నిపుణుల కమిటీ అనుమతి…ఆమోదం కోసం డిజిసిఐకి ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్
ఇండియాలో ఆక్స్ఫర్డ్ టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది. తద్వారా ఇండియాలో అనుమతి పొందిన తొలి కొరోనా వైరస్ వ్యాక్సిన్‌గా నిలిచింది. ఇండియాలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించిన కమిటీ.. ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కి పంపించింది. దీనిపై తుది నిర్ణయం డీజీసీఐ తీసుకోనుంది. దీంతో కొరోనా వైరస్ నివారణకు సంబంధించి కొత్త ఏడాదిలో ప్రజలకు శుభవార్త అందింది. తాజాగా సీరం అభివృద్ధి చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది.
వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్ నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతినిచ్చింది. త్వరలో పంపిణీకి డీసీజీఐ నుంచి అనుమతి వొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశంలో పంపిణీకిగాను దేశీయ అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరమ్ 30 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను సిద్ధం చేస్తుంది. భారత్‌లో 10 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను వినియోగించనున్నామని సీరం ఇప్పటికే ప్రకటించింది. మరో పక్క దేశంలో యూకేకు చెందిన కొత్త కొరోనా వేరియంట్ స్ట్రెయిన్ ఉనికి ఆందోళన రేపుతోంది. తాజాగా నాలుగు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కొత్త వైరస్ బాధితుల సంఖ్య 29కి చేరింది. అటు కొత్త వేరియంట్‌ను కూడా ఎదుర్కొనే సామర్థ్యం తమ టీకాకు ఉందని ఆస్ట్రొజెనెకా ప్రకటించింది.