Take a fresh look at your lifestyle.

వేములవాడలో వైభవంగా మహా శివరాత్రి

  • దర్శించుకున్న 3 లక్షలకు పైగా భక్తులు
  • పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భక్తులతో శనివారం  కిక్కిరిసిపోయింది. మూడు లక్షలకు పైగా భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వేములవాడకు విచ్చేయడంతో అన్ని రోడ్లు, ఖాళీ స్థలాలు, వీధులు నిండిపోయాయి. వేలాది భక్తులు శుక్రవారం అర్ధరాత్రి నుండి శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి, కోడె మొక్కులు చెల్లించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి కనీసం 8 గంటల  పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వొచ్చింది. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీస్వామివారికి పట్టువస్త్రాలను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌చెన్నమనేని రమేశ్‌, ‌రాజన్న సిరిసిల్ల జడ్పీచైర్‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ, వేములవాడ మున్సిపాలిటి చైర్‌పర్సన్‌ ‌రామతీర్థఫు మాధవిలు  శనివారం ఉదయం సమర్పించారు.

పట్టువస్త్రాలను సమర్పించే క్రమంలో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోగా పోలీసులు గట్టి బందోబస్తును బందోబస్తును నిర్వహించారు. అంతకు ముందు టిటిడి తరపున డిప్యూటి ఈఓ హరీంద్రనాథ్‌  అధ్వర్యంలో అర్చకులు, అధికారుల బృందం రాజన్న గుడికి చేరుకుని పట్టువస్త్రాలను సమర్పించారు. పర్వదినం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ ‌జయంతి, ఎస్పీ అఖిల్‌ ‌మహాజన్‌, అడిషనల్‌ ఎస్పీ చంద్రయ్య, అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌ఖీమ్యానాయక్‌, ‌డిఆర్డీఓ శ్రీనివాస రావు, డిఎస్పీ నాగేంద్రచారి, రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, దేవస్థానం మాజీ చైర్మన్‌, ‌రాజన్న సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు  ఆది శ్రీనివాస్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లా జడ్జీలు, జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు శ్రీస్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆరుగంటలకు శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో స్ధానాచార్య అప్పాల భీమాశంకర్‌ ‌శర్మ, ప్రధానార్చకులు సురేశ్‌, ఉమేశ్‌, ‌శరత్‌, ‌నమిలికొండ రాజేశ్వరశర్మ తదితర వేదపండిల అధ్వర్యంలో మహాలింగార్చనను, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శ్రీస్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.

ఇదే సమయంలో వేలాది భక్తులు ఆలయ ఆవరణలో, తాము బస చేసిన స్థలాల్లో జాగరణలు చేయగా, భాషా సాంస్క్కతిక శాఖ అధ్వర్యంలో శనివారం రాత్రి నుండి ఆదివారం వేకువ జాము వరకు శివార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా  ఉత్సవ కమిటి సభ్యులు,పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు వందలాది మండి విఐపి దర్శనాల పేరిట ఆలయంలోకి ప్రవేశించడంతో సాధారణ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, దేవస్థానం అధికారులు, పోలీస్‌ అధికారులకు వ్యతిరేకంగా నినదించారు. సాధారణ భక్తులు అనేక పర్యాయాలు పోలీస్‌ ‌సిబ్బందితో వాగ్వాదాలకు దిగారు. చివరకు పోలీస్‌ ‌సిబ్బంది అతిగా వ్యవహరిస్తున్నారని దేవస్థానం సిబ్బంది సైతం జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు విన్నవించిన సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి.

రాజన్న గుడి అభివృద్ధికి రూ 50 కోట్లు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ 50 కోట్లు కేటాయించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి వెల్లడించారు.శ్రీస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ వేములవాడలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టే పడేట్లుగా మరిన్ని అభివృద్ధి పనులను చేపడతామని అన్నారు.సిఎం కెసిఆర్‌ ‌మార్గ దర్శనంతో కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలను వేములవాడ ధర్మగుండం,గుడి చెరువుకు తరలిస్తున్నామని చెప్పారు.మహాశివరాత్రి సందర్భంగా భారీ నిధులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply