Take a fresh look at your lifestyle.

గుడిసె మురిసిన వేళ.!

నా విద్యార్థులంతా
మీరు మా అయ్య లెక్క అంటరు.!

గట్లనే గీ అమ్మాయి గూడ…నా బిడ్డ
బిడ్డంటే బడి గలిపిన బంధం.!

ఆరు నుండి పది దాక
నా చేతుల్ల మెదిలింది
ఆల్‌ ‌రౌండర్‌ ‌ప్రతిభతో
అదర గొట్టేది..

మా ఇంటికత్తరా….
మీరు అని నారాజు పడేది.

ఎందుకురాను అని
గావురంగా ఎక్కిరించే వాడిని.

ఓరోజు….
చెప్పక చెయ్యకనే వాల్లింటికి పోయిన…

సారు అచ్చిండన్న సంబురంతో…
స్వాగతం పలికింది.

చేతుల అంతో ఇంతో కొత్తలున్న
మోతుబరుల ఇండ్ల నడుమ
పిట్టగూడు లెక్క
వాల్ల గడ్డి గుడెసె.!

అలికి ముగ్గు బెట్టిన
ఒక్కటే అర్ర
నులక మంచం వాల్చి
కూసోండి సార్‌ అం‌ది.

ఊసిపోతున్న దర్వాజ
లేసిపోతున్న పైకప్పు
ఉన్న ఆ ఒక్క అర్రలనే
తల్లైదుగురి పడక.!

మూలకున్న కుండల
చెంబునిండ నీళ్లు ముంచి
చేతికందించి తాగమంది.

మినరల్‌ ‌నీళ్ళకలవాటు పడ్డ పానానికి
మట్టికుండ చల్లదనం తడి
చాన్నాల్లకు తగిలింది.!

పాఠం జెప్పేటప్పుడు
వేదికల మీద మాట్లాడే టప్పుడో
ఆగుడిసె గురించి కదిపేటోన్ని.

ఈ అయిదేండ్లల్ల
వర్షానికురవకుండా
వరుకు కప్పుకున్నది గాని
దాని రూపు రేఖ మారలే.

ఇయ్యాల ఆ గుడిసె
మురిసి పోతాంది.!
తన గుడ్డి దీపం కింద చదివి
బాసర ట్రిబుల్‌ ఐటీలో
సీటుకొట్టిన బిడ్డ’’మానస’’ను చూసి.

డబుల్‌ ‌బెడ్రూం ఓట్ల గుర్రమా
ఓపారి గీ గడ్డి గుడెసెను  జర చూడు.!
– చిలువేరు అశోక్‌

( ‌గడ్డి గుడిసెలో గుడ్డి దీపం కింద చదివి ట్రిపుల్‌ ఐటి సీటు పొందిన నా స్టూడెంట్‌ ‌నిజ జీవన చిత్రం)

Leave a Reply