Take a fresh look at your lifestyle.

బెంగాల్ ఎన్నికలకు ముందే మహాసంగ్రామం..

పశ్చిమ బెంగాల్ లో వొచ్చే మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ముందే మహాసంగ్రామం జరగనుంది. శనివారం నాడు రాష్ట్రంలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తలపెట్టిన మోటారు బైక్ ర్యాలీకి పోటీగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జెపీ నడ్డా రథయాత్ర ప్రారంభించనున్నారు. ఈ రథయాత్ర కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాలనుంచి బీజేపీ కార్యకర్తలను తరలించారు. ఇప్పటికే తృణమూల్ ఎమ్మెల్యేలు,.ఎంపీలను,మంత్రులను టోకుగా కొనుగోలు చేసిన బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మరింత బలహినపర్చే కార్యక్రమాన్ని అమలు జేసేందుకు వడివడిగా పావులు కదుపుతోంది.

రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పరమావధిగా కమలనాథులు తమ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తున్నారు. మమతా బెనర్జీ దీనిపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్య యావత్ భారత దేశ ప్రజలు పరిశీలించదగింది. భారత్ ను భ్రష్టుపట్టించిన పార్టీ బెంగాల్ ని బంగారు మయం చేస్తానంటూ ముందుకు వస్తోందంటూ ఆమె చేసిన వ్యాఖ్యకు తృణమూల్ కార్యకర్తలే కాకుండా, ఇతర లౌకిక వాద పార్టీలు హర్షాన్ని వ్యక్తం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏకైక నాయకురాలు మమత అంటే అతిశయోక్తి లేదు.

రైతులకు మద్దతుగా ఇప్పటికీ గళం విప్పుతున్న ముఖ్యమంత్రి ఆమె ఒక్కరే. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేసిన వారంతా ఇప్పుడు మౌనం దాలుస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత వారిలో పెను మార్పు కనిపిస్తోందని ప్రజలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. మమతా బెనర్జీని రాజకీయంగా సమాధి చేసేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. ఆమెకు గతంలో గట్టి మద్దతు దారులుగా ఉన్న సువేందు అదికారి వంటి వారిని తమ పార్టిలో చేర్చుకుని ఆమెను ఇప్పటికే బలహీనపర్చారు.ఎన్నికల నాటికి ఇంకా మరి కొందరిని ఆమె నుంచి వేరు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, బెంగాల్ ప్రజలు నా వెంటే ఉన్నారన్న ధైర్యంతో ఆమె ముందుకు సాగుతున్నారు. ఆమె అందరు ముఖ్యమంత్రుల మాదిరిగా ఢిల్లీలో ఒక మాట,. రాష్ట్ర రాజధానిలో మరో మాట మాట్లాడటం లేదు. ఎక్కడికి వెళ్ళినా బెంగాలీల ప్రయోజనాలే లక్ష్యంగా ఆమె పోరాటం సాగిస్తున్నారు. మోడీతోనే కాదు. తమ రాష్ట్రానికే చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆనాడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో ఈ విషయమై నిర్మొహమాటంగా మాట్లాడిన ధీర వనిత. ఆమెకు పార్టీలు, పెద్దలకన్నా బెంగాలీల ప్రయోజనాలే ముఖ్యం.అందుకే,ఆమెను వరుసగా రెండు సార్లు రాష్ట్ర ప్రజలు గద్దె నెక్కించారు.

- Advertisement -

మరో సారి పీఠం మీద కూర్చో బెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. బెంగాల్ కు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆమె నిరంతరం పోరాటం సాగిస్తున్నారు.ఆనాడు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీలతో ఆమె రాజీలేని పోరు సాగించారు.ఇప్పటికీ అదే పోరాట పటిమతో ఆమె ముందుకు సాగుతున్నారు. ఆమెను రెచ్చగొట్టేందుకు తృణమూల్ నుంచి తమ పార్టీలోకి వొచ్చిన నాయకుల చేత కమలనాథులు ప్రకటనలు చేయిస్తున్నారు.ఆమె ప్రజల నాడిని తెలిసిన నాయకురాలు.అందుకే,ఎవరెన్ని ప్రకటనలు, ఆరోపణలు చేసినా ఆమె వెరవడం లేదు. బెంగాల్ ప్రయోజనాల కోసమే ఆమె నిరంతర పోరాటం. ఆ విషయం ప్రధానమంత్రికి కూడా తెలుసు.అయితే, దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రాంత నాయకుడు తనకు ఎదురు నిలిచి మాట్లాడ రాదన్న ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ విషయమే తీసుకుంటే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పెద్దపీట వేయడం అనేది ఆనాడు ఉంది, కానీ,ఇంత బరితెగింపుగా నిధులు కేటాయింపు ఎన్నడూ జరగలేదు. అలాగే,ఆయా ప్రాంతాల భావోద్వేగాలతో ముడి పడి ఉన్న ప్రాజెక్టుల జోలికి వెళ్లేందుకు పండిట్ నెహ్రూ నుంచి ఇతర ప్రధాన మంత్రులు వెరిచేవారు.

కానీ, ఆంధ్రప్రదేశ్లలో ఏభై ఏళ్ళక్రితం ప్రజలు విశాఖ ఉక్కు,ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న ఉక్కుఫ్యాక్టరీని ప్రైవేటు సంస్థలకు బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించేందుకు మోడీ సిద్ధ పడుతున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమంలో ముప్పయి ఐదు మంది పైగా మరణించారు.ఇప్పుడు కూడా ప్రాణాలు లెక్కలేకుండా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్థానికులు శపధం చేస్తున్నారు. ప్రజల భావోద్వేగాలను మోడీ పట్టించుకోవడం లేదనడానికి రైతుల భూముల విషయంలో అనుసరిస్తున్న విధానాలే నిదర్శనం. రైతులు ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్దమే కానీ, వ్యవసాయం, భూముల జోలికి వొస్తే సహించరు. పైగా ఇప్పుడు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెట్టేందుకు, మీడియా సంస్థలను సైతం చెయ్యి మెలితిప్పి లొంగబర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇది ప్రజాస్వామిక దేశమనే మాట మర్చిపోతున్నారు.

బెంగాల్ లో కమలనాథుల వ్యూహం విజయవంతమైతే దేశమంతటా నియంతృత్వ పోకడలు మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని లౌకిక వాదులు ఆందోళన చెందుతున్నారు. శనివారం నాటి ర్యాలీల పై దేశవ్యాప్తంగా లౌకిక వాదులు ఉత్కంఠతో ఎదురు చూడటానికి అసలు కారణం అదే.

Leave a Reply