Take a fresh look at your lifestyle.

నవంబర్‌లో 1,31,526 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ అమల్లోకి వొచ్చిన తరువాత రెండో అత్యధికం
హైదరాబాద్‌, ‌పిఐబి, డిసెంబర్‌ 1 : ‌దేశంలో 2021 నవంబర్‌ ‌నెలలో 1,31,526 కోట్ల రూపాయల విలువ చేసే జీఎస్టీ వసూలు అయ్యింది. దీనిలో సి జీఎస్టీ 23,978 కోట్ల రూపాయలుగా, ఎస్‌ ‌జీఎస్టీ 31,127 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ 66, 815 కోట్ల రూపాయలు(దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన 32,165 కోట్ల రూపాయలను కలుపుకుని), సెస్‌గా 9,606 కోట్ల రూపాయలు (వస్తువుల దిగుమతిపై సేకరించిన 653 కోట్ల రూపాయలతో సహా) ఉన్నాయి. ఐజీఎస్టీ ఆదాయంలో సిజీఎస్టీకి 27,273 కోట్ల రూపాయలను, ఎస్‌ ‌జీఎస్టీకి 22,655 కోట్ల రూపాయలను ప్రభుత్వం సర్దుబాటు చేసింది.

సాధారణ సర్దుబాట్లు పూర్తయిన తరువాత 2021 నవంబర్‌ ‌నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లభించిన ఆదాయం 51,251 కోట్ల రూపాయలు(సిజీఎస్టీ), 53,782 కోట్ల రూపాయలు(ఎస్‌జీఎస్టీ)గా ఉంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ పరిహారంగా కేంద్రం 03.11.2021న 17,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇక దేశంలో వరుసగా రెండో నెలలో జీఎస్టీ వసూళ్లు 1.30 లక్షలకు మించి జరిగాయి. గత ఏడాది నవంబర్‌తో పోల్చి చూస్తే 2021 నవంబర్‌ ‌నెలలో జీఎస్టీ వసూళ్లు 25%, 2019-20 నవంబర్‌తో పోల్చి చూస్తే 27% మేరకు పెరిగాయి.

ఈ నెలలో దేశంలో జరిగిన లావాదేవీలు (సేవల దిగుమతితో కలుపుకుని)కంటే దిగుమతి చేసుకున్న వస్తువులపై 43% ఎక్కువ ఆదాయం వొచ్చింది. గత ఏడాది నవంబర్‌ ‌తో పోల్చి చూస్తే ఈ వృద్ధి 20% వరకు ఉంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత 2021 నవంబర్‌ ‌నెలలో రెండోసారి అత్యధిక వసూళ్లు నమోదు అయ్యాయి. 2021 ఏప్రిల్‌ ‌లో అత్యధిక జీఎస్టీ వసూళ్లు జరిగాయి.

Leave a Reply