Take a fresh look at your lifestyle.

గుజరాత్‌ ‌మోడల్‌..ఒక బోగస్‌

  • అం‌తా స్వోత్కర్ష..ఉత్త ప్రచార పటాటోపం
  • అవినీతి, ఆశ్రిత పక్షపాతం, మందగమనం అన్నీ ఎక్కువే
  • రూపానీ నిష్క్రమణ ప్రచారంలో భాగమే

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్
అహ్మదాబాద్‌లో ఇటీవల పర్యటించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సర్దార్‌ ‌ధామ్‌ని జాతికి అంకితం చేస్తున్నట్టుగా బ్యానర్లు, కట్‌ అవుట్లు కనిపించాయి.  సర్దార్‌ ‌ధామ్‌ అం‌టే  విదేశాల్లో ఉండే పతిదార్‌ ‌సామాజిక వర్గానికి చెందిన వారు అహ్మదాబాద్‌ ‌వొస్తే బస చేయడానికి ఉద్దేశించినట్టిది. ఆ సామాజికవర్గాన్ని బుజ్జగించడానికి కోట్లాది ప్రజాధనాన్ని వెచ్చించడమే కాకుండా అడ్వర్‌టైజ్‌మెంట్ల రూపంలో ఖర్చు చేశారు. ఆన్‌ ‌లైన్లో సెప్టెంబర్‌ 11‌వ తేదీన జరిగిన ఈ కార్యక్రమం  కేవలం ఒక సామాజిక వర్గానికి పరిమితమైంది. ఆ సామాజికవర్గాన్ని బుజ్జగించడం కోసం బీజేపీ నానా తంటాలు పడుతుంది. ఆ రోజు ఉదయం స్థానిక దినపత్రికల్లో ప్రభుత్వం అడ్వర్‌టైజ్‌మెంట్లు విడుదల చేసింది. అందులో  ముఖ్యమంత్రి విజయ్‌ ‌రూపానీ పాలన బ్రహ్మాండంగా ఉందనీ, వ్యాక్సినేషన్లో  రాష్ట్రం ముందుందని, హరిజనులు, ఆదివాసులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారనీ, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని  సోత్కర్షలు నిండి ఉన్నాయి.

ఇంతకీ సర్దార్‌ ‌ధామ్‌ని ఉక్కుమనిషి సర్దార్‌ ‌పటేల్‌ ‌పేరిట నిర్మించారు. ఆయన జీవిత కాలంలో ఏనాడూ పటేల్‌ ‌సామాజిక వర్గాన్ని ఉపయోగించుకోలేదు.   అలాంటి వారికి కులం ముద్ర వేయడం దుర్మార్గం. తొలి ప్రదాని నెహ్రూకూ, ఆయనకూ ఎటువంటి విభేదాలు లేకపోయినా ఉన్నట్టు చిత్రీకరించిన వారే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఒబీసీకి చెందిన వారైనా రాష్ట్రంలో బాగా బలం ఉన్న పతిదార్‌ ‌సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకోవ డానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. సర్దార్‌ ‌ధామ్‌ ‌ప్రారంభమైన తర్వాత రెండు రోజులకే ముఖ్యమంత్రి విజయ్‌ ‌రూపానీ నిష్క్రమణ జరిగింది. ఆయన నిష్క్రమణకు సరైన కారణాలు లేవు. అయితే, పరిపాలన గాడి తప్పిందని కమలనాధులు చెవులలో గుసగుసలుగా చెప్పుకుంటూ వొస్తున్నారు.

అలాంటప్పుడు రూపానీ పాలనలో ఐదు కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్‌ ‌జరిగినట్టు ప్రచారం ఎందుకు చేసుకున్నారో వారికే తెలియాలి. నిజానికి గుజరాత్‌లో రూపానీ ఏనాడూ స్వతంత్రంగా వ్యవహరించలేదు. ఆయన నిజాయితీపరుడైనా పైవారి ఆదేశాలు అమలు జేసే గుమాస్తాగానే వ్యవహరించారు. గుజరాత్‌లో పాలనా వ్యవహారాలన్నీ ఢిల్లీలో ఉన్న ఇద్దరు బిగ్‌ ‌బాస్‌లు పర్యవేక్షించేవారు. ఆఖరికి జిల్లా కలెక్టర్లతో కూడా వారే నేరుగా మాట్లాడి వ్యవహారాలు నడిపించేవారు.  దానికి విజయ్‌ ‌రూపానీ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. అత్యంత నమ్మకస్తునిగా, విధేయునిగా వ్యవహరించారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో కమలనాథులు ప్రచారం చేస్తున్న డబుల్‌ ఇం‌జన్‌ ‌పాలన ఏమిటో గుజరాత్‌లో విజయ్‌ ‌రూపానీ నిష్క్రమణతో స్పష్టం అయింది.

గుజరాత్‌లో బీజేపీకి తిరుగు లేకపోవడానికి ప్రధాన కారణం సరైన ప్రతిపక్షం లేకపోవడమే. రెండు దశాబ్దాలుగా రాష్ట్రం బీజేపీ పాలనలో ఉంది.  కాంగ్రెస్‌లో చెప్పుకోదగిన నాయకులు ఎవరూ లేరు. నిన్న మొన్నటి వరకూ కమలనాథులను ఎదుర్కుంటూ వొచ్చిన  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ ‌పటేల్‌ ‌కన్నుమూతతో ఆ పార్టీ పూర్తిగా నిస్తేజమైంది. ఆ పార్టీలో ఇప్పుడున్న వారు స్వీయ హననంలో సిద్ధ హస్తులే. ముస్లిం వర్గాలను కూడా  ఇప్పుడు తమ దారిలోకి కమలనాథులు తెచ్చుకున్నారు. ప్రతిపక్షాల్లో చెప్పుకోదగిన నాయకులు, జనాకర్షణ కలిగిన వారు లేరు. దాంతో బీజేపీకి ఎదురు లేని పరిస్థితి ఏర్పడింది.  అయినా గుజరాత్‌లో ఎంతో అభివృద్ధి జరిగిపోతుందనీ, గుజరాత్‌ ‌మోడల్‌ అభివృద్ధి అని ఆత్మస్థుతి ప్రచారాన్ని కమలనాథులు  హోరెత్తిస్తున్నారు. గుజరాత్‌ ‌మోడల్‌ అనేది పూర్తిగా బోగస్‌. ఇతర రాష్ట్రాల్లో కన్నా ఎక్కువ అవినీతి, ఆశ్రిత పక్షపాతం, మందగమనం అన్నీ కూడగట్టుకుని ఉన్నాయి.

గుజరాత్‌లో రైతులు, కార్మికులు,అన్ని వర్గాల ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే, ప్రచారం చేసుకోవడంలో కమలనాథులను మించిన వారు లేరు. మార్పు కోసం గుజరాత్‌ ‌ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాస్తవం ఇది కాగా, గుజరాత్‌ని స్వర్గధామంగా పోల్చేస్తూ కమలనాథులు ప్రచారం హోరెత్తిస్తున్నారు.  నవభారత్‌ అనేది పెద్ద స్లోగన్‌ ‌మాత్రమే. దేశభక్తి అనేది ఆదర్శంగానే ఉంది. ప్రజల కనీస అవసరాలు తీరడం లేదు. రూపానీని మార్చి మరి ఎవరిని తెచ్చినా, పరిపాలన అంతా ఢిల్లీ నుంచేనన్న సంగతి ప్రజలకు తెలుసు.

Leave a Reply