Take a fresh look at your lifestyle.

పెరుగుతున్న కేసుల…తగ్గుతున్న పరీక్షలు

కొరోనా ను ఎంత నియంత్రించాలని ప్రయత్నిస్తుంటే అంత వేగంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ ‌కేసుల జాబితా పెరుగుతూపోతునే ఉంది. ఈ వైరస్‌ను నివారించడం ప్రభుత్వానికి తలకుమించిన బారంగా తయారైంది. ప్రభుత్వం బాహాటంగా చెప్పకపోయినా ఒక విధంగా చేతులెత్తేసినట్లే కనిపిస్తున్నది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొరోనాతో సహజీవనం చేయాల్సిందేనని చెప్పడం వెనుక వైరస్‌ను కంట్రోల్‌ ‌చేయలేకపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య పదకొండు వేలుదాటింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ప్రసారమాధ్యమాల ద్వారా ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు ఎంత మొత్తుకుంటున్నా జనసంచారం నియంత్రణ లోకి రావడం లేదు .. ఒక్క రోజులోనే 920 కేసులు పాజిటివ్‌ ‌రావడం ప్రభుత్వాన్ని, ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం మూడువేల ఆరువందల పదహారు మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 920 మందికి వ్యాధి లక్షణాలున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే మొదటినుండి పెరుగుతున్న జాబితాలో ఎక్కువగా రాష్ట్ర రాజధానిలోనే కావడం మరింత ఆందోళన కలిగించే అంశం. తాజాగా వెలుగులోకి వోచ్చిన ఈ కేసుల్లో జిహెచ్‌ఎం‌సి పరిదిలోవే 737గా గుర్తించారు. కాగా రాజధాని వెలుపల వివిధ జిల్లాల్లో ఈ వైరస్‌ ‌పొంచి ఉన్నట్లు తెలుస్తున్నది. వరంగల్‌ ‌రూరల్‌, ‌కరీంనగర్‌, ‌కామారెడ్డి, ములుగు, సిద్దిపేట, రాజన్నసిరిసిల్లా, వరంగల్‌ అర్బన్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌వికారాబాద్‌, ‌జనగామ, నల్లగొండ, మెదక్‌, ‌మహబూబాబాద్‌, ఆసిఫాబాద్‌ ‌జిల్లా)న్నిటిలో కలిపి దాదాపు 183 మంది వైరస్‌ ‌బారిన పడినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి.

దీంతో రాష్ట్ర రాజధానిలో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సడలించినా స్వీయ నిర్బందాన్ని కోరుకుంటున్నారు. వ్యాపారస్తులు తమ లావాదేవీల సమయాన్ని ఇప్పటికే కుదించుకున్నారు. పాతబస్తీలో అత్యంత రద్దీగా ఉండే బేగంబజార్‌లో షాపుల యాజమాన్యం స్వీయ లాక్‌డౌన్‌ ‌పాటిస్తున్నారు. బేగంబజార్‌ ‌బంద్‌ అయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది వ్యాపారస్తుల కొనుగోళ్ళు నిలిచిపోయినట్లే. పెద్ద వ్యాపార కూడలి అయిన ఇక్కడికి నిత్యం వేలసంఖ్యలో జనం వచ్చిపోతుండడంతో ఎవరికి కొరోనా లక్షణాలున్నాయన్నది గుర్తించడం కష్టంగా మారడంతో ఈనెల 28 నుంచి జూలై అయిదవ తేదీ వరకు జంటనగరాల్లోని దాదాపు అన్ని దుకాణాలను మూసివేయాలని వ్యాపరస్తులంతా నిర్ణయించారు. వివిధ దుకాణాల్లో పనిచేస్తున్న హమాలీలకు, వివిధ ప్రాంతాలనుండి సరుకులను తీసుకువస్తున్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఎవరినుండి ఎవరికి సోకుతుందో అర్థంకాకుండా పోతోంది. పైగా లాక్‌డౌన్‌ ‌వెసులుబాటు వల్ల రోడ్డు సైడు వ్యాపారులు, చాయి దుకాణాల ముందు ప్రజలు గుమికూడటం, ఒకరు టీ తాగిన గ్లాసునే నీళ్ళతో కడిగి మరొకరికి ఇవ్వడంలాంటి చర్యలవల్ల కూడా ఈ వైరస్‌ ‌ప్రబలే ప్రమాదం లేకపోలేదు. కాగా, చాలామంది కనీసం జాగ్రత్తలను తీసుకోవడం మానేశారు.

క్లినిక్‌లల్లో, మెడికల్‌ ‌షాపులు, కిరాణషాపులల్లో చాలాచోట్ల మాస్క్‌లను పెట్టుకోవడంలేదు. కనీస దూరాన్ని కూడా పాటించక పోవడంవల్ల రోజురోజుకు పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో రాష్ట్రంలో కొరోనా అదుపు తప్పినట్లుగా కనిపిస్తున్నది. పదిరోజుల్లో యాభై వేల పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని, ఈ నెల పదహారు నుండి ప్రారంభించింది. కాని, ఆ మేరకు పరీక్షలను నిర్వహించలేకపోతున్నది. అందుకు కారణం సిబ్బందిలోటు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. దీంతో రిపోర్టు రావడంకూడా ఆలస్యమవడంతో టెస్టులు చేయించుకున్నవారు ఏమని రిపోర్టు వస్తుందోనన్న ఆందోళనకు గురవుతున్నారు. నమూనాలు సేకరించిన నలభై ఎనిమిది గంటల్లోపు వాటిని పరీక్షించాల్సి ఉంటుంది. అంతకు మించి జాప్యం జరిగితే రిపోర్టు తప్పుగా వచ్చే అవకాశముందంటున్నారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో ఇప్పటివరకు తీసుకున్న 30వేల 300 సాంపిల్స్‌లో సంగం వాటికే రిపోర్టు ఇవ్వగలిగారు. మరిన్ని సాంపిల్స్ ‌తీసుకుంటే ముందుగా తీసుకున్న వాటిని చూడడం ఇబ్బందిగా మారుతుందని, తాత్కాలికంగా సాంపిల్స్ ‌సేకరణకు విరామమిచ్చారు. తమ వద్ద ఉన్న సాంపిల్స్‌ను టెస్ట్ ‌చేసేందుకు కనీసం రెండు రోజుల సమయమైనా పడుతుందంటున్నారు వైద్యులు. కాగా, కొరోనా అదుపు తప్పుతున్న రాష్ట్రంలో తాజాగా కేంద్ర ప్రత్యేక బృందం శుక్రవారం నుండి ఈ నెల 29వరకు పర్యటించి తగిన సూచనలు, సలహాలను ఇవ్వనుంది.

Leave a Reply