- మోడీ స్వరాష్ట్రంలో వేగంగా మారిన రాజకీయాలు
- అనూహ్య పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం
ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి శనివారం నాడు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్కు అందజేశారు. గాంధీనగర్లో జరిగిన సమావేశంలో చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో విజయ్ రూపానీ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు చేయగా..అందులోనూ రూపానీ పాల్గొన్నారు. అయితే ఇంత త్వరగా అనుకోకుండా ఆయన రాజీనామా చేయడానికి కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. కాగా, సీఎం విజయ్ రూపానీతో పాటు కేబినెట్ మంత్రులంతా మొత్తం కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. 2016లో నాటి సీఎం ఆనందీ బెన్ పటేల్ రాజీనామాతో సీఎం పదవిలోకి వొచ్చిన విజయ్ రూపానీ ఆ తర్వాతి ఏడాదిలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం నడుస్తున్నప్పటికీ బీజేపీని విజయవంతంగా అధికారంలోకి తీసుకురాగలిగారు.
వొచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇలా రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఆయన స్థానంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న నితిన్ పటేల్ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం నడుస్తుంది. రాజీనామా సమర్పణ అనంతరం మిడియాతో రూపానీ మాట్లాడుతూ..ముఖ్యమంత్రిగా సేవలందించేందుకు తనకు అవకాశం కల్పించిన బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు. రాజీనామా నిర్ణయంపై అడిగిన పలు ప్రశ్నలకు…ఐదేళ్ల సుదీర్ఘ కాలం సేవలందించానని చెప్పారు. నాయకత్వ మార్పు బీజేపీలో సాధారణ పక్రియేనని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో తాను సేవలు కొనసాగిస్తున్నానని తెలిపారు. గత ఐదేళ్లుగా బీజేపీపై ప్రజలు తమ విశ్వాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని రూపానీ చెప్పారు. 2016 ఆగస్టు 7న ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ పగ్గాలు చేపట్టారు.
ఆయన గుజరాత్లోని రాజ్కోట్ వెస్ట్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీలో పని చేసే వాళ్లందరికీ సమాన అవకాశాలు కల్పించడం బీజేపీ సంప్రదాయమని చెప్పారు. గుజరాత్లో అభివృద్ధి కొనసాగుతుందని, తనకు పార్టీ అప్పగించే కొత్త బాధ్యతలను మరింత ఉత్సాహంతో నిర్వర్తిస్తానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని, పార్టీ ఎటువంటి బాధ్యతలు అప్పగించిన తన సేవలు అందిస్తానని రూపానీ తెలిపారు. వొచ్చే ఏడాది జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారని ఈ సందర్భంగా మిడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించగా.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర నాయకత్వ మార్గదర్శనంలో పార్టీ నడుస్తుందని చెప్పారు. ఈ ఏడాదిలో ఇలా బీజేపీ సీఎంలు తమ పదవులు కోల్పోవడం ఇది నాలుగో సారి. జులైలో కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప ఉన్నట్టుండి రాజీనామా చేశారు. అలాగే ఉత్తరాఖండ్లో త్రివేంద్ర రావత్, తీరథ్ సింగ్ రావత్ ఇద్దరు వెంట వెంటనే తమ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.