- పోలింగ్ కోసం ఇసి పకడ్బందీగా ఏర్పాట్లు
- 150 డివిజన్లలో 9101 పోలింగ్ కేంద్రాలు
- ఉదయం7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్
- కోవిడ్ నిబంధనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. నేడు జరిగే పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆదివారం సాయంత్రమే ప్రచారం ముగిసింది. సోమవారం ఇంటింటి ప్రచారంలో నేతలు నిమగ్నమయ్యారు. బ్యాలెట్ పత్రాల ద్వారా పోలింగ్ జరుగనుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొరోనా నేపథ్యంలో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుంది. మొత్తం 150 డివిజన్లలో 9101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నిక బరిలో 1122 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ఇందులో అత్యధికంగా జంగంమెట్ డివిజన్లో 20 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉప్పల్, బార్కస్, జీడిమెట్ల, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలీచౌకి డివిజన్లలో అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కొరోనా మార్గదర్శకాలు పాటించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీచేసింది.
ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని ఎస్ఈసీ సూచించింది. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. కొరోనా బాధితులకు కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించేకునే అవకాశం కల్పించింది. దీంతో మొత్తం 2831 మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. కొరోనా బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కొటేసేందుకు అనుమతివ్వనున్నారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ, కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. ఆరు గంటలకు పోలింగ్ ఏజెంట్లు హాజరు కావాలని ఆయన కోరారు. ఉదయం 6 నుంచి 6.15వరకు మాక్ పోలింగ్ ఉంటుందన్నారు. ఉదయం 6.55కి బ్యాలెట్ బాక్స్‌లను సీజ్‌చేసి ఏడు గంటలకు పోలింగ్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ పూర్తవుతుంది. కోవిడ్-19 పాజిటివ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేనివారికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా వోటువేసే అవకాశం కల్పించనున్నారు. ఆరు గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నవారికి వోటువేసే అవకాశం కల్పిస్తారు. వోటరు గుర్తింపు కార్డు లేని వోటర్లకు ఎంపికచేసిన 21 ఇతర గుర్తింపు కార్డులు ఉన్నా వోటింగ్‌కు అవకాశం ఉంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయి. అలాగే, ప్రతి పోలింగ్ స్టేషన్లో అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పట్టణ ప్రాంతాల్లో సాధారణంగా వోటింగ్ శాతం తక్కువగా ఉంటోంది. అందులోనూ గ్రేటర్ ఎన్నికల్లో పట్టణవాసులు పోలింగ్ కేంద్రాలకు రావడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు.
వోటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. వోటరు స్లిప్పులను సులభంగా పొందడమే కాకుండా పోలింగ్ కేంద్రం రూట్ మ్యాప్ కూడా తెలుసు కునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. వోటు హక్కు వినియోగం ఆవశ్యకతపై కూడా పలు కార్యక్రమాలను నిర్వహించింది. గత గ్రేటర్ ఎన్నికల్లో 45 శాతం మాత్రమే వోటింగ్ నమోదు కావడంతో ఈసారి దాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించారు. వోటింగ్‌ను పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టింది. నేడు జరిగే గ్రేటర్ పోలింగ్‌లో మొత్తం 74,44,260 మంది వోటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళా వోటర్లు ఉన్నారు. మరో 676 మంది ఇతర వోటర్లు ఉన్నారు. ఇందులో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లో అత్యధికంగా 79,290 మంది వోటర్లు, రామచంద్రాపురం డివిజన్లో అత్యల్పంగా 27,998 మంది వోటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం 48 వేల మంది సిబ్బందిని వినయోగించనున్నారు. 14 మంది సాధారణ పరిశీలకులు, 38 మంది వ్యయపరిశీలకులు, 60 ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 30 సర్వెలెన్స్ బృందాలు, మొత్తం 30 డీఆర్సీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.