Take a fresh look at your lifestyle.

అమ్మతనానికి వందనం

సృష్టిలో జన్మనివ్వడం అమ్మలకే
తెలిసిన అపురూప వరం !
ఒక ప్రపంచాన్ని తొమ్మిది నెలలు మోసే హెర్కులిస్‌ ‌బలశాలులు
ఒక యుద్ధాన్ని భరిస్తూ బ్రతికే
ధీశాలులు తల్లులు మాత్రమే !

కడుపులో అండం పిండకణమై
మాతృగర్భ గుడి ఉమ్మ నీటిలో
అంచెలంచెలుగా ఎదుగుతూ
మత్స్యమై, కూర్మసరీసృపమై,
విహంగమై, వానరమై మనిషి
రూపాన్ని పొందుతూ మానవ పరిణామ దశలను ప్రదర్శిస్తూ
పిండాభి వృద్ధి క్రమాన్ని సజీవ  చిత్రాలుగా నిక్షిప్తంచేస్తున్నది
అద్భుత మాతృ గర్భమే కదా !

అమ్మంటే అనిర్వచనీయ ప్రేమ
త్యాగానికి, కరుణకు మరో రూపం
అమ్మలేకుంటే సృష్టి లేదు
అమ్మంటే విశాల ప్రకృతి
యోధుడిని కడుపులో దాచే
అడవిలంటిది అమ్మ !

పేద పూరి గుడిసెలో
నాటు మంత్రసాని చేతిలో
నులకమంచం పై ప్రసవ
వేదనపడే బక్క తల్లైనా
కార్పొరేట్‌ ఆసుపత్రి పరుపు పడకమీద నొప్పులు భరించలేని
నాజూకు మమ్మీ కైనా
పురిటి నొప్పులు సహజమే కదా !

అందుకే అమ్మలెవరైనా
బిడ్డలకు అమృతమూర్తులే
మానవ జన్మ ప్రధాతలే
బాధల పల్లవులను లోలోపల
దిగమింగి నవ్వుతూ
మనలను లోకంలోకి
పరిచయం చేసే తల్లుల ఋణం
మరవక జీవితాంతం తీర్చుకోవాలి
అమ్మతనానికి, అమ్మలకు
అందరం శిరస్సు వంచి మొక్కాలి !
( అమ్మతనాన్ని పరవశంతో అనుభవిస్తున్న మాతృమూర్తులకు
ప్రేమతో… )
– డా. కె. దివాకరా చారి
9391018972

Leave a Reply