Take a fresh look at your lifestyle.

ఏ ‌క్షణమైనా గ్రేటర్‌ ఎన్నికలు

  • అందరూ సన్నద్దంగా ఉండాలి
  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్‌లతో సమావేశంలో మంత్రి కేటీఆర్‌
  • ‌కొందరు కార్పొరేటర్ల పనితీరుపై అసహనం

గ్రేటర్‌ ఎన్నికలకు సన్నద్దంగా ఉండాలని మంత్రి కెటిఆర్‌ ‌పార్టీ నేతలను ఆదేశించారు. నవంబర్‌లోగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎన్నికలు ఒకటి రెండు నెలలు ముందే రావచ్చని.. అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు.ఈ తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల పెద్దలు అభ్యర్థుల వేట సాగిస్తున్నారు. మంగళవారం జీహెచ్‌ఎం‌సీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్‌ ‌కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. జీహెచ్‌ఎం‌సీలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించిన ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని ఆయన చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో జీహెచ్‌ఎం‌సీలో వివిధ కార్యక్రమాలు చేపట్టామని.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి కార్పొరేటర్లు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిట్టింగ్‌ ‌కార్పొరేటర్ల పని తీరుపై కేటీఆర్‌ ‌తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని.. పని తీరు మార్చు కోవాలని ఆయన ఒకింత హెచ్చరించారు. సమస్యలుంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ అభివృద్ధి కి ఇప్పటికి 60వేల కోట్ల రూపాయలు వెచ్చించామన్న కేటీఆర్‌.. ‌కార్పోరేట్‌ ‌లకు ఇంకా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకొని తెలియజేయాలని సూచించారు. ప్రతి కార్పోరేటర్‌ 3 ‌వేల గ్రాడ్యుయేట్‌ ‌వోట్లు నమోదు చేయించాలని, అక్టోబర్‌1 ‌న ప్రజాప్రతినిధులు అందరూ వోటు నమోదు చేసుకోవాలని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో గత ఐదేండ్లుగా జరిగిన అభివృద్ధి గురించి ఒక ప్రగతి నివేదికను రూపొందించి విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. ప్రభుత్వం గత ఐదేండ్లుగా హైదరాబాద్‌ ‌నగరానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ ‌చెప్పారు. వేల కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగించడంతోపాటు వందల కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి పరచిందని తెలిపారు. అంతేగాక లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించిందన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో వివిధ కార్యక్రమాల కోసం ఐడేండ్లలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం 67 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని చెప్పారు.

గత ఐదేండ్లుగా హైదరాబాద్‌ ‌నగరంలో చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు, మౌలిక వసతులకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఒకచోట చేకూర్చి ప్రగతి నివేదిక విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఈ ప్రగతి నివేదిక తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఉండబోతుందని చెప్పారు. జీహెచ్‌ఎం‌సి పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కార్పొరేటర్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలను మంత్రి కేటీఆర్‌ ‌కోరారు. రిజిస్ట్రేషన్లు, ఆస్తులపై హక్కులకు సంబంధించిన అన్ని సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. స్థిరాస్తుల పైన యాజమాన్య హక్కులు కల్పించడానికి చేపట్టే పక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందన్నారు.  ఇక, హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న వోటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని మంత్రి కేటీఆర్‌ ‌మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. హైదరాబాద్‌ ‌నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వోటింగ్‌ ‌శాతాన్ని మరింత పెంచేందుకు, నగరంలో ఉన్న గ్రాడ్యుయేట్లను వోటర్లుగా నమోదు చేయించేందుకు సీరియస్‌గా పనిచేయాలని నగర ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఇందులో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహ్మూద్‌ అలీ, తలసాని, మేయర్‌ ‌బొంతు రామ్మోమన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply