకు అందించకపోవడం ప్రధాన కారణంగా ఆయా రంగంలోని నిపుణులు చెబుతున్న మాట. విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌నిర్మాణం జరిగి అర్ధ శతాబ్దం అవుతున్నా నేటికీ ఈ ప్లాంట్‌కు గనులను కేటాయించని ప్రభుత్వాలు, కొత్తగా ప్రేవేటు రంగంలో నెలకొల్పుతున్న స్టీల్‌ ‌ప్లాంట్‌లకు మాత్రం గనులను కేటాయించడమే పాలకుల నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెబుతున్నది. తెలంగాణ ఉద్యమకాలంలో కెసిఆర్‌ అన్నట్లు గడ్డి గాడిదకేసి, అవుకు పాలు పిండినట్లు, నిధులు సమకూర్చకుండా నష్టాల్లో నడుస్తున్నదని గజాల లెక్కన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తున్నారు. గతంలో వరంగల్‌లోని ఆజంజాహి మిల్లు విషయంలోనూ అదే చేశారు. ఈ మిల్లుకు చెందిన 202 ఎకరాల స్థలాన్ని కేవలం నడువదు అన్న ఒకే ఒక్క మాటతో గజాల లెక్కన మొత్తం స్థలాన్ని అమ్మేశారు.

అంతేగాని ఏ ప్రభుత్వం కూడా నిధులను కేటాయిస్తామని గాని, కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని ఏనాడు అనలేదు. ఇప్పుడు ఏపి ముఖ్యమంత్రి కూడ విశాఖ స్టీల్‌ ‌ఫ్యాక్టరీలో వాడకుండా ఉన్న ఏడువేల ఎకరాలను అమ్మడం ద్వారా దానికి ఆర్థిక పుష్టిని కలిగిస్తామంటున్నాడేగాని, కేంద్రం నిధులను, గనులను కేటాయించాలన్న పట్టుదలను చూపుతున్నట్లు లేదు. ఆరోజు ఆ ఫ్యాక్టరీ పెడితే అనేక మందికి ఉపాధి లభిస్తుందని కురుసాం జమీందార్‌ ఆరువేల ఎకరాలు ఉచితంగా ఆందజేసిన విషయం గమనార్హం. దాని తర్వాత ఫ్యాక్టరీ మరికొంత స్థలాన్ని స్వయంగా సమకూర్చుకోగలింది. వారు ఏ ఉద్దేశ్యంగా ఇచ్చారన్న విషయాన్ని మర్చి సునాయాసంగా అమ్మిపారేయాలనే ఆలోచనా విధానాన్ని పలువురు తప్పుపడుతున్నారు. అంతేగాక  ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకు ఇస్తున్న రాయితీలను ఈ ఫ్యాక్టరీలకు అందజేస్తే అవి లాభాల బాటలో తప్పకుండా నడుస్తాయంటున్న ఏపి ప్రజలు మరోసారి ఉద్యమిస్తున్నారు. ఎంతోమంది రక్తమోడ్చి సాధించుకున్న ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ఉద్యమించాల్సిన వారు అక్కడ ఉద్యమించకుండా తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని సాధిస్తామని తిరగడం హాస్యాస్పదమేమరి.

manduva ravindhar rao
మండువ రవీందర్‌రావు

Leave a Reply