Take a fresh look at your lifestyle.

కొరోనా లేని జిల్లాలను గ్రీన్‌జోన్‌లో చేర్చాలి

  • కొత్తగా 10 కేసులు నమోదు
  • రాష్ట్రంలో మూడే రెడ్‌ ‌జోన్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

‌కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలంగాణలోని కొరోనా ప్రభావం లేని 14 జిల్లాలను గ్రీన్‌జోన్‌లో చేర్చాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలోనే రెడ్‌ ‌జోన్లలో ఉన్న సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, ‌నిజామాబాద్‌ ‌జిల్లాలను ఆరెంజ్‌ ‌జోన్‌లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామనీ, ఈమేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముందని చెప్పారు. ఈమేరకు మంత్రి కోఠిలోని కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కొరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయన్నారు. గత వారం రోజులుగా కేసుల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. శుక్రవారం రాష్ట్రంలో కొత్తగా 10 కేసులు మాత్రమే నమోదయ్యాయనీ, వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1132కు చేరుకుందనీ, శుక్రవారం ఒక్క రోజే కొరోనా వైరస్‌ ‌కారణంగా వైద్య చికిత్సలు పొందిన వారు 34 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 376 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. శుక్రవారం డిశ్చార్జి అయిన వారిలో 75 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నాడనీ, చెప్పారు.రాష్ట్రంలో కొరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు సరిగా చేయడం లేదని విమర్శలు చేయడం సరికాదనీ, ఐసీఎంర్‌ ‌నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు చాలా గొప్పగా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఈనెల 29 వరకూ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. జీహెచ్‌ఎం‌సి పరిధిలో ప్రజలెవరూ బయటికి వెళ్లకుండా, బయటి ప్రజలు నగరానికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని కొరోనా ప్రభావం లేని జిల్లాలను గ్రీన్‌జోన్లుగా మారిస్తే హైదరాబాద్‌,‌రంగారెడ్డి, మేడ్చల్‌ ‌జిల్లాలు మాత్రమే రెడ్‌జోన్లుగా ఉంటాయన్నారు. 14 జోన్లను కేంద్రం గ్రీన్‌జోన్లుగా ఆమోదిస్తే రాష్ట్రంలోని దాదాపు 80 శాతం గ్రామీణ ప్రాంతాలు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి ఈటల వెల్లడించారు.

Leave a Reply