
సీఏఏకు నిరసన తెలుపుతున్న విద్యార్ధులకు గాయాలు
నిరసన తెలుపుతున్న ఢిల్లీలోని జామియా విశ్వవిద్యాలయ విద్యార్ధులపై ఓ అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వర్సిటీలో కలకలం రేగింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు నిరసనలు చేస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి వారిపై తుపాకీతో కాల్పులకు తెగబడటంతో భయాందోళన వాతావరణం నెలకొంది. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. కొందరు జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ ప్రాంతంలో సీఏఏకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో నల్లటి కోటు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ బయటకు తీసి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు విద్యార్ధులకు బులెట్ గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా సమయంలో భారీగా పోలీసులు సైతం అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. సీఏఏకు వ్యతిరేకంగా జామియా యూనివర్శిటీలో గత నెలలో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే .