మరో రెండు పరీక్షలు కూడా రద్దుచేసే అవకాశం..!
తిరిగి జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ
వాయిదా పడనున్న గ్రూప్ 1 మెయిన్స్…అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం
పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం….దర్యాప్తులో రాజకీయ నాయకుల ఫోటోలు లభ్యం
ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షతో పాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది జూన్ 11న నిర్వహించాలని నిర్ణయించింది. మిగతా పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పేపర్ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక ఆధారంగానే ఈ పరీక్షలను సైతం రద్దు చేయాలని నిర్ణయించినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గతేడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. ఇవికాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు సమాచారం. మరోవైపు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఏఈ ప్రశ్నపత్రం మాత్రమే లీకైందని గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ, ప్రవీణ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్‌లో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్టు సిట్ అధికారులు అనుమానించారు. దీంతో ప్రవీణ్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. వాటిని విశ్లేషించిన ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో మరి కొన్ని ప్రశ్నా పత్రాలు గుర్తించినట్టు తెలుస్తుంది.అయితే, ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నందున దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారులు కానీ, సిట్ అధికారులు కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తాజాగా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. దీంతో నెలల తరబడి కష్టపడి రాసిన పరీక్ష రద్దు కావడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత మొత్తం 503 గ్రూప్ -1 పోస్టుల భర్తీకి విడుదల చేసిన తొలి నోటిఫికేషన్ ఇదే కావడం గమనార్హం. మొత్తం 19 విభాగాలకు చెందిన 503 పోస్టులకు గతేడాది అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3.42లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 2.86లక్షల మంది రాశారు. ఆ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలను సైతం టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. ఈ ఏడాది జూన్ 5 నుంచి 12వరకు మెయిన్స్ నిర్వహించనున్నట్టు గతంలో ప్రకటించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన వారిలో 25,050 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇక టీఎస్పీఎస్సీ నుంచి వెల్లడైన డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏఓ) ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు పక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 53 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా.. 1,06,263 దరఖాస్తులు వచ్చాయి. దీనికి ఫిబ్రవరి 26న రాత పరీక్ష నిర్వహించారు. దీనిలో 60వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఇంత వరకు పేపర్ కీని కూడా ప్రకటించకుండానే.. పేపర్ లీకైనట్లు అధికారులు తేల్చారు. దీంతో ఈ పరీక్షను కూడా టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు పక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం ఈ పోస్టులకు 33,342మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని మార్చి 12, 2023గా నిర్ణయించారు. కానీ పరీక్ష పేపర్ లేకేజీ నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేశారు. కొత్త పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించలేదు.