- కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
- లోగో…మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చార్జ్‌షీట్ విడుదల
- రాహుల్ భారత్ జోడో యాత్ర సందేశం విస్తృతంగా ప్రజల్లోకి
- విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, జైరామ్ రమేష్
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జనవరి 21 : కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జనవరి 26 నుండి రెండు నెలల పాటు ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ పేర ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన లోగోను, దానితో పాటుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ లోపాలను నిలదీస్తూ..‘భ్రష్ట్ జుమ్లా పార్టీ’..కుచ్ కా సాత్, ఖుద్ కా వికాస్ – సబ్ కే సాత్ విశ్వాస్ ఘాత్’ పేర బిజెపికి వ్యతిరేకంగా ‘‘ఛార్జిషీట్’’ను విడుదల చేసింది. ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం చేస్తారు. దేశవ్యాప్తంగా 6 లక్షల గ్రామాలు మరియు 2.5 లక్షల గ్రామ పంచాయతీలలోని 10 లక్షల పోలింగ్ బూత్‌లలో ప్రతి ఇంటికి వెళ్లి కలిసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా న్యూ దిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్‌లు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ…రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర సందేశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకుని వెళ్లే ఉద్దేశ్యంతో ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమాన్ని పార్టీ తలపెట్టిందని, అదే విధంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ చార్జిషీట్‌ను కూడా విడుదల చేసిందని, దాన్ని కూడా ప్రజలలోకి తీసుకువెళుతామని తెలిపారు. ఇక సంబంధిత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు(పిసిసిలు) అవసరమైన చోట ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ‘ఛార్జిషీట్లు’ తయారు చేస్తాయని వేణుగోపాల్ చెప్పారు. మోదీ ప్రభుత్వ ‘‘దుష్పరిపాలన’’ వల్ల ప్రజలు అనుభవిస్తున్న బాధలను తమ పార్టీ పరిష్కరిస్తుందని అన్నారు. పార్టీ రాహుల్ నేతృత్వంలో తలపెట్టిన చారిత్రాత్మక కార్యక్రమం ‘భారత్ జోడో యాత్ర’ 130 రోజుల తర్వాత కాంగ్రెస్‌కు దేశ ప్రజల నుండి కావలసిన సమాచారం అందిందని అన్నారు. లక్షలాది మంది ప్రజలు రాహుల్ గాంధీతో మాట్లాడారని అన్నారు.
దీంతో మోడీ దుష్ట పాలన కారణంగా ప్రజలు పడుతున్న బాధను అర్థం చేసుకున్నామని తెలిపారు. అంతకుముందు, జమ్మూ-కాశ్మీర్‌లోని కథువాలో కాంగ్రెస్ సినియర్ నేత జైరామ్ రమేష్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ..6 లక్షల గ్రామాలు మరియు 2.5 లక్షల గ్రామ పంచాయతీలలోని 10 లక్షల పోలింగ్ బూత్‌లలో ఇంటింటికీ కాంగ్రెస్ కాన్వాస్ ప్రతి ఇంటికి చేరుతుందని అన్నారు. ‘హాత్ సే హాత్ జోడో’ కార్యకమ్రంలో ఇంటింటి ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లేఖను, కేంద్రంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ సిద్ధం చేసిన ఛార్జిషీట్‌ను ప్రజలకు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నామని వేణుగోపాల్ తెలిపారు