Take a fresh look at your lifestyle.

ఏజన్సీలో కాల్పుల మోత

  • అర్ధరాత్రి మందుపాతర పేల్చిన మావోయిస్టులు
  • కొద్దిగంటల్లోనే ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
  • ఏజన్సీలో యుద్దవాతావరణం

ఏజన్సీ ప్రాంతంలో మళ్ళీ యుద్దవాతావరణం నెలకొంది. గత కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న ఏజన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గుండాల ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ సవాలు విసురుతూ ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చింది. మావోయిస్టులు ప్రతీ కార చర్యగా చర్ల మండలం పగిడివాగు దగ్గర మందుపాతర పేల్చి రోడ్డును ధ్వంసం చేసారు. ఈ సంఘటన జరిగిన కొద్దిగంటలకే మావోయిస్టులకు పోలీసులకు ఎదురుకాల్పులు జరుగగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పూర్తివివరాల్లోకి వెళితే గుండాల మండలం దేవలగూడెం మరియు దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి చెందాడు. దీనికి నిరసనగా ఆదివారం నాడు మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఎన్‌కౌంటర్‌కు ప్రతీచర్యగా చర్ల మండలం వద్ద శక్తివంతమైన మందుపాతర పేల్చి రోడ్డును ధ్వంసం చేసారు. ఈ మందుపాతరకు సుమారు 5 కి.మీ దూరాన బలమైన శబ్దాలు వచ్చినట్లు గిరిజన ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. ఈ సంఘటనతో పోలీస్‌ ‌బలగాలు అప్రమత్తం అయ్యాయి.

మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించటమే కాకుండా మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతాలన్ని పోలీస్‌ ‌ప్రత్యేక బలగాలు కూంబింగ్‌ ‌నిర్వహించారు. సోమవారం నాడు ఉదయం నుండి కూడ పోలీసులు అటవీ ప్రాంతాన్ని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనలో తెలంగాణ ,ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రాల సరిహద్దున వద్దిపేట, పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు ఎదురుపడి కాల్పులు జరుపడంతో పోలీసులు కూడ తిరిగి కాల్పులు ప్రారంభించటంతో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు భదాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌ ‌ధృవీకరించారు. సంఘటన స్థలం వద్ద ఆయుధాలు కూడ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

ఉలిక్కిపడిన ఏజన్సీ ప్రాంతం : మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు ఏజన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. పూర్తిగా గిరిజన ప్రాంతాలు కావడంతో గిరిజనులు భయాంధోళన చెందుతున్నారు. సరిహద్దు ప్రాంతంలోని పోలీస్‌, ‌మావోయిస్టు కాల్పుల మోతలకు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రశాతంగా ఉన్న ఏజన్సీ ప్రాంతం మళ్ళీ ఒక్కసారిగా మందుపాతర పేల్చటం , కాల్పుల మోతలతో ఏజన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల మధ్య అమాయక గిరిజన ప్రాంతాలు భయాంధోళన చెందుతున్నాయి. ఏ సమయంలో ఏమి జరుగుతుందో అని గిరిజన గ్రామాలు భయపడుతున్నాయి. మళ్ళృ మావోయిస్టులు ప్రభావం ఎక్కువ కావడంతో పోలీసులు కూడ అదేస్థాయిలో కూంబింగ్‌ ‌నిర్వహించటంతో అటవీ ప్రాంతంలో జీవించే గిరిజనులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply