“అయిదు పార్టీల భవిష్యత్తు తేల్చే వారం రోజుల ఉత్కంఠభరిత హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. మంగళవారం ఉదయం పోలింగ్ కు మిగిలిన 38 గంటల సమయాన్ని సద్వినియోగ పరచుకోవడంలో పార్టీల అధినేతలు, అభ్యర్ధులు వ్యూహ ప్రతివ్యూహలలో తలమునకలయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు నాలుగు ప్రధాన పార్టీల మనుగడకు అగ్నిపరీక్షలా, ఒక పార్టీ ఉనికి నిరూపణయజ్ఞంగా తయారయ్యాయి.”
రాష్ట్రంలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, దాని మిత్ర పక్షం ఎం.ఐ.ఎం. పార్టీలు తమ పునాదులను పకడ్బందీగా కాపాడుకునేందుకు అహరం శ్రమిస్తున్నాయి. 2023 ఎన్నికలలో తెలంగాణలో విజయ సాధనకు సోపానంగా, దక్షిణ సామ్రాజ్య విస్తరణకు దక్షిణ గోగ్రహణంగా బిజెపి సర్వ శక్తులూ ఒడ్దుతున్నది. చరిత్ర పుటల్లో మిగిలిన గతవైభవం మినహా వర్తమానం శూన్యమై, భవిష్యత్తు అంధకారంగా తయారై రాష్ట్రంలో ఉనికి నిరూపించుకునే ఏకైక అవకాశంగా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. గెలుపు ఆశలు లేకున్నా, భాగ్యనగరంలో తన స్థానమేమిటొ తెలుగు దేశం పర్టీ పరీక్షించుకుంటున్నది.
గ్రేటర్ ఎన్నికలను తెరాస, భాజపా, కాంగ్రెస్ ప్రధాన మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జాతీయ స్థాయిలో అన్నట్లు పోటాపోటీగా ఎన్నికల ప్రణాళికలు విడుదల చేసి ఇప్పటికే ఒకసారి వర్షాల వరదల్లో మునిగిపోయిన జంటనగరాల ఓటర్లను ఎన్నికల తాయిలాల ఉచితాల వాగ్దానలతో ముంచెత్తాయి. ఆ ఎన్నికల వాగ్దానాల అమలు కయ్యే వేల కోట్ల రూపాయలు, ఎలా సమీకరించుకుంటాయో మాటమాత్రమైనా ఎక్కడా ప్రస్తావన లేదు. తెలుగు దేశం, ఎం.ఐ.ఎం పార్టీలు ప్రత్యేక మేనిఫెస్టోలు, హామీల జోలికి పోకుండా క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలను ఉత్తేజపరచే కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి.
నోటిఫికేషన్ నాటికి ముందుగానే తె.రా.స అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సర్వం తన కనుసన్నలలో నడిపించుకుని వ్యూహాత్మకంగా ఎన్నికలకు సిద్ధంకాగా, ఆయన కుమారుడు తె.రా.స. వర్కింగ్ ప్రెసిడెంట్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె తారకరామారావు సర్వం తామే అయి పార్టీ, ప్రభుత్వ శ్రేణులకు నాయకత్వం వహించి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చారు. అభ్యర్ధుల ఎంపిక టిక్కెట్ల కేటాయింపు, ప్రచార వ్యూహం పూర్తి చేసి కదన రంగంలోకి దూకారు. ప్రగతి భవన్ దాటకుండానే ముఖ్య మంత్రి వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఎన్నికల మేనిఫెస్టొ విడుదల చేసారు. మేనిఫెస్టో వివరణ సమయంలో ఆరేళ్ళ రాష్ట్ర ప్రగతి వివరించి భవిష్యత్ లో తమ ప్రభుత్వం ఏమిచేస్తుందో సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
ప్రైవేట్ స్కూళ్ళతొఫాటు గ్రేటర్ ప్రజలకు 24 గంటలూ ఉచిత మంచినీరు, సెలూన్లకు, దోభీ ఘాట్లకు ఉచిత కరెంటు, కోవిడ్ కాలం లాక్ డౌన్ కాలానికి వాహనాల పన్ను మినహాయింపు, సినిమాహాళ్ళు సహా అన్ని వ్యాపార సంస్థలకు కరెంట్ బిల్లుల రద్దు, సినిమా హాళ్ళు టిక్కెట్ల ధరల పెంపునకు అనుమతి, వరద ముంపు బాధితులందరికీ 10 వేల నగదు, అర్హులందరికీ రేషన్, ఆరోగ్య శ్రీ కార్డులు, విమానాశ్రయం వరకు మెట్రో పొడిగింపు, ఎం ఎం టి ఎస్ రైళ్ళ విస్తరణ, మూసీ సుందరీకరణ, మంచినీటి ట్యాంకులు, చెరువులు, టి ఎస్, బి పాస్, బెడ్ రూం ఇళ్ళు, మహిళా రక్షణ, చేరువుల పరిరక్షణ, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, సిసి కెమేరాల ఏర్పాటు .. ఒకటా.. రెండా ఇలా మేనిఫెస్టో లొ తడిపి ముద్ద చేసారు.
చివరగా శనివారం లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ నిర్వహణలో భారీ బహిరంగ సభ జరిపి మేనిఫెస్టో పునశ్చరణ చేయడమే కాక్క బిజెపి పై రాజాకియ దండయాత్ర చేసారు. తానంతే బిజెపి భయపడుతున్నదని, తనను దిల్లీ రాకుండా నిరోధిస్తూ కుట్ర చేస్తున్నదని, తనను బిజెపి నేతలు దూషిస్తున్నారని, వరదసహాయానికి కేంద్రం పైసా రాల్చలేదని, బక్క సి ఎం ను చూసి భయపడి కేంద్ర నాయకులంతా దండెత్తుతున్నారని పేర్కోంటూ నగరంలో శాంతి భద్రల విఘాతం కలిగించేలా మత కల్లోలాలు సృష్ఠించే కుట్ర సాగుతున్నదని అనూహ్యంగా ఆరోపించారు. టి పాస్ కావాలో కర్ఫ్యూ పాస్ కావాలో తేల్చుకోవాలని ఆఖరి అస్త్రం ప్రయోగించారు. నగరంలో తెరాస గెలవక పోతే అభివృద్ధి ఆగిపోతుందన్నారు.
ఇక కార్యక్షేత్రంలో కె తారకరామారావు వారం రోజుల పాటు అన్ని కీలక ప్రాంతాలలో రోడ్ షో లు నిర్వహించి గత ఆరేళ్ళుగా తమ హయాంలో సాధించిన ప్రగతిని వల్లెవేస్తూ ఓటర్ల నాకర్షించడంలో మునిగిపోయారు. ఒక వైపు రోడ్ షోలు, మరో వ్చైపు వివిధ సామాజిక, వ్యాపార, వాణిజ్య, సంపన్న వర్గాలతో సమావేశాలు నిర్వహించి హామీలు కుప్పించారు. కాంగ్రెస్ కంటే బిజెపి పైనే విమర్శలు కేంద్రీకరించారు. తండ్రి మార్గంలోనే వరాలతోబాటు, భవిష్యత్ లో శాంతిభద్రతల పై అనుమానాలు వెల్లడించారు. మంత్రాంగం, యంత్రాంగం అంతా తానై నడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎన్నికల విధులు కేటాయించారు. పార్టీ కార్యాలయంలో సమావేశాలూ సాగించారు అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్ధి బిజెపి తక్కువ తినలేదు. ఈ ఎన్నికలను విశ్వరూప ప్రదర్శనకు ఉపయోగించుకుంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకుని పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపింది. ప్రజా మద్దతు తమకేనని, తెరాస చరిత్ర ముగింపు దశ అని వాగ్ధాటి కురిపించింది. పార్లమెంటు ఎన్నికల స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి జాతీయ నేతలను ప్రచారంలోకి దించి జనం మధ్యకు తీసుకు వచ్చి శక్తియుక్తులేమిటొ ప్రకటించింది. దుబ్బాక గ్గెలుపుతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ గ్రేటర్ బాధ్యతలు భుజాలపై వేసుకుని తెరాస నాయకత్వానికి, ఎక్కడికక్కడ సవాలుగా తయారయ్యారు.
ఎన్నడూ లేనట్లు కేంద్రం నుంచీ అమిత్ షా, జెపి నడ్డా, స్మృతి ఇరాని, యుపి ముఖ్యమంత్రి యోగి, భూపేంద్ర యాదవ్, ఫడ్నవీస్, తేజశ్వి సూర్య వంటి వారిని నగరానికి తెప్పించి సంచలనం సృష్టించారు. ఆయనకు తోడుగా నగరంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డి అర్వింద్, వివెక్, లక్ష్మణ్, ఇంద్రసెన్ రెడ్డి, రాజా సింగ్ బిజెపి సైన్యాన్ని అనుక్షణం వెంట ఉండి నడిపి రాష్ట్ర ప్రభుత్వం, తెరాస వైఫల్యాలను ఎండగట్టారు. పాతనగరం పై బిజెపి దృష్టి సారించి అగ్ర నాయకుల ను పాతనగానికి తీసుకెళ్ళి పలు చోట్ల రోడ్ షో లు నిర్వహించింది. ఎం ఐ ఎం- తె రా స ల జంట శక్తుల వల్లనే రోహింగ్యాలు పాతనగరంలో స్థిరపడ్డారని, పాకిస్తాన్ శక్తులు మాదిరి తయారయ్యాయని అగ్గి రగిలిచింది బిజెపి.
ఎన్నికల మేనిఫెస్టో అంటూ తెరాసాను మించి వాగ్దానాలు కుప్పించింది. పాత నగరం అభివృద్ధి నోచుకోలేదని, వరద సహాయంలో భారీ అవినీతి జరిగిందని, పాత నగరంలో మెట్రో ను ఎందుకు విస్తరించలేదని నిలదీసింది. మంచినీటితో పాటు కరోనా టీకా ఫ్రీ అని హామీ ఇచ్చింది. ఎల్ ఆర్ ఎస్ రద్దు, ఇంటింటికీ నల్లా, మెట్రో సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మెట్రో పాతనగర్మలో విస్తరణ సహా విమానాశ్రయం వరకు పొడిగింపు, కుల వృత్తులకు కరెంటు, నీళ్ళు ఉచితం, టు వీలర్, ఆటోలపై చలానుల రద్దు, గవర్నమెంట్ స్కూల్ విద్యర్ధులకు ఉచితంగా వాఇఫై, టాబ్లు, వరద నష్టానికి 25 వేల నగదు.. ఒకటా రెండా.. జనం కళ్ళుతిరిగేలా… ఎన్ని హామీలో. ఇంత ఖర్చుకు వనరు ఏమిటో మాటమాత్రం ప్రస్తావన లేదు. ఫడ్నవీస్ తో మేనిఫెస్టొ విడుదల చేయించింది బిజెపి.
ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. పేరుకు జాతీయ పార్టీ అయినా గ్రేటర్ ఎన్నికల రంగంలో నలుగురే కనిపిస్తారు. హడావిడి ఉన్నా చివరి నిమిషంలో ఓటర్లు తీసుకునే నిర్ణయంపై ఫలితాలు ఆధారపడతాయని విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డి సర్వం తామై జన్మిలీ గాను, విడి విడిగానూ కీలక పాత్ర పోషిస్తున్నారు. షబ్బిర్ అలి, మల్లు భట్టి, పొన్నాల.. గీతారెడ్డి, మాణిక్కం ఠాకూర్, వి హనుమంత రావు.. గెస్ట్ ఆర్టిస్టుల్లా అప్పుడప్పుడూ దర్శనమిస్తూ, గాంధి భవన్ సమావేశాలకు మాత్రం పరిమితం. మాజీ ఎంపిలు కాని, మాజీ మంత్రులు కానీ కలికం వేసినా కనబడడంలేదు. పేరుకు ఎక్కువ డివిజన్లలో పోటీ చేస్తున్నా ప్రచారంలో సంరంభం కూడా కనబడడం లేదు.
అయితే తామూ తీసిపోలేదన్నట్లుగా,, భారీగానే మేనిఫెస్టొ విడుదల చేసారు కాంగ్రెస్ నేతలు. వరద ముంపు బాధితులకు 50 వేలు, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, దెబ్బతిన్న ఇళ్ళకు 5 లక్షల సాయం, ఫ్రీ మంచినీళ్ళు, అరోగ్యశ్రీ పరిధిలోకి కరోన, పాత బస్తీలో మెట్రో విస్తరణ, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు మెట్రో, సిటీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం, 100 లోపు యూనిట్ల కరెంట్ ఫ్రీ, లాక్ డౌన్ కాలానికి అన్ని విద్యుత్ బిల్లుల రద్దు, సఫాయి కుటుంబాలకు 25 లక్షల బీమా, ఏడాదిలోగా మూస్సి ప్రక్షాలన, రాత్రి 10 గంటలకు మద్యం దుకాణాలు మూసివేత… చెరువుల పరిరక్షన అథారిటీ, గాంధి, ఉస్మానియ, నీలోఫర్ లలో పరిస్థితుల మెరుగుదల, కార్పొరేట్ విద్యా సంస్తహల ఫీజుల పై నియంత్రణ, ఆస్తిపన్ను హేతుబద్ధీకరణ… ఇలా జల్లు కురిపించింది. ప్రచారంలో నిజెపి, టి ఆర్ ఎస్ ల ను లక్ష్యం చేస్తూ విమర్శలు, ఆరోపణల అస్త్రాలు సంధించింది. ఎం ఐ ఎం గురించి కొంత మెతక ధోరణిలో సాగింది. తెదెపా ప్రస్తావనే లేదు.
తెరాసకు మిత్ర పక్షం, భాజపాకి ప్రధాన శతృ పక్షమైన ఎం ఐ ఎం దృష్టినంతా బిజెపికి వ్యతిరేకంగా కేంద్రీకరించి ప్రచారం విస్తృతం చేసింది. ముఖ్యంగా పోటీలో ఉన్న పాతనగరంపైనే ప్రచారం హోరెత్తిస్తున్నది. ఒవైసీ సోదరులే సర్వం తామై ఎన్నికలకు నాయకత్వం వహిస్తున్నారు. మేనిఫెస్టోల జోలికి పోకుండా కాంగ్రెస్ కు, తెదెపాకు ప్రాధాన్యత ఇవ్వకుండా పరోక్షంగా టి ఆర్ ఎస్ కు సహరించే విధంగా తన శైలిలో సాగిపోతున్నది. ఎన్ టి ఆర్, పి వి సమాధులను సైతం కూల్చేస్తామని అక్బరుద్దిన్ ఒవైసీ హెచ్చరించగా అందుకు ప్రతి సవాలుగా బండి సంజయ్ దారూసలాం ను ప్రస్తావించడంతో డంతో వాతావరణం వేడెక్కింది. ఎం ఐ ఎం ఎమ్మెల్యేలు తమ పరిధులు దాటడం లేదు. తమ సంఖ్య యధావిధిగా నిలబెట్టుకునే సంకల్పంతో చాపకింద నీరులా పనిచేస్తున్నారు.
ఒక నాడు ప్రజలు నేరుగా ఎన్నుకుని స్వర్ణయుగంగా విరాజిల్లిన తెలుగు దేశం ఎన్నికలలో పోటీ లో ఉన్నా. హంగు, ఆర్భాటం, హడావిడి లేకుండా నెమ్మదిగా అడుగులేస్తూ సాగుతున్నది. రాహ్ట్రస్థాయిలో టెదెపాకు పటిష్ఠమైన నాయకత్వం లేకున్నా, ఆర్ధిక వనరులకు ఆస్కారం లేకున్నా. తమ ప్రాంతాల జనం, సామాజిక వర్గాలు, తమకున్న బలం, ప్రజాభిమానం చెక్కుచెదరని పార్టీ కార్యకర్తల పట్టుదలతో పనిచేస్తున్నారు. ఊరేగింపులు, సభలు, సమావేశాల జోలికి పోకుండా గుంభనంగా ఉంది. గెలిచి కార్పొరేషన్ ఏలుదామన్న దాహం లేకున్నా.. అవసరమైన తరుణంలో కీలక పాత్ర పోషించి పాలకులను దిగ్భ్రాతులను చేసే అవకాశంకోసం ఎదురుచూడడం తెదేపా ప్రస్తుత కర్తవ్యంగా భావిస్తున్నది.
నందిరాజు రాధాకృష్ణ