Take a fresh look at your lifestyle.

జిఎస్‌టి వసూళ్లు రాష్ట్రానికి గర్వకారణం

GST collection is a pride of the state

వస్తు సేవా పన్ను(జిఎస్‌ ‌టి) వసూళ్ళు, రిటర్న్‌లను దాఖలు చేయడం వంటి విషయాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని పదిహేనవ ఆర్థిక సంఘం ప్రశంసించడం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమే. జీఎస్‌టి పన్ను వసూళ్ళ విషయంలో అన్ని రాష్ట్రాలలో పరిస్థితి ఒకే తీరులో లేదు. అలాగే, అన్ని నెలల్లో ఒకే తీరులో లేదు. తెలంగాణలో మాత్రం ఈ తేడా కనిపించలేదని ఆర్థిక సంఘం పేర్కొనడం ముదావహం. రాష్ట్రంలో గత ఏడాది కన్నా ఈ ఏడాది జనవరిలో 19 శాతం అధికంగా ఈ పన్ను వసూలు అయింది. జిఎస్‌టి పన్ను మొదటి నుంచి వివాదాస్పదం కావడానికి కారణం కేంద్రం అనుసరించిన ఒంటెత్తు పోకడ విధానం. రాష్ట్రాలు, ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా పన్ను శాతాలను నిర్ణయించారు. ఈ పన్ను వల్ల ప్రయోజనాలు ఉన్నట్టే, సమస్యలూ ఎదురవుతున్నాయి. గతంలో కన్నా పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. అయితే, పన్ను శాతాల నిర్ధారణ శాస్త్రీయంగా జరగలేదు. ఈ విషయమై ప్రతిపక్షాల అభ్యంతరాలను పూర్వపు ఆర్థిక మంత్రి అరుణ్‌ ‌జైట్లీ పట్టించుకోలేదు. అయితే, ఆయనే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జిఎస్‌టి మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలి సమావేశాల్లో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పన్ను రేట్లను తగ్గిస్తూ వొస్తున్నారు. అయితే, కేంద్రం తీసుకున్న చర్యలు చాలవనీ, కొన్ని వస్తువులు, సేవల పన్నులు అధికంగా ఉన్నాయని రాష్ట్రాలు మొరపెట్టుకుంటున్నాయి. ఒకే దేశం- ఒకే పన్ను విధానం వల్ల ప్రజలకు కూడా ఒక విధంగా వెసులుబాటుగానే ఉంటుంది. ఉదాహరణకు చిన్న వ్యాపారులను గతంలో వాణిజ్య పన్నులు, ఇతరపన్నుల శాఖల వారు వేధించేవారు. ఇప్పుడు అలాంటివి లేకపోయినా, శ్లాబుల విషయంలో మాత్రం తమకు అన్యాయం జరిగిందని చిన్న వ్యాపారస్తులు పేర్కొంటున్నారు.

సాధారణంగా పన్నులు ఎగవేయాలని చిన్న,మధ్యతరగతి వ్యాపారులెవరూ అనుకోరు. పన్నుల ఎగవేత, బ్యాంకు రుణాల ఎగవేత అంతా వాణిజ్య, కంపెనీల దిగ్గజాల స్థాయిలోనే జరుగుతోంది. వీరికి కేంద్రంలో ఉన్నత పదవులలో ఉన్నవారు ఇస్తున్న ఊతం కారణంగానే ఇది సాధ్యమవుతోంది. చిన్న వ్యాపారులు తక్కువ లాభానికి సరకులు, వస్తువులు అమ్ముకుని ప్రజల విశ్వసనీయత పొందేందుకు ప్రయత్నిస్తారు. ప్రజల విశ్వసనీయతే పెట్టుబడిగా వ్యాపారాలు చేస్తారు. నిజానికి ఈ రంగానికి చెందిన వారు చెల్లించే పన్నుల రాబడే ప్రభుత్వానికి నికరంగా చేరుతోంది. అటువంటి కీలకమైన చిన్న వ్యాపారుల అభ్యర్థనలను పట్టించుకోకపోతే నష్టపోయేది ప్రభుత్వమే. జిఎస్‌టి పన్ను విషయంలో తెలంగాణా ముందంజలో ఉండటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం. పన్ను చెల్లించేవారిని దొంగలుగా చూడరాదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పలు సందర్భాల్లో పన్ను వసూలు అధికారులను హెచ్చరించారు. అయితే, ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటును చులకనగా తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే నష్టపోయేది వాణిజ్యవర్గాలే. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి 15వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన ప్రెజెంటేషన్‌ ఆ ‌సంఘం సభ్యులకు నచ్చింది. అన్ని స్థాయిలలో పన్ను వసూళ్ళ యంత్రాంగాలు చెల్లింపుదారుల పట్ల గౌరవంగా, సముచితమైన రీతిలో వ్యవహరించాలి. అప్పుడే పన్నుల వసూలు యంత్రాంగంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. జిఎస్‌టి పన్నుల రాబడి మెరుగుగా ఉన్నా, బ్యాంకుల ఎగవేతలు ఏ మాత్రం తగ్గడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరం తొమ్మిది మాసాల్లో లక్షా పదిహేడు వేల కోట్ల రూపాయిల ఎగవేత జరిగినట్టు గుర్తించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత బ్యాంకు రుణాల ఎగవేతలు ఎక్కువగా పెరిగాయి. నీరవ్‌ ‌మోడీ, మెహుల్‌ ‌చౌక్సీ వంటి బడా ఎగవేతదారుల గురించి వివరాలు బయటకు వెల్లడైన తర్వాత ఎగవేతలనిరోధానికి గట్టి చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని ప్రకటించారు. కానీ,ఆయన మాటను కింది అధికారులు పాటించడం లేదని ఈ ఎగవేతలు రుజువు చేస్తున్నాయి. జీఎస్‌టీ అయినా, బ్యాంకుల ద్వారా రాబడి అయినా సజావుగా సాగినప్పుడే ప్రభుత్వం తాను ప్రతిపాదించిన సంక్షేమ కార్యక్రమాలను అమలు జేయగలదు. కాగా, తెలంగాణలో జిఎస్‌టి రాబడి ఎక్కువ ఉందని ఆర్థిక సంఘం ప్రశంసించగా, రాష్ట్రానికి ఆరేళ్ళలో లక్షన్నర కోట్లు ఇచ్చామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించడం తెలంగాణకు ప్రశంసో, విమర్శో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర పన్నులలో తమ వాటా పెరగాలన్న రాష్ట్రాల డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరం.•ష్ట్రానికి గర్వకారణం

Leave a Reply