Take a fresh look at your lifestyle.

కొరోనా, బ్లాక్‌ ‌ఫంగస్‌ ఔషధాలు, పరికరాలపై జిఎస్టీ తగ్గింపు

  • 12 నుంచి 5 శాతానికి తగ్గించిన మండలి
  • అంబులెన్స్‌లపై 28 శాతం ఉన్న జిఎస్‌టిని 12 శాతానికి కుదింపు
  • కౌన్సిల్‌ ‌సమావేశంలో కీలక నిర్ణయాలు.. వెల్లడించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌
  • ‌సెప్టెంబర్‌ 30 ‌వరకు అమలులో..

కొరోనా పోరాటంలో భాగంగా వినియోగిస్తున్న ఔషధాలు, కొన్ని హాస్పిటల్‌ ‌పరికరాలు, ఇతర వస్తువులపై కేంద్రం పన్నును తగ్గించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌నేతృత్వంలో శనివారం 44వ జిఎస్‌టి కౌన్సిల్‌ ‌సమావేశం జరిగింది. కోవిడ్‌ ‌టీకాలు, బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌మందులు, మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సీమిటర్లు, శానిటైజరు, ఆక్సిజన్‌ ‌కాన్సన్‌‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్‌-95 ‌మాస్క్‌లు, ఉష్ణోగ్రతలు కొలిచే పరికరాలపై పన్నులు తగ్గించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. గత నెల 28న జరిగిన మండలి సమావేశంలో ఈ విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే ఇందులో ఏకాభిప్రాయం రాకపోవడంతో దీనిపై అధ్యయనం చేయడానికి మంత్రుల బృందాన్ని నియమించారు. ఆ బృందం తమ నివేదికను గత సోమవారం ఆర్థిక శాఖకు సమర్పించింది.

దీనిపైనే శనివారం కీలక చర్చలు జరిగాయి. కొరోనా మహమ్మారి నేపథ్యంలో మంత్రుల బృందం చేసిన సిఫారసుల ఆధారంగా ఈ పన్నులను తగ్గించినట్లు జిఎస్‌టి కౌన్సిల్‌ ‌తెలిపింది. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌చికిత్సలో వినియోగించే టోసిలిజుమాబ్‌, ‌యాంఫోతెరిసిన్‌ ‌బి వంటి ఔషధాలకు పన్ను వసూలు చేయకూడదని జిఎస్‌టి కౌన్సిల్‌ ‌వెల్లడించింది. ఈ పన్నుల తగ్గింపులు సెప్టెంబర్‌ 30 ‌వరకు అమల్లో ఉంటాయని.. అనంతర పరిణామాల దృష్ట్యా ఈ తగ్గింపులను పొడిగించవొచ్చని ప్రకటించింది. కొరోనా టీకాలపై 5 శాతం జిఎస్‌టి వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే వసూలు చేస్తున్న ఆర్‌టి-పిసిఆర్‌ ‌పరికరాలపై 18 శాతం జిఎస్‌టి రేటులో మార్పులేదని ప్రకటించింది. కొరోనా టెస్టింగ్‌ ‌కిట్‌ ‌ముడిపదార్థాలపై కూడా గత పన్ను రేట్లు కొనసాగనున్నాయి. అయితే కొరోనా టెస్టింగ్‌ ‌కిట్‌లపై 12 శాతంగా ఉన్న జిఎస్‌టిని ఐదుశాతానికి తగ్గించినట్లు కౌన్సిల్‌ ‌తెలిపింది. కొరోనా చికిత్సలో వినియోగించే హెప్రిన్‌, ‌రెమిడెసివిర్‌లపై జిఎస్‌టిని 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. అలాగే కొరోనా చికిత్స కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిన ఏ ఔషధంపైనైనా ఐదు శాతం జిఎస్‌టి వుండనున్నట్లు కౌన్సిల్‌ ‌ప్రకటించింది. మెడికల్‌ ‌గ్రేడ్‌ ఆక్సిజన్‌. ‌వెంటిలేటర్‌, ‌వెంటిలేటర్‌ ‌కాన్సన్ట్రేటర్‌లపై 12 శాతంగా ఉన్న జిఎస్‌టిని ఐదు శాతానికి తగ్గించింది. అంబులెన్స్‌లపై ఉన్న 28 శాతం జిఎస్‌టిని 12 శాతానికి కుదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రం తరపున ఆర్థిక మంత్రి హరీశ్‌ ‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ ‌నీతూప్రసాద్‌ ‌హాజరయ్యారు.

సమావేశంలో కోవిడ్‌ అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్‌, ఆక్సీమిటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జీఎస్టీ రాయితీ ఇచ్చే అంశాలను గుర్తించి చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌మిడియాతో మాట్లాడారు. జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. కొరోనా మెడిసిన్స్, ‌పరికరాలపై పన్నులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌చికిత్సలో వాడే రెండు ఔషధాలు ఆంఫోటెరిసిన్‌ ‌బీ, టోసిలిజుమాబ్‌కు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. రెమ్‌డెసివిర్‌పై పన్ను 12 నుంచి 5 శాతానికి తగ్గించారు. అంబులెన్స్ ‌సేవలపై జీఎస్టీ 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. వ్యాక్సినేషన్‌పై జీఎస్టీ 5 శాతం యథాతథంగా ఉంచారు. కొత్త ధరలు సెప్టెంబర్‌ ‌నెలఖారు వరకు అమల్లో ఉంటాయి అని నిర్మలా సీతారామన్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply